శనివారం 30 మే 2020
Nizamabad - Feb 05, 2020 , 01:56:37

పసుపు బోర్డు పేరిటఅర్వింద్‌ పచ్చి మోసం

పసుపు బోర్డు పేరిటఅర్వింద్‌ పచ్చి మోసం

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ‘కొంత కాలంగా ఊహించినట్లే ఎంపీ ధర్మపురి అర్వింద్‌ రైతులను మోసం చేశాడు..అర్వింద్‌ తరఫున ఎన్నికల్లో పసుపు బోర్డుపై హామీ ఇచ్చిన బీజేపీ మోసం చేసింది. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి, బాండ్‌పేపర్‌ రాసి ఇచ్చిన అర్వింద్‌.. బోర్డు తేలేదు కదా ఏకంగా బోర్డు అనే మాటనే లేకుండా మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు’ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి పసుపును వేరుచేసి ప్రత్యేకంగా పసుపు బోర్డు కావాలని తాము పదిహేను ఏండ్లుగా డిమాండ్‌ చేస్తుంటే, సుగంధ ద్రవ్యాల బోర్డుకే సంబంధించిన ఆఫీసును, బంగ్లాను ఏర్పాటు చేస్తూ..దానిని పసుపు బోర్డుకంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నదిగా అర్వింద్‌ చెప్పడాన్ని ఓ జాతీయస్థాయి అబద్ధ్దంగా రైతులు అభివర్ణిస్తున్నారు. పసుపు బోర్డు డిమాండ్‌ను నీరుగార్చేందుకు, నమ్మి ఓటేసిన రైతులనే కృతజ్ఞత కూడా లేకుండా అర్వింద్‌ పసుపు బోర్డు గురించి తమకు ఏమీ తెలియదన్నట్లు, తమను మభ్యపెట్టే చర్యలు అవలంభిస్తున్నాడని రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మంగళవారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చేసిన ప్రకటన చూశాక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు కోసం దశాబ్దంన్నర కాలంగా చేస్తున్న డిమాండు, బోర్డు కోసం ఎంపీగా కల్వకుంట్ల కవిత చేసిన కృషిని, లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ, అర్వింద్‌ హామీలు ఇచ్చి, ఆనాక తికమక ప్రకటనలతో కాలం గడిపి.. తీరా స్పైసెస్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ తెచ్చి, దానిని బోర్డు కంటే ఎక్కువ అని నమ్మబలికే దాకా పరిణామాలను ఇందూరు రైతులు గుర్తు చేసుకుంటున్నారు.


పసుపుబోర్డు కోసం కవిత అలుపెరగని ఉద్యమం.. 

రైతులు పసుపునకు ధర రాక, పంట పెట్టుబడి దక్కక ఆవేదన చెందుతున్నారు. పసుపు బోర్డు మాత్రమే తమకు మేలు చేస్తుందని వారంతా భావించారు.ఈ మేరకు ఉద్యమించారు. వారి ఉద్యమానికి ఆది నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటూ వచ్చింది. కానీ, పసుపు బోర్డు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాబట్టి కేంద్రమే ఇవ్వాల్సి ఉంటుంది.అందుకే నిజామాబాద్‌ ఎంపీగా కల్వకుంట్ల కవిత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కండ్లు తెరిపించడానికి నిరంతరం రాజీ లేని పోరాటం చేశారు. పార్లమెంట్‌లో పసుపు రైతుల గళం వినిపించారు. బోర్డు కావాలని, పసుపు సాగుచేసే ఆరు రాష్ర్టాల సీఎంల మద్దతు కూడగట్టారు. వారితో కేంద్రంలోని బీజేపీకి మద్దతు లేఖలు ఇప్పించారు. ఎంపీగా కవిత చేసిన పోరాట ఫలితంగా పార్లమెంటు సబ్‌ కమిటీ హైదరాబాద్‌ వచ్చి రైతులను కలిసింది. పసుపు బోర్డే ఏకైక ఎజెండాగా రైతులు తమ అభిప్రాయాలు తెలిపారు.అప్పుడే స్పైసెస్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తామని అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. దీనికి రైతులు నిర్ధంద్వంగా తిరస్కరించారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద రైతులు చేసిన దీక్ష సమయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేత రాజ్‌నాథ్‌సింగ్‌ దీక్ష వద్దకు వచ్చారు. తాము అధికారంలోకి రాగానే బోర్డు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు బోర్డు ఉందుకు ఇవ్వరు అని రైతులు ఆగ్రహించారు. కానీ, ఇవేమీ పట్టకుండా పసుపు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.కానీ, కవిత పోరాటం ఆపలేదు. పార్లమెంటులో బోర్డు పై చర్చకు అవకాశం కల్పించక పోవడంతో కవిత ప్రైవేటు బిల్లు పెట్టి మరీ పోరాడారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బోర్డు మాత్రం ఇవ్వలేదు.


బోర్డు పేరిట ఓట్ల గాలం.. నయామోసం.. 

