గురువారం 28 మే 2020
Nizamabad - Feb 05, 2020 , 01:55:28

పరిశ్రమల స్థాపనకు జిల్లా అనుకూలం

పరిశ్రమల స్థాపనకు జిల్లా అనుకూలం

ఇందూరు: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉందని, ఉత్తమమైన ఇండస్ట్రియల్‌ పాలసీ అమలు కోసం ఆలోచన చేస్తున్నామని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని నిఖిల్‌ సాయి ఇంటర్నేషనల్‌ హోటల్‌లో మంగళవారం కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ(సీఐఐ) ఆధ్వర్యంలో ‘డిస్కషన్‌ ఆన్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ ఇన్‌ నిజామాబాద్‌' అనే  అంశంపై ‘రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తలు కలెక్టర్‌ను పలు సదుపాయాల కోసం అభ్యర్థించారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు టీఎస్‌ ఐ-పాస్‌ విధానం చాలా బాగుందన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. వరి, పసుపు, ఎర్రజొన్న, సోయాబీన్‌ తదితర పంటలు విస్తారంగా సాగవుతున్నాయని, ఆహార పరిశ్రమల స్థాపనకు మంచి అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 


ఆహార ధాన్యాలు జిల్లాలో గణనీయంగా ఉత్పత్తి అవుతున్నందున, వాటికి వ్యాపారపరంగా లాభాలు చేకూర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై వ్యాపారవేత్తలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే సంబంధిత శాఖలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఉభయకుశలోపరి సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యావరణ హితంగా ముం దుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైస్‌మిల్లర్లు, పసుపు వ్యాపారులు, రైతులతో కలిసి ఇండస్ట్రీ పాలసీపై చర్చిస్తామన్నారు. వ్యాపారులు బతకాలి..పండించిన వారు బతకాలి.. సొసైటీ బాగుండాలనే ఆలోచనతో చర్య లు తీసుకుంటామన్నారు. సరుకుల తయారీలో కల్తీలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని, సరుకుల కల్తీలతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందని కలెక్టర్‌ అ న్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని కలెక్టర్‌ భరోసా ఇచ్చారు. సమావేశంలో సీఐఐ చైర్మన్‌ రాజు, కాకతీయ సాండ్‌ బాక్స్‌ ప్యాట్రన్‌ రవీశ్‌, వ్యాంటేజ్‌ కన్సల్టింగ్‌ ఫౌండర్‌ మనుజ, తెలంగాణ సీఐఐ డైరెక్టర్‌ సుభజిత్‌ సాహా తదితరులు పాల్గొన్నారు.


ఎస్టీపీ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్‌, కమిషనర్‌

ఇందూరు: జిల్లాకేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో నిర్మించిన సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (మురుగు నీటి శుద్ధీకరణ కేంద్రం)ను కల్టెకర్‌ నారాయణరెడ్డి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలను పరిశీలించి మున్సిపల్‌ ఇంజినీర్‌ ఆనంద్‌ సాగర్‌, పబ్లిక్‌ హెల్త్‌ విభాగం ఇంజినీర్‌ తిరుపతికుమారును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్‌ లైన్లను పూర్తి చేయాలని, వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటికి ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకు ముందు నూతన కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ డిప్యూటీ ఈఈ రషీద్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo