బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 07, 2020 , 02:54:48

నాన్న బతికుంటే సంతోషించేవాడు..

నాన్న బతికుంటే సంతోషించేవాడు..
  • నాన్న అటెండర్‌గా చేసిన మున్సిపాలిటీలోనే మేయర్‌ పదవి చేపట్టడం సంతోషాన్నిచ్చింది
  • నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తా ..
  • మాజీ ఎంపీ కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా సహకారం తీసుకుంటా ..
  • నమస్తే తెలంగాణ’ తో నగర మేయర్‌ నీతూ కిరణ్‌

నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిన్న మొన్నటి వరకు గృహిణిగా ఉన్న నీతూ కిరణ్‌కు.. అనుకోకుండా వచ్చిన రాజకీయ అవకాశం ఏకంగా ఆమెను మేయర్‌ను చేసింది. ఇదే మున్సిపాలిటీలో ఆమె తండ్రి పెంటయ్య ఒకప్పుడు అటెండర్‌గా పనిచేశాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానంగా కాగా.. ఆ సంతానంలో ఒకరు నీతూ కిరణ్‌. అటెండర్‌గా పనిచేస్తూనే పెంటయ్య పిల్లలందరినీ ఉన్నత చదవులు చదివించాడు. ఆ తర్వాత రిటైరయ్యారు. కొద్దిరోజుల తర్వాత చనిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత ఆయన కుమార్తె నీతూ కిరణ్‌కు రాజకీయ అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. ఎన్నికల్లో పోటీచేసి గెలవడమే కాదు..అనుకోకుండా ఆమెకు మేయర్‌ అవకాశం తలుపుతట్టింది. ఇది ఆమెకూ ఊహించని పరిణామమే. ఇప్పుడంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు.. తండ్రి అటెండర్‌గా చేసిన దగ్గరే .. కూతురు మేయర్‌గా ఎన్నికైందని. ఆమె తండ్రి పెంటయ్య ఇప్పుడుండుంటే.. ఆయనెంతో సంతోషించేవారో..ఇదే విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ పర్సనల్‌ టచ్‌ ఇంటర్వ్యూలో ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తండ్రి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అందరి సహకారంతో నగరాన్ని నంబర్‌స్థానంలో నిలుపుతానని ఆమె పేర్కొన్నారు.


నిన్నా మొన్నటి వరకు గృహిణిగా ఉన్న నీతూ కిరణ్‌కు.. అనుకోకుండా వచ్చిన రాజకీయ అవకాశం ఏకంగా ఆమెను మేయర్‌ను చేసింది. ఇదే మున్సిపాలిటీలో ఆమె తండ్రి పెంటయ్య ఒకప్పుడు అటెండర్‌గా పనిచేశాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా.. ఆ సంతానంలో ఒకరు నీతూ కిరణ్‌. అటెండర్‌గా పనిచేస్తూనే పెంటయ్య పిల్లలందరినీ ఉన్నత చదవులు చదివించాడు. ప్రమోషన్‌పై వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ వరకు ఎదిగి కొంత కాలం ఇక్కడే పనిచేసి రిటైరయ్యారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత ఆయన కుమార్తె నీతూ కిరణ్‌కు రాజకీయ అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. పోటీచేసి గెలవడమే కాదు..అనుకోకుండా ఆమెకు మేయర్‌ అవకాశం తలుపుతట్టింది. ఇది ఆమెకూ ఊహించని పరిణామమే. ఇప్పుడంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు.. తండ్రి అటెండర్‌గా చేసిన దగ్గరే .. కూతురు మేయర్‌గా ఎన్నికైందని. ఆమె తండ్రి పెంటయ్య ఇప్పుడుండుంటే.. ఆయనెంతో సంతోషించేవారో..ఇదే విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ పర్సనల్‌ టచ్‌ ఇంటర్వ్యూలో ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తండ్రి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తాను మేయర్‌గా ఎన్నిక కాగానే తన ఇద్దరన్నయ్యలు.. ఇదే మాటన్నారట.. ‘నాన్నుండుంటే ఎంతో సంతోషించేవార’ని.. తన చదువు, వివాహం, కుటుంబ జీవితం, రాజకీయ అరంగేట్రం.. గురించి ఆమె ఇంటర్వ్యూలో వివరించారు.