ఈ పరిణామాల అనంతరం లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో బోర్డు తెస్తానంటూ బీజేపీ నుంచి అర్వింద్‌  ప్రచారం మొదలు పెట్టారు. రైతులకు బాండ్‌ పేపర్‌ రాసి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలో రైతులకు కావాల్సినవన్నీ సీఎం కేసీఆర్‌ ఇస్తున్నాడు..బోర్డు ఇచ్చేది కేంద్రం..కాబట్టి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే బోర్డు వస్తుందని ఆశపడ్డారు రైతులు. తీరా ఎంపీగా గెలిచాక అరవింద్‌ పసుపు బోర్డు అవసరం లేదనే మాటలు వినిపిస్తుండడంతో రైతుల్లో ఆయన మీద ఆగ్రహం, అవిశ్వాసం వ్యక్తమయ్యాయి. తీరా బోర్డుకే చెందిన ఎక్స్‌టెన్షన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఇది పసుపు బోర్డు కంటే ఎక్కువ ఉపయోగాలను ఇస్తుందని చెప్పడంతో రైతుల్లో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరింది. ఈ సందర్భంగా రైతులు పలు ప్రశ్నలు ఎంపీ అర్వింద్‌కు సంధిస్తున్నారు. మసాలా బోర్డులో పసుపును చేర్చి కాంగ్రెస్‌ వాళ్లు తప్పు చేశారన్న అర్వింద్‌..  ఇప్పుడు మసాలా బోర్డు కార్యాలయాన్నే ఏర్పాటు చేయిస్తే పసుపు రైతుకు ఎలా న్యాయం జరుగుతుందో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. వరంగల్‌లో ఇలాంటి కార్యాలయమే ఏర్పాటు చేస్తే అక్కడ మిర్చి పంటతో పాటు ఏ పంటకూ మేలు జరగలేదని తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. పసుపు పార్కు ఏర్పాటు తమతో కాదని బీజేపీ సర్కారు చేతులెత్తేస్తే.. కల్వకుంట్ల కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వినతితో కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే వేల్పూర్‌ వద్ద పసుపు పార్కు నెలకొల్పుతుంటే, దానిని కూడా తన ఖాతాలో వేసుకునేందుకు ఎంపీ అర్వింద్‌ ప్రయత్నించడం లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.


సర్వరోగ నివారణి పసుపు బోర్డే.. 

పసుపు బోర్డుకు..పీయూష్‌ గోయల్‌ చెప్పిన ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌కు తేడాలను గుర్తు చేస్తున్నారు రైతులు. పసుపును సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి వేరు చేసి ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే  బోర్డు మద్దతు ధర నిర్వహిస్తుంది. బై బ్యాక్‌ ఒప్పందాలు చేస్తుంది. ఇక్కడే ల్యాబ్‌లు ఏర్పాటు చేసి విరివిగా నిత్యం పరిశోధనలు చేస్తుంది. కానీ, బోర్డులోనే ఉండే ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ పసుపు కోసమే కాకుండా అన్ని పంటలను చూడాల్సి ఉంటుంది.దీంతో పసుపునకు మాత్రమే జరిగే ప్రత్యేక కృషి ఉండదు.అర్వింద్‌ ఇచ్చిన మాటను దొడ్డిదారిన తప్పించుకునే మార్గమే ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ అంటున్నారు. ఇది రైతులు కోరుతున్న ప్రత్యేక పసుపు బోర్డుకంటే ఎక్కవ ప్రయోజనాలు ఇస్తుందని అర్వింద్‌ చెప్పడం జాతీయ స్థాయి అబద్ధ్దం అంటున్నారు. పసుపు బోర్డు కోసం, పసుపు మద్దతు ధర కోసం తమ పోరాటాన్ని జాతీయ స్థాయికి తెలిసేలా రైతులు చేస్తే.. జాతీయస్థాయి అబద్ధంతో అర్వింద్‌ బోర్డును, మద్దతు ధర ఆశలను నీరు గార్చారని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పసుపు బోర్డు సాధ్యం కాదు..

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదు. స్పైసెస్‌ బోర్డు అనుబంధ కార్యాలయాన్ని మాత్రమే ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాం.

  • -2017 మే 20న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

రూ.20కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు

బాల్కొండలో స్పైసెస్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతోపాటు రూ.20కోట్లు కేటాయించినందుకు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు గారికి ధన్యవాదాలు. 

  • -2018 జనవరి 3న అప్పటి ఎంపీ కవిత ట్వీట్‌

పసుపు బోర్డు కావాలి.. స్పైసెస్‌ బోర్డు రీజినల్‌ ఆఫీసు కాదు 

ఇది వరకే వరంగల్‌లో స్పైసెస్‌ బోర్డు ఆఫీసు ఉన్నది. ఓ ఇద్దరు ఆఫీసర్లతో నిజామాబాద్‌లో మరో ఆఫీసు పెడతామని చెబుతున్నారు. దీంతో  ఎలాంటి లాభం ఉండదు. రైతులకు ఏమైనా మేలు చేయాలంటే వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. మద్ధతు ధర ప్రకటించి కేంద్రమే పంటను కొనుగోలు చేయాలి. ఇదే రైతులు డిమాండ్‌ చేస్తున్నది. ఇది కాకుండా వేరే ఏమిచేసినా రైతులు ఒప్పుకోరు.

