శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 09, 2020 , 01:32:45

ఆర్టీసీకి కలిసొచ్చిన జాతర!

ఆర్టీసీకి కలిసొచ్చిన జాతర!
  • మేడారం జాతరకు నిజామాబాద్‌ రీజియన్‌ నుంచి నడిచిన 300 బస్సులు
  • ఐదు రోజుల్లో రూ. 2 కోట్ల ఆదాయం
  • భక్తులకు మెరుగైన సేవలందించిన ఆర్టీసీ అధికారులు

ఇందూరు: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు నిజామాబాద్‌ ఆర్టీసీ రీజియన్‌ నుంచి 300 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరకు అధిక రద్దీ ఉండడంతో అన్ని బస్టాండ్ల వద్ద ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా నీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించారు. భక్తులు కొంగుబంగారంగా కొలుస్తున్న మేడారం జాతరకు భక్తులు నెల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. బస్టాండుల్లో క్యూలైన్లు లేకుండా ఏ ఒక్క భక్తుడు నిలుచునే ప్రయాణించే పరిస్థితి రాకుండా వెనువెంటనే బస్సులు నడిచేలా, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని నిజామాబాద్‌ ఆర్టీసీ ఆర్‌ఎం సోలోమాన్‌ తెలిపారు. 


నిజామాబాద్‌, కామారెడ్డి, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ పరిధిలో అన్ని బస్డాండ్ల నుంచి బస్సులు నడపడంతో భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ప్రయాణం చేసేందుకు ఆస్కారం ఏర్పడిందన్నారు. జాతరకు వెళ్లి ప్రశాంతంగా మొక్కులు చెల్లించుకునేందుకు అవకాశం కలిగింది. ఈ స్పెషల్‌ బస్సులతో భక్తులకు సౌకర్యంతో పాటు ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. రోజుకు ఒక్కో బస్సుకు రూ. 10వేల నుంచి రూ. 12వేల వరకు ఆదాయం వచ్చింది. ఐదు రోజులు మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాల్లో మేడారం జాతరకు 300 బస్సులను నడిపారు. దీనికి గాను దాదాపు రీజియన్‌కు రూ. 2కోట్ల ఆదాయం సమకూరింది. మునుపెన్నడూ లేని విధంగా ఆదాయం పెరగిందని అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీని బలోపేతం చేసే క్రమంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలు ఆర్టీసీని లాభాల బాటలో పయనించేలా చేస్తున్నది. ఈ తరుణంలో మేడారం జాతర కూడా ఆర్టీసీకి కలిసి వచ్చింది. అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో కొత్త ఉత్తేజం నెలకొంది. 


logo