శనివారం 30 మే 2020
Nizamabad - Feb 07, 2020 , 02:52:47

కొత్త రెవెన్యూ చట్టంతో అందరికీ మేలు

కొత్త రెవెన్యూ చట్టంతో అందరికీ మేలు

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: కొత్త రెవెన్యూ చట్టంతో సేవలు మెరుగుపడతాయని, రెవెన్యూ ఉద్యోగులు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా తమ గుర్తింపును కోల్పోతామనే భావనతో రెవెన్యూ ఉద్యోగులు అపొహ పడుతున్నారని, భయపడాల్సిన అవసరం లేదని, మీ వెంట నేను ఉన్నానని పేర్కొన్నారు. ప్రభుత్వం అంటే రెవెన్యూ శాఖ అని, ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు సీఎం మొదటగా కలెక్టర్‌, తహసీల్దార్‌ను గుర్తుచేసుకుంటారని, రెవెన్యూ శాఖ అంటే ప్రభుత్వానికి నోడల్‌ డిపార్ట్‌మెంట్‌ అని తెలిపారు. సమస్యలు వస్తాయని, వాటిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. దశాబ్దాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఇబ్బంది తొలగించడానికి సీఎం సాహసోపేతంగా భూరికార్డుల ప్రక్షాళన కోసం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీఎం రెవెన్యూ శాఖపై ఉన్న నమ్మకమే ధైర్యంగా ముందుకు వెళ్లడానికి కారణమైందని పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు రాత్రివేళల్లో కూడా పనిచేశారని, కొద్దిమంది తీరుతో శాఖ కొంత బద్నాం అయ్యిందని తెలిపారు. 


దీని గురించి చర్చించుకొని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ అందరి సంక్షేమం కోసం ఆలోచిస్తారని తెలిపారు. ఎవరిపైనా కోపం లేదని, రెవెన్యూ వ్యవస్థలో ఎక్కడో పొరపాటు జరగడంతో లోపం ఏర్పడిందని, దానిని సరిచేయడానికి కొత్త చట్టం గురించి ఆలోచిస్తున్నారని, ప్రజలు, రైతులకు మెరుగైన సేవలు అందించడానికే దీనికి రూపకల్పన చేస్తున్నారని, ఉద్యోగులపై ఎలాంటి కోపం లేదని, వారెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ‘నేను మీతో ఉంటా.. అందరం కలిసి ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దాం.. ఎన్నికల సందర్భంగా జరిగిన బదిలీలను తిరిగి వారి స్థలాలకు పింపిస్తామని , సర్వీస్‌ పరంగా అన్ని కూడా పరిష్కరిస్తాం.. ఉద్యోగుల్ని టార్గెట్‌ చేసే అవసరం ప్రభుత్వానికి లేదు..  ఎవరో చెప్పింది నమ్మవద్దు..’ అని మంత్రి హితవు పలికారు.  జిల్లాలో ఉద్యోగులకు బీమా, రక్తదానం, పేద విద్యార్థులకు చదువుల కోసం సహాయం తదితర కార్యక్రమాలు చేయడం ప్రశంసనీయమన్నారు. ఇతర జిల్లాలో కూడా వీటిని కొనసాగిస్తే బాగుంటుందని తెలిపారు. రెవెన్యూ సంఘం సహాయంతో ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చదువుకున్న విద్యార్థులను సన్మానించారు. 


