బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 08, 2020 , 03:43:28

కరోనా..టెర్రర్‌!

కరోనా..టెర్రర్‌!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లావాసులనూ వణికిస్తున్నది. ఉభయ జిల్లాల నుంచి విద్య, ఉద్యోగం, వ్యాపార, వ్యాణిజ్య అవసరాల కోసం కొన్నేండ్లుగా చైనాకు రాకపోకలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన వారి విషయంలో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చైనాలో కరోనా వైరస్‌ సోకి చాలామంది మృత్యువాత చెందారు. అక్కడ పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ఉభయ జిల్లాల నుంచి చైనాకు పర్యటనలు రద్దు చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న మనోళ్లు తిరుగుముఖం పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశానుసారం కరోనా నియంత్రణ కమిటీని జిల్లాలో ఏర్పాటు చేసింది. ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ నాగేశ్వర్‌రావు తెలిపారు. జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖాన ఆవరణలో 25 పడకలతో స్పెషల్‌ వార్డును సిద్ధం చేశామన్నారు. ఇందులో అత్యవసర మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

  • మహమ్మారి వ్యాప్తిపై జిల్లా వాసుల్లోనూ ఆందోళన
  • చైనా పర్యటనలో ఉభయ జిల్లాల వాసులు
  • జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్న వైద్యారోగ్య శాఖ
  • ఆందోళన చెందుతున్న స్థానికులు
  • జిల్లాలో కరోనా నియంత్రణ కమిటీ
  • జిల్లా దవాఖానలో స్పెషల్‌ వార్డు ఏర్పాటు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ఖలీల్‌వాడి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లావాసులనూ వణికిస్తోంది. పలువురు ఉమ్మడి జిల్లా వాసులు చైనా పర్యటన చేస్తుంటారు. వ్యాపార, వాణిజ్య, విద్యావకాశాల కోసం చైనాకు వెళ్తుంటారు. అక్కడి నుంచి వచ్చిన వారి విషయంలో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కరోనా వైరస్‌ సోకి మృత్యువాత పడుతుండడంతో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 


చైనా టూర్లు తగ్గుముఖం.. 

ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన ఓ ఫర్నిచర్‌ కంపెనీకి చెందిన ప్రతినిధులు వ్యాపార అవసరాల కోసం పది రోజులకోసారి చైనాకు వెళ్లి వస్తుంటారు. విభిన్నమైన మోడల్స్‌లో ఫర్నిచర్‌ ఐటమ్స్‌ను తీర్చిదిద్ది స్థానిక వినియోగదారులకు చేరవేసి లాభాలు గడించడం వారి పని. తక్కువ ధరకు, సులువుగా దొరికే ఫర్నిచర్‌ మోడళ్లను పసిగట్టి వాటి సాప్ట్‌వేర్‌ను దిగుమతి చేసుకునేందుకు జిల్లాకు చెందిన వ్యాపారులు నెలలో రెండు, మూడు సార్లు చైనా పర్యటనకు వెళ్లడం పరిపాటి. ఇలా ఓ ఫర్నిచర్‌ షాపు వారే కాకుండా అనేక మంది వ్యక్తులు తమ వ్యాపార, వాణిజ్య అవకాశాల కోసం ఆ దేశ పర్యటనకు వెళ్లి వస్తున్నారు. గడిచిన రెండు, మూడు వారాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మూలంగా జిల్లా నుంచి చైనాకు వెళ్తున్న వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఫలితంగా డ్రాగన్‌ దేశంపై ఆధారపడి వ్యాపారాలు చేస్తున్న వారికి కరోనా వైరస్‌ ఓ రకంగా తీవ్ర నష్టాలనే మిగులుస్తున్నది. కరోనా విజృంభించడం మూలంగా ప్రపంచ దేశాలన్నీ చైనాకు విమానయానాన్ని రద్దు చేశాయి. అంతేగాక ఆ దేశంతో సముద్రపు జల రవాణాను నిషేధించాయి. అక్కడి ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు వెనుకడుగు వేస్తుండడంతో చైనాపై ఆధారపడిన వ్యాపారాలన్నీ తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి.


అనుమానితులకు గాంధీ దవాఖానలో చికిత్స.. 

వ్యాపారులే కాకుండా విద్యాభ్యాసం కోసం చైనాకు వెళ్లిన వారూ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ దేశంలో ఉండలేక, క్లిష్ట పరిస్థితుల్లో చదువుకోలేక ఇంటికి పయనమవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి ఎంబీబీఎస్‌ విద్యను అభ్యసించేందుకు అనేక మంది చైనాకు వెళ్లారు. నాణ్యమైన విద్య పేరుతో కన్సల్టెన్సీల ఎరకు చిక్కిన వారంతా డ్రాగన్‌ దేశంలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇంకొందరు బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కోర్సులు చేయడానికి చైనాకు వెళ్లారు. ఇలా విద్యాభ్యాసం కోసం చైనాకు వెళ్లిన వారంతా కరోనా వైరస్‌ వ్యాప్తితో తిరుగు ప్రయాణం అయ్యారు. చైనా భూభాగంలో పెద్ద ఎత్తున వైరస్‌ వ్యాప్తి చెందడం, వేలాది మందికి కరోనా వైరస్‌ సోకడం వంటి కారణాలతో తల్లిదండ్రుల ఒత్తిడి, భారత ప్రభుత్వ చర్యల్లో భాగంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. చైనా నుంచి స్వదేశానికి వచ్చిన పౌరుల్లో జిల్లా వాసులు సైతం ఉండడం గమనార్హం. చైనా నుంచి వస్తున్న వారందరికీ విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన చర్యలతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించి క్షుణ్ణంగా వైద్య పరీక్షలు చేసి కరోనా వైరస్‌ జాడను పరిశీలిస్తున్నారు.