నమస్తే తెలంగాణ ప్రతినిధి: మీ కుటుంబ నేపథ్యం?

మేయర్‌: పేద కుటుంబం మాది. నాన్న పెంటయ్య మున్సిపాలిటీలో అంటెండర్‌గా చేసేవారు. ఇద్దరన్నయ్యలు. ఆ తర్వాత నేను. మమ్మల్నందరినీ మంచిగా చదివించారు. నేను ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ (ఇంగ్లిష్‌) పూర్తిచేశాను. ఇద్దరన్నలు ఉద్యోగాలు చేస్తున్నారు. నాన్న కష్టార్జితంతో చదువుకొని మంచి పొజిషన్‌లో ఉన్నాం. 


మీది ప్రేమ వివాహమని తెలిసింది. దండు శేఖర్‌తో పరిచయం ఎలా ఏర్పడింది?

ఔను..మాది ప్రేమ వివాహమే. దండు అనసూయ కొడుకు దండు శేఖర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాను. అత్తయ్య రెండుసార్లు కౌన్సిలర్‌గా చేశారు. శేఖర్‌కు చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో అమ్మే అన్నీ తానై పెంచింది. కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఇతరులకు సేవ చేయాలనే తపన నేను ఆయనలో చూశా. రెండు కుటుంబాలు ఎదురెదురుగా  ఉండేవి. అలా శేఖర్‌ వ్యక్తిత్వాన్ని దగ్గర చూసి ఇష్టపడి పెళ్లిచేసుకున్నాం. మా పెద్దలు మొదట అంగీకరించలేదు. అత్త దండు అనుసూయ మా ప్రేమకు అంగీకారం తెలిపారు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకు మా తల్లిదండ్రులు కూడా చేరదీశారు.


వైవాహిక జీవితం గురించి.. 

పెళ్లి చేసుకున్న తర్వాత గృహిణిగానే ఉన్నాను. పదో తరగతి వరకు నగరంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో చదువుకున్నాను. ఇంటర్‌, డిగ్రీని ఉమెన్స్‌ కాలేజీలో పూర్తి చేశాను. బీఎస్సీ (ఇంగ్లిష్‌) చదివాను. 1991లో దండు శేఖర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాను. మాకు ముగ్గురు సంతానం. పెద్దబాబు దండు కృష్ణచైతన్య హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్‌ ఏఈగా పనిచేస్తున్నాడు. రెండో సంతానం దండు రఘువంశీ బీటెక్‌ పూర్తి చేశాడు. మూడో సంతానం రుషిత.. మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నది. నేను రేషన్‌ డీలర్‌గా చేశాను. 


రాజకీయాలపై ఆసక్తి ఉండేదా?

అసలు లేకుండే. అత్తమ్మ రాజకీయాల్లో ఉండడం.. శేఖర్‌ (భర్త) రాజకీయ పదవులు లేకున్నా తల్లికి సపోర్టుగా తిరిగేవాడు. అలా ప్రజలు నిత్యం ఇంటికి వచ్చేవారు. వారితో మంచి చెడ్డా మాట్లాడేదాన్ని. వారి సమస్యలు విని .. ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో చెప్పేదాన్ని. అలా నాకు ప్రజా సమస్యలపై అవగాహన పెరిగింది. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేకున్నా.. భర్తను చూసి స్ఫూర్తి పొందాను. ఆయన పడే తపన.. ఇతరులకు సేవ చేయాలనే ఆలోచన నాకు నచ్చేది. ఇలా అనుకోకుండా వచ్చిన అవకాశంతో రాజకీయాల్లోకి వచ్చాను. అదృష్టం వరించి మేయర్‌ అయ్యాను. 


పుస్తక పఠనం అలవాటుందా? ఇంట్లో ఖాళీగా ఉన్న సమయాల్లో ఏం చేసేవారు?