ప్రజలకు సేవలందించడమే ఉద్యోగుల విధి : కలెక్టర్‌ నారాయణరెడ్డి

తాను తొమ్మిది ఏండ్లు రెవెన్యూశాఖలో పనిచేశానని, సమస్యలు వచ్చినప్పుడు ప్రజలకు ప్రభుత్వం తరపున ముందుగా కనిపించేది రెవెన్యూశాఖేనని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమయంతో సంబంధం లేకుండా సెలవులు, పండుగలను, కుటుంబ సభ్యులను కూడా వదులుకొని పనిచేస్తారని తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన 100శాతం పనిచేశారని, పలు కార్యక్రమాలతో రికార్డు కొంత దెబ్బతిన్నదని, సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో కొంత నష్టం జరిగిందని, రైతులకు బాధ కలిగిందని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన ద్వారానే అమలు చేయబడుతున్నదని, దీని ద్వారా ఫిజికల్గా లేని ఎన్నో భూరికార్డులకు పరిష్కారం దొరికిందని, తద్వారా ప్రభుత్వానికి కూడా రైతుబంధు ఆదా జరిగిందన్నారు. కొంత మందితో రెవెన్యూ శాఖకు చెడ్డపేరు ఆపాదించుకోవాల్సి వచ్చిందని, కొందరు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని కలెక్టర్‌ పేర్కొన్నా రు. కష్టపడే వాళ్లు చాలా మంది ఉన్నారని, కొందరితోనే చెడ్డపేరు వస్తుందన్నారు. బాధ్యతల కారణంగా ఒత్తిడి ఉండవచ్చని, దానిని అధిగమించాలన్నారు. తమ వద్దకు వచ్చే ప్రజలకు సకాలంలో పనులు పూర్తిచేసి వారి మన్ననలు పొందాలన్నా రు. రెవెన్యూ శాఖ అంటేనే ప్రభుత్వమని, మనం బాగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రా వు, ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో అంజయ్య, రాష్ట్ర సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి , ప్రధాన కార్యదర్శి గౌతమ్‌ కుమార్‌,  జిల్లా అధ్యక్షుడు రమణ్‌రెడ్డి, పలు జిల్లాల సంఘ నాయకులు, ఉద్యోగులు, తదితరులు, పాల్గొన్నారు. 

రెవెన్యూలో వెయ్యేనుగుల బలం!

పాలనలో కీలకమైన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రజలకు మరింత చేరువయ్యేలా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని ఆలోచన ఆశాఖ ఉద్యోగుల్లో నిన్నటి వరకు తీవ్ర కలవరాన్ని సృష్టించింది. అనేక అపోహలు, అనుమానాల నడుమ ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి.. గురువారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇచ్చిన ధీమాతో వెయ్యేనుగుల బలం వచ్చింది. కొండంత ధైర్యం తోడైంది. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రిని వేముల ప్రశాంత్‌రెడ్డిని ఆహ్వానించారు. వేదిక డైరీ ఆవిష్కరణే కానీ.. తమ శాఖ పరిధిలో ఆగమ్యగోచరంగా భావిస్తున్న ప్రస్తుత సందర్భాన్ని మంత్రి ముందుంచి ప్రభుత్వానికి తమ ఆవేదన తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రిని ఆహ్వానించారు. మంత్రి సైతం ఉద్యోగులు చెప్పగానే కార్యక్రమానికి ఓకే చెప్పారు. అందరూ అనుకున్న సమయానికి సమావేశానికి హాజరై మంత్రి.. రాగానే కీలక నేతలు తమ ఆవేదనను వరుసగా మంత్రి ముందుంచారు. 


