గురువారం 28 మే 2020
Nizamabad - Feb 06, 2020 , 01:24:31

అన్నవరంలో మహాయాగం

అన్నవరంలో మహాయాగం

వరంగల్‌ రూరల్‌, జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ:  తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి ఆలయ సన్నిధిలో ఈ నెల 11 నుంచి తొమ్మిది రోజులపాటు చతుర్వేద హవన సహిత పంచాయతన పూర్వక త్రిపాద్విభూతి మహా వైకుంఠ నారాయణ యాగం నిర్వహిస్తున్నామని  ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) డీవీఎస్‌ కృష్ణారావు వెల్లడించారు. యాగం నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ 9 రోజుల పాటు అన్నవరంలో జరిగే మహాయాగాన్ని వంద మంది సుప్రసిద్ధ వేద పండితులు, రుత్వికులు నిర్వహిస్తారని చెప్పారు. లోక కల్యాణార్థం తలపెట్టిన ఈ యాగం ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, 19న పూర్ణాహుతితో సంపూర్ణమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని, ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.  


ఆసక్తి గల భక్తులు  రూ.5,116 లేదా రూ.1,116 చెల్లించి ఒకరోజు యాగంలో స్వయంగా పాల్గొనవచ్చని చెప్పారు. రూ.5,116 చెల్లించిన వారికి శ్రీస్వామివారి ప్రసాదం, పంచ, కండువా, చీర, జాకెట్టు, రూ.1,116 చెల్లించిన వారికి  ప్రసాదం, కండువా, జాకెట్టు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. యాగంలో పాల్గొనదలిచిన భక్తులు  టు ది ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం, అన్నవరం పేరుతో డీడీ రూపంలో చెల్లించాలని,  ఇతర వివరాల కోసం అన్నవరం ఆలయంలోని 08868 239999 లేదా 94912 49990 నంబర్లకు కాల్‌ చేసి సంప్రదించాలని ఈవో కృష్ణారావు సూచించారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా తెలంగాణలోని ఇంటింటా ప్రతి శుభకార్యంలో సత్యనారాయణస్వామి పూజలు అందుకుంటున్నారని కృష్ణారావు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి అన్నవరం క్షేత్రానికి నేరుగా రవాణా వసతి ఉన్నట్లు ఈవో తెలిపారు.logo