పుస్తకాలు పెద్దగా చదవకపోయేది. ప్రతీ ఆదివారం మేగజైన్‌లలో వచ్చే పజిల్స్‌ ఆసక్తిగా నింపేదాన్ని. ఖాళీ సమయం ఉండేది కాదు. నేను చదవుకున్నందుకు సార్థకత చేకూరాలంటే, నా పిల్లలకు మంచి చదవులు చెప్పించాలని తపన పడేదాన్ని. పిల్లలతోనే ఎక్కువగా గడిపేదాన్ని. వారి చదువులో ముందుండేందుకు ఎంతో సమయాన్ని వెచ్చించి కష్టపడేదాన్ని. వారికి మంచి మార్కులు వచ్చినప్పుడు చూసి పడిన కష్టాన్ని మరిచిపోయేదాన్ని. 


మీ స్కూల్‌ టైమ్‌లో ఆటలు ఆడేవారా? దేంట్లోనైనా ప్రావీణ్యం ఉందా? 

ఆటలు పెద్దగా ఆడలేదు. కానీ, కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ ఉంటే ముందుండేదాన్ని. స్పీచ్‌లు ఇచ్చేదాన్ని. దేనిమీదైనా వ్యాసాలు రాసి చదివేదాన్ని. అలా నాకు చిన్నప్పట్నుంచే స్టేజీ ఫియర్‌ అంటే తెలియదు. డాన్సులు బాగా చేసేదాన్ని. అందరూ మెచ్చుకునేవారు. 


చదువులో ముందుండేవారా?

నేనే ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌.. ఎప్పుడైనా కొన్ని మార్కులు తక్కువొస్తే ఎందుకు తక్కువొచ్చాయని బాగా ఆలోచించేదాన్ని. మళ్లీ క్లాస్‌ ఫస్ట్‌ కోసం బాగా చదివేదాన్ని. నేను క్లాస్‌లో మంచి మార్కులు తెచ్చుకోవాలనే తపన బాగుండేది.


గృహిణిగా ఉన్న మీరు.. ఇప్పుడు మేయర్‌ అయ్యారు. ప్రజాసేవలో ఎలా కొనసాగుతారు?

నాకు ప్రజా సమస్యలపై అవగాహన ఉంది. నిత్యం ఇంటికి వచ్చేవారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేది. మేయర్‌ కాగానే చాలా మంది తమ కాలనీలకు ఆహ్వానించి సన్మానించారు. నేను మాట్లాడాను. స్టేజీ ఫియర్‌ లేదు కాబట్టి.. సమస్యలను ఆకలింపు చేసుకొని పరిష్కారం కోసం కృషిచేస్తానని చెప్తున్నాను. నా భర్త శేఖర్‌ ఇచ్చిన స్ఫూర్తితో ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నాను. నా భర్త తోడురాకున్నా.. నేను సింగిల్‌గా వెళ్లి మీటింగులలో మాట్లాడే అవగాహన, చొరవ నాకున్నాయి. కాబట్టి ఇబ్బంది లేదు. 


మేయర్‌గా ఎన్నికైన తర్వాత  మీ పిల్లలు ఏమన్నారు?

ఇద్దరు కొడుకులు కూడా ఎంతో సంతోషపడ్డారు. ‘అమ్మా.. నీతో అవుతుందా? తిరగగలుగుతావా? ’ అని సందేహించారు. నేను ధైర్యంగా ఉండడంతో వారిలో కూడా ధీమా పెరిగింది. అందరి సహకారంతో ప్రజాసేవ చేస్తాను. నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాను. 


నగరాభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? ఏమేం చేస్తారు?

నగరాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం తీసుకుంటాను. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మాజీ ఎంపీ కవిత సహకారం తీసుకుంటాను. వారి సలహాలు, సూచలను పాటిస్తాను. నిధులు రాబట్టే విషయంలో వీరి సహకారాన్ని తీసుకొని అభివృద్ధి చేస్తాను. నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేయర్‌గా నా పీరియడ్‌లో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగేలా చొరవ తీసుకుంటాను. కష్టపడి పనిచేస్తాను. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను.అరవై డివిజన్లున్న పెద్ద కార్పొరేషన్‌ మనది. శివారు గ్రామాలు కూడా విలీనమైనాయి. వాటి అభివృద్ధి కూడా వేగంగా జరిగేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడ్తాను. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సహకారం తీసుకొని వాటిని పట్టణీకరించే క్రమంలో కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తాను. అభివృద్ధి పథంలో నడిపిస్తాను. 


logo