గురువారం 04 జూన్ 2020
Nizamabad - Feb 06, 2020 , 01:30:10

సహకార పోరుకు సన్నద్ధం

సహకార పోరుకు సన్నద్ధం
  • మంత్రి వేముల ఆధ్వర్యంలో సిద్ధమైన టీఆర్‌ఎస్‌ క్యాడర్‌

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఇప్పటి దాకా జరిగిన వరుస ఎన్నికల్లో ఘన విజయాలు సాధిస్తూ వస్తున్న టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో సహకార ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు అన్ని విధాల సిద్ధమైంది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో సహకార ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీ క్యాడర్‌ కృషి చేయడానికి సిద్ధమైంది. సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు దిశానిర్దేశంలో ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించేలా పార్టీ ముందుకు సాగనున్నది. ఉమ్మడి జిల్లాలో 144 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 89, కామారెడ్డి జిల్లాలో 55 సహకార సంఘాలు ఉన్నాయి. 144 పీఏసీఎస్‌ పరిధిలో జరిగే ఎన్నికల్లో మొత్తం 1872 డైరెక్టర్‌ స్థానాలను కైవసం చేసుకునేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. 


రైతుల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు రైతుల మనసుల్లో నిలిచిపోయాయి. రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు సాగునీటి రంగానికి ప్రభుత్వం మొదటి నుంచి పెద్దపీట వేస్తూ వస్తున్నది. కాళేశ్వరం నీటిని ఇప్పటికే పునరుజ్జీవం పథకంతో ఎస్సారెస్పీ గడప వరకు చేర్చింది. అటు కామారెడ్డి జిల్లాకు కాళేశ్వరం జలాలను అందించేందుకు వేగంగా కృషి జరుగుతున్నది. రైతులకు విత్తనాల కొరత లేకుండా చూస్తున్నది. ఇలా రైతులకు పెద్దపీట వేస్తున్న పథకాలతో రైతాంగం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటున్నది. ఇది వరకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఇందుకు నిదర్శనం. ఇదే ట్రెండ్‌లో పీఏసీఎస్‌ ఎన్నికల్లోనూ రైతులు టీఆర్‌ఎస్‌కు ఘనవిజయం కట్టబెట్టడంఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. 


నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ..

సహకార ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 6, 7, 8 తేదీల్లో కొనసాగనున్నది. 9న స్క్రూటినీ, 10న ఉపసంహరణ నిర్వహిస్తారు. 15వ తేదీన పోలింగ్‌ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరగనున్నది. ఫలితాలు ప్రకటన ముగిసిన తర్వాత 16వ తేదీన పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్లు ఎన్నుకుంటారు.logo