సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Feb 08, 2020 , 03:42:49

తండ్రీకొడుకులు తోడు దొంగలు

 తండ్రీకొడుకులు  తోడు దొంగలు
  • ప్రజలను మోసం చేయడం వారి నైజం
  • డీఎస్‌ చరిత్ర అంతా అదే..
  • పసుపు బోర్డు తెస్తానని ఎంపీ మాటతప్పారు
  • తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలి
  • పసుపు బోర్డు తేకపోతే రైతులు ఊరుకోరు
  • నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ డిమాండ్‌

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : ఎంపీలు ధర్మపురి శ్రీనివాస్‌, అర్వింద్‌ ఇద్దరూ తోడు దొంగలని, ప్రజలను నమ్మించి మోసం చేయడం వారి నైజమని, వారిద్దరు తెలంగాణలో ద్రోహులుగా మిగిలారని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు.శుక్రవారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ కృషితో రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన డీఎస్‌ తెలంగాణ ద్రోహి అని, రైతులను పసుపుబోర్డు పేరుతో మోసం చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌ జిల్లా ద్రోహి అని ఆయన విమర్శించారు. 


ఎంపీగా గెలిపిస్తే వారం రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని చెప్పి అర్వింద్‌ రైతులకు హామీ ఇచ్చాడని, గెలిచి ఆరునెలలు గడిచినా బోర్డు ఊసే లేదని ప్రశ్నించారు. ఎంపీ కల్వకుంట్ల కవిత కృషితోనే గతంలో జిల్లాలో పసుపు పార్కు డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు అయ్యిందని ఎమ్మెల్యే బాజిరెడ్డి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌, ఆ పార్టీ జాతీయస్థాయి నాయకుడు రాంమాధవ్‌ సైతం జిల్లాకు వచ్చి పసుపు బోర్డు తెస్తామని జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారని, వారి కల్లబొల్లి మాటలను నమ్మి జిల్లా ప్రజలు ఎంపీగా అర్వింద్‌ను గెలిపించారన్నారు. 


కానీ, వారు హామీని విస్మరించారని ఆరోపించారు. అర్వింద్‌ ఎంపీగా గెలిచి ఆరు నెలలు గడుస్తున్నా ..పసుపు బోర్డు ఊసే లేకుండా పోయిందన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డు అంశాన్ని మళ్లీ తెరపైకి  తీసుకువచ్చి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని, అందుకే పసుపుబోర్డు ఇవ్వలేకపోతున్నామని అబద్ధ్దపు మాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నించాడని ఎమ్మెల్యే విమర్శించారు. రైతులకు పసుపు బోర్డు కంటే ఇంకా పెద్ద బోర్డును తెస్తానని ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులు.. తీరా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా రైతులకు పనికిరాని జిల్లాలో ఉన్న డివిజన్‌ బోర్డును రీజినల్‌ బోర్డుగా మారుస్తామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.  


తాను బీజేపీ అధిష్టానాన్ని ఓ ప్రశ్న అడుగుతున్నానని, మీరు జనానికి ఇచ్చిన పసుపు బోర్డు హామీని ఎందుకు విస్మరించారో చెప్పాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుతోనే రైతులకు మేలు జరుగుతుందని, అదే జరిగితే తాను సంతోషిస్తామని ఎమ్మెల్యే బాజిరెడ్డి పేర్కొన్నారు. అది ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టడం తగదన్నారు. డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయి బోర్డు తీసుకువచ్చి చేతులు దులిపేసుకోవాలని చూస్తే ప్రజలు ఊరుకోరని, ప్రజల చెవిలో కమలం పువ్వులు పెట్టాలని చూస్తున్నారని బీజేపీ నేతల తీరును ఎమ్మెల్యే బాజిరెడ్డి ఎండగట్టారు. 


కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు బోగస్‌ అని పార్లమెంట్‌లో ఎంపీ అర్వింద్‌ పేర్కొనడం చూస్తే, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను చూసి బీజేపీకి కళ్లు తిరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ప్రకటన అనంతరం ఆ శాఖకు చెందిన మంత్రి తెలంగాణలో కల్యాణలక్ష్మి  , షాదీముబారక్‌ పథకాల్లో ఎలాంటి అవకతవకలు లేవని కితాబు ఇచ్చారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని మర్చిపోయేందుకు, లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలు, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. జిల్లా ప్రజలు ఎంపీ అర్వింద్‌ తీరును గమనిస్తున్నారని, పసుపు బోర్డు ఏర్పాటు చేసే రైతులు వదలరని ఎంపీని ఎమ్మెల్యే బాజిరెడ్డి హెచ్చరించారు. 


పసుపు బోర్డు ఏర్పాటు చేసేంత వరకు ఎక్కడికి వెళ్లినా ఎంపీ అర్వింద్‌ను రైతులు అడ్డుకొని నిలదీయాలని, ఆ రాజీనామా చేసే వరకు ఉద్యమాలు చేయాలని జిల్లా రైతాంగానికి ఆయన పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ  ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే లక్ష ఎకరాలకు మంచిప్ప రిజర్వాయర్‌ ద్వారా నీరందిస్తానని హామీ ఇచ్చానని, సీఎం కేసీఆర్‌ను ఒప్పించి రూ.2600 కోలతో పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. పనులు చకచకా జరుగుతున్నాయని, మరో ఏడాది కాలంలో నియోజకవర్గంలో బీడుబారిన లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 


పసుపు బోర్డు తేకుంటే రైతులు నిన్ను పచ్చి మోసకారిగా గుర్తిస్తారని, స్టాంప్‌ పేపర్‌పై రాసిన మాటకు కట్టుబడి ఉండి పసుపు బోర్డు తేవాలన్నారు. లేని పక్షంలో రాజీనామా చేయాలని ఎంపీని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. 30 ఏండ్లుగా డీఎస్‌ జిల్లా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని, అదే దారిలో ఆయన కుమారుడు ఎంపీ అర్వింద్‌ సైతం ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడని విమర్శించారు. అర్వింద్‌ను నమ్మితే జిల్లా మరింత  నష్టపోతుందని ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. 


logo