ఆదివారం 31 మే 2020
Nizamabad - Feb 05, 2020 , 01:42:28

‘రేషన్‌' పక్కదారి పట్టకుండా చూసుకోవాలి

‘రేషన్‌' పక్కదారి పట్టకుండా చూసుకోవాలి

ఇందూరు: రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టకుండా అధికారులు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మంగళవారం జడ్పీ స్థాయీ సంఘ సమావేశాన్ని జిల్లా పరిషత్‌ సమావేశపు హాల్‌లో నిర్వహించారు. ఉదయం 11గంటలకు గ్రామీణాభివృద్ధి, మధ్యాహ్నం వ్యవసాయ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించి ఆ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోనూ వైకుంఠధామం నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు సరిపడేలా ఉన్నాయా లేదా అని డీఆర్డీవో రమేశ్‌ రాథోడ్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో చేపడుతున్న పనుల ప్రగతిపై సమావేశంలో సమీక్షించారు. ప్రస్తుతం శ్మశానవాటికలు, కిచెన్‌ షెడ్లు, స్కూల్‌ టాయిలెట్లు, కామన్‌ ఇంకుడు గుంతలు, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, డంపింగ్‌ యార్డులు, పశువుల, మేకల పాకలు, పంట కాలువల పూడికతీత, గ్రామీణ సంతలు, పండ్ల తోటల పెంపకం, చెరువుల పూడికతీత, ఊటకుంటలు లాంటి 13 రకాల పనులు చేపడుతున్నట్లు సం బంధిత అధికారులు వివరించారు. 


హరితహారంలో నాటిన మొక్కలను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్‌ నారాయణరెడ్డి గుర్తు చేశారని, ఒక్క మొక్క ఎండిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. పీఎంఈజీపీ స్కీం ద్వారా ఇప్పటి వరకు 35 యూనిట్లు టార్గెట్‌గా.. మార్జిన్‌ మనీ రూ. 101.79 లక్షలు కేటాయించినట్లు పీఎంఈజీపీ అధికారి చోక్యానాయక్‌ తెలిపారు. 170 దరఖాస్తులు రాగా.. బ్యాంకులకు 132 పంపినట్లు తెలిపారు. 14 దరఖాస్తులకు యూనిట్లు మంజూరు చేసి రూ.33.66 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 243 జీపీలు ట్రాకర్లు కొనుగోలు చేశాయని, మిగతా 275 జీపీలు ఈ వారంలో కొనుగోలు చేస్తాయని డీపీవో జయసుధ తెలిపారు. 500 జనాభా కలిగిన చిన్న జీపీలకు కూడా ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆమె సమావేశంలో తెలిపారు. ట్రాక్టర్ల కొనుగోళ్లకు  కలెక్టర్‌ డౌన్‌ పేమెంట్‌కు లోన్‌ ఇస్తున్నారని తెలిపారు. వారం రోజుల్లో మొత్తం గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. సమావేశంలో జడ్పీటీసీలు బొల్లెంక సుమలత, హరిదాస్‌, కోఆప్షన్‌ మెంబర్లు ఎంఏ మోయిజ్‌, మహ్మద్‌ సీరాజ్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, అధికారులు పాల్గొన్నారు.


ధాన్యం కొనుగోలు డబ్బులు వెంటనే చెల్లించాలి: జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ రజిత

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ రజిత సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండు మూడ్రోజల్లో మిగిలిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. 2019-20 యాసంగి(రబీ) సాగు గురించి సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2,49,379 ఎకరాల్లో వరి సాగైందని  జేడీఏ గోవింద్‌ తెలిపారు. మొక్కజొన్న 34,274 ఎకరాల్లో సాగైందన్నారు. శనగ 31,878 ఎకరాల్లో సాగుచేసినట్లు మార్క్‌ఫెడ్‌ అధికారి తెలిపారు. జిల్లాలో 116 పాల కేంద్రాలు ఉన్నాయని అధికారులు వివరించారు. కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం గురించి విద్యుత్‌ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో గోవింద్‌, జేడీఏ గోవింద్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


logo