తూర్పు ఆసియా పర్యటనలు రద్దు.. 

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల నుంచి అనేక మంది వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, ఇతర వర్గాలకు చెందిన వారంతా ఆట విడుపుగా విదేశీ పర్యటనకు వెళ్తుండడం ఈ మధ్య తంతుగా మారింది. ఇందులో ప్రధానంగా చైనా, నేపాల్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, మయన్మార్‌, ఇండోనేషియా వంటి దేశాలను చుట్టేసి రావడం ఉమ్మడి జిల్లా ప్రజల్లో కొంత మందికి అలవాటే. పర్యాటక దేశంగా గుర్తింపు పొందిన థాయ్‌లాండ్‌ వంటి దేశానికి వందలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వైరస్‌ విజృంభన మూలంగా ఔత్సాహికులెంతో మంది తూర్పు ఆసియా దేశాల పర్యటనకు వెళ్లాలంటే జంకుతున్నారంటే అతిశయోక్తి కాదు. చైనాకు థాయ్‌లాండ్‌ సరిహద్దు దేశం కాకపోయినప్పటికీ.. డ్రాగన్‌ దేశంతో రాకపోకలు ఎక్కువగా ఉండడమే కారణంగా తెలుస్తున్నది. కరోనా బీభత్సానికి చైనా నుంచి వ్యాపార అవకాశాలే కాకుండా విదేశీయానం దెబ్బతినే పరిస్థితికి చేరింది.


అప్రమత్త్తమైన జిల్లా యంత్రాంగం.. 

నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశానుసారం కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిజామాబాద్‌ జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ నాగేశ్వర్‌రావు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నావెల్‌ కరోనా వైరస్‌ ఎపిడెమిక్‌ను ఎదుర్కుకోవాడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మనదేశంలో కేరళ రాష్ట్రంలో మాత్రమే 3 కేసులు నమోదు అయ్యాయని, ఇతర రాష్ర్టాల్లో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖాన ఆవరణలో స్పెషల్‌ వార్డును సిద్ధం చేశామన్నారు. ఇందులో 25 పడకలతో వార్డును ఏర్పాటు చేసి అందులో అత్యవసర మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నివారణ కరపత్రాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ వ్యాధిపై సమాచారం కోసం హెల్ఫ్‌లైన్‌ 24/7 అందించడానికి కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు.  చైనా, హకాంగ్‌, థాయిలాండ్‌, సింగపూర్‌ నుంచి మన దేశానికి వచ్చిన వారు జిల్లా వాసులు తలనొప్పి, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని, ఎలాంటి వదంతులు నమ్మొద్దన్నారు. ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు సూపరింటెండెంట్‌ నాగేశ్వర్‌రావు తెలిపారు. 


కమిటీ ఏర్పాటు..

కరోనా వైరస్‌ కమిటీని జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. డాక్టర్‌ టీవీ ఉదయ్‌ కృష్ణ, డాక్టర్‌ సీహెచ్‌ సుభాష్‌కుమార్‌, డాక్టర్‌ గోపాల్‌సింగ్‌, డాక్టర్‌ ఎం. కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ అరుణ్‌కుమార్‌, డాక్టర్‌ దినేశ్‌కుమార్‌ను కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు.


కరోనా వైరస్‌ అంటే..?

వైరస్‌ అనేది లాటిన్‌ పదం. వైద్య పరిభాషలో దీనికి విషం అని అర్థం ఉంది. వైరస్‌లు అతి సూక్ష్మజీవులు. వీటిని మామూలు కంటితో చూడలేం. శక్తివంతమైన మైక్రోస్కోపులతో మాత్రమే చూడగలం. ఇవి ఇతర జీవుల కణాలపై దాడిచేసి వ్యాధులకు కారణం అవుతాయి. ఈ దాడి ముఖ్య ఉద్దేశం తమ సంతతిని పెంచుకోవడమే. వైరస్‌లు విభజన చెందడం ద్వారా వాటి సంతతిని పెంచుకుంటాయి. ఇలా జరగాలంటే వాటికి జీవకణం తప్పనిసరి. అంటే ఇవి ఇతర జీవుల శరీరాల్లోకి ప్రవేశించినప్పుడు మాత్రమే వాటి సంఖ్యను పెంచుకోగలవు. బ్యాక్టీరియాల కన్నా వైరస్‌లు అతి సూక్ష్మమైనవి. జీవుల్లో ఉండాల్సిన అతి ప్రాథమిక నిర్మాణమైన కణ నిర్మాణం వైరస్‌లకు లేదు. ఇతర జీవకణాలపై ఆధారపడకుండా వాటంతట అవి వృద్ధి చెందలేవు. ఎప్పుడైతే మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టం బలహీన పడుతుందో అప్పుడు వైరస్‌లు విజృంభించి వేగంగా తమ సంతతిని పెంచుకుని దాడి చేస్తాయి. అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇవి ఎంత వేగంగా తమ సంఖ్యను పెంచుకుంటాయంటే చివరికి మనుషుల ప్రాణాలనే బలి తీసుకుంటాయి.


logo