శనివారం 16 జనవరి 2021
Nizamabad - Feb 10, 2020 , 02:16:53

సుగంధ ద్రవ్యాలు కాదు.. పసుపుబోర్డు తీసుకురా

 సుగంధ ద్రవ్యాలు కాదు.. పసుపుబోర్డు తీసుకురా

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పార్లమెంట్‌ ఎన్నికల ముందు పసుపుబోర్డు తీసుకొచ్చి రూ. 15వేల మద్దతు ధర కల్పిస్తామని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మాట మార్చారని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. నగరంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు కోరుకున్నది సుగంధ ద్రవ్యాల (స్పైసెస్‌) బోర్డు కాదని, పసుపుబోర్డు అని అన్నారు. సుగంధ ద్రవ్యాల బోర్డు తెస్తామని హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల అనంతరం పసుపుబోర్డు వస్తుందని మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ప్రజలను నమ్మించి సుగంధ ద్రవ్యాల బోర్డు తీసుకువచ్చారని అన్నారు. కేరళలో ఉన్న స్పైసెస్‌బోర్డు అక్కడ పసుపు రైతులకు మద్దతు ధర కల్పించడం లేదని, నిజామాబాద్‌లో రైతులకు ఏం లాభం చేకూరుతుందన్నారు. బీజేపీ నాయకులు ఇతర దేశాలతో ప్రైవేట్‌ సంస్థల వ్యాపార లాభాలతో మునిగిపోయారని అన్నారు. రైతు పక్షపాతి అయితే పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని, లేకుండా రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని ధ్వజమెత్తారు. స్పైసెస్‌ బోర్డు విషయంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గతంలో స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. 

బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. గత 40 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఎంపీ అర్వింద్‌ ఒక్కరే చేశాడని అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘మీరు కూడా రైతు బిడ్డ కదా? పసుపు పండించే రైతు కదా? మీకు తెలియదా’ అని ప్రశ్నించారు. ఎన్ని రోజులు పసుపు రైతులను మోసం చేస్తారని అన్నారు. రైతులు బీజేపీ పార్టీని, బీజేపీ నాయకులను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ సమావేశంలో నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, డైరెక్టర్లు అక్తర్‌ ఖాన్‌, రాజేంద్రప్రసాద్‌, మాజీ కార్పొరేటర్‌ మహేందర్‌, హన్మాండ్లు గౌడ్‌, సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.