వివిధ జిల్లాల నుంచి రెవెన్యూ ఉద్యోగులు హాజరు కావడంతో పాటు రాష్ట్ర నాయకత్వం హాజరైంది. ఈసీ మీటింగ్‌ ఇక్కడే నిర్వహించుకోవాలని నిర్ణయించుకుని వచ్చిన రాష్ట్ర నాయకత్వం.. అంతకు ముందు జరిగే ఈ ముఖ్యమైన మంత్రి మీటింగ్‌కు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. మంత్రికి తమ ఆవేదన వెలిబుచ్చితే, అది సీఎం కేసీఆర్‌ వద్ద తమ అభ్యర్థనను ఉంచినట్లేనని భావించిన రెవెన్యూ ఉద్యోగులు.. ఒక క్రమ పద్ధ్ధతిలో తమ మనసులోని ఆవేదనను చెప్పుకు వచ్చారు. అందరి మాటలను సావధానంగా విన్న మంత్రి.. చివరగా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడుతారోననే ఉత్కంఠ ఆ సభలో ఏర్పడింది. ఆయన మాట్లాడే ప్రతిమాట వినేందుకు అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆగ్రహం, చురకలు ఉంటాయని లోలోన భయపడ్డారు. అయితే వారు ఊహించినదానికి భిన్నంగా మంత్రి ప్రసంగం ఆసాంతం రెవెన్యూ ఉద్యోగుల నెత్తిమీద పాలు పోసిన చందంగా కొనసాగింది. లోలోపల గూడుకట్టుకొని వేధిస్తున్న సవాలక్ష సందేశాలకు ఆయన ప్రసంగం అద్భుత సమాధానమిచ్చింది. అపోహలన్నీ చేతితో తుడిచేసినట్లుగా తొలగిపోయాయి. అనుమానపు నీడలు గాలిపింజల్లా తేలిపోయాయి. ఉనికి కోల్పోతున్నామనుకున్న ఉద్యోగుల భ్రమలు పటాపంచలయ్యాయి. సాక్షాత్తూ సీఎం కేసీఆరే ఆ వేదికగా తమకు అభయహస్తాన్ని ఇచ్చారనే కొండంత ధైర్యం వారి ముఖాల్లో కనిపించింది. అందరి మోములో చిరునవ్వు తాండవించింది. నిన్నటి వరకు మాడిపోయిన ముఖాలు మంత్రి ప్రసంగంతో వెయ్యివో ఓల్టుల బల్బులా వెలిగిపోయాయి. 


ఇందుకు ప్రధాన కారణం.. మంత్రి నిజాయితీగా రెవెన్యూ ఉద్యోగుల సేవలను కొనియాడడంతో పాటు కొత్త రెవెన్యూ చట్టం కేవలం వ్యవస్థలో లోపాలు సరిచేసి ప్రజలకు మరింత మేలు చేసేందుకే తప్ప, ఉద్యోగుల మీద కోపంతో కాదని ఆయన సవివరింగా చెప్పడమే. తెలంగాణ సాధించిన కేసీఆర్‌ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారని, ఆయన ఆలోచనలన్నీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే కొనసాగుతాయని వివరించారు. అలాంటి పరిస్థితుల్లో భూరికార్డుల ప్రక్షాళన ద్వారా ఎంతో శ్రమకోర్చి పనిచేసిన రెవెన్యూ ఉద్యోగులపై కోపం ఎందుకు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించడం అక్కడున్న అందరినీ ఆశ్చర్య చకితులను చేయడంతో పాటు ఆనందడోలికల్లో తేలియాడించింది. మీకు నేనున్నానంటూ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అభయహస్తాన్ని ఇవ్వడం.. అప్పటి వరకు లోలోన ఏ మూలనో గూడుకట్టుకొని ఉన్న ఆ కొంత అనుమానం కూడా చెల్లాచెదురైపోయింది. ఇక వారి ఆనందానికి హద్దుల్లేవు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి రూపంలో కేసీఆర్‌ వచ్చి రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులు అభయహస్తాన్నిచ్చిన అనుభూతిని పొందిన ఉద్యోగులు.. కొండంత ధైర్యం, వెయ్యేనుగుల బలంతో ఆ సభ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఈసీ మీటింగులో ఒక్కొక్కరిగా తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కృతనిశ్చయంతో, ముక్తకంఠంతో నినదించారు. ఎవరో చేస్తున్న పొరపాట్లకు శాఖ పూర్తిగా బద్నాం అయ్యే పరిస్థితి నుంచి బయటపడాలని, లోపాలు తెలుసుకొని పరివర్తన దిశగా ముందుకు పోవాలని నిర్ణయించారు. అలా అయితేనే రెవెన్యూ శాఖ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆహ్వానం మేరకు కీలక సమయంలో సమావేశానికి వచ్చి రెవెన్యూ ఉద్యోగులు అపోహల తొలగించారు. సుడిగుండంలో కొట్టుకుపోతున్న తరుణంలో   మంత్రి కొండంత అండనిచ్చి, ధైర్య వచనాలు పలికారని అసోసియేషన్‌ భావిస్తోంది. దీనికి గాను నేడు ప్రశాంత్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలపాలని ఈసీ మీటింగులో నిర్ణయం తీసుకున్నారు. 


logo