  • -వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి  

ఎంపీ తీరును గమనిస్తున్నారు.. 

పసుపు బోర్డు విషయంలో ఎంపీ అర్వింద్‌ తీరును రైతులు గమనిస్తున్నారు. అర్వింద్‌ ఏం తెచ్చానంటున్నాడో గుర్తించలేని అమాయకులు కాదు రైతులు. పసుపు బోర్డు తెస్తానని గెలిచి తీరా బోర్డు తిప్పేసిన అర్వింద్‌ రైతులను ఓట్ల కోసం వాడుకున్నాడు.

  • -నాగంపేట్‌ శేఖర్‌రెడ్డి, రైతు, మెండోరా మండలం

స్పైసెస్‌ బోర్డుతో ఒరిగేదేం లేదు.. 

అప్పుడు కాంగ్రెస్‌ పసుపును స్పైసెస్‌ బోర్డులో కలిసి రైతులకు అన్యాయం చేసిందని ఎంపీ అర్వింద్‌ చెప్పారు. ఇప్పుడు పసుపుబోర్డు ఏర్పాటు చేయకుండా మళ్లీ సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయిస్తామని ప్రకటించడం బట్టేబాజీ మాటలే. దీంతో పసుపు రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుటికే వరంగల్‌లో ఉన్న స్పైస్‌బోర్డుతో అక్కడ ఎలాంటి మేలు జరగలేదు. ఇప్పుడు ఇక్కడ పెట్టి చేసేదేముంది? పసుపునకు మద్దతు ధర ఇవ్వమని, బోర్డు ఏర్పాటు చేయమని కోరుతున్నాం. అలా చేయలేదు. ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం. పసుపు రైతు పక్షాన పోరాడుతాం. బోర్డు ఏర్పడే వరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. 

  • -అన్వేశ్‌రెడ్డి, పసుపు బోర్డు సాధన ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యుడు

తప్పుదోవ పట్టిస్తున్నాడు.. 

కేరళలో ఉన్న స్పైసెస్‌ బోర్డుతో ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు నిజామాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని విస్తరిస్తున్నారు. దీంతో పసుపు రైతులకు ఎలాంటి లాభం లేదు. పసుపుబోర్డు, మద్దతు ధర ఇవ్వమని అడిగితే కేంద్రం మళ్లీ మోసం చేసింది. ఎంపీ అర్వింద్‌ పసుపు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాడు.

  • -యాదాగౌడ్‌, పసుపు బోర్డు సాధన ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యుడు

ఎంపీ మోసం చేశారు.. 

ఎంపీ అర్వింద్‌ రైతులను మోసం చేశారు. ఎన్నికల సమయంలో పసుపు బోర్డు తెస్తానని చెప్పి స్పైసెస్‌ బోర్డు అనుబంధ కార్యాలయాన్ని మాత్రమే ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. ఇది ముమ్మాటికీ మాట తప్పడమే.  పసుపు బోర్డు వచ్చే వరకు రైతులు పోరాటం ఆపం

  • -కొట్టాల చిన్నారెడ్డి, రైతు, పడగల్‌, వేల్పూర్‌ మండలం

హామీని నిలబెట్టుకోవాలి.. 

మసాలా బోర్డు నుంచి పసుపును బయటకు తీయకుండానే రైతులకు మేలు జరుగుతుందని ఎంపీ చెప్పగలరా ? బోర్డు తేవడంలో అర్వింద్‌ విఫలమయ్యాడని తేలిపోయింది. ఇక రాజీనామా చేస్తానన్న ఆయన దానిని నిలబెట్టుకోవాలి. 

  • -సామ వెంకట్‌రెడ్డి, రైతు, ముప్కాల్‌

బాండ్‌ పేపర్‌లో రాసిచ్చింది ఏంటి?..తెచ్చింది ఏంటి ..?

అర్వింద్‌ సార్వత్రిక ఎన్నికల సమయంలో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇస్తూ బాండ్‌ పేపర్‌లో రాసి ఇచ్చారు. ఓట్లయి పోయినంక వేరే ఏదో తెచ్చి బోర్డు కాక మరేదో తెచ్చారు. బాండ్‌పేపర్‌ రాసిచ్చినప్పుడు బోర్డు కాదు మరేదో తెస్తానని ఎందుకు రాసియ్యలేదు.ఈ మతలబు రైతులు గుర్తించలేరని ఆయన భ్రమపడుతున్నారు. రైతులను మోసం చేయాలని చూడడం ఎంపీకి తగదు. ఆయన హామీని నిలబెట్టుకోవాలి.

  • -బద్దం చిన్నారెడ్డి, రైతు, ఉప్లూర్‌


logo