శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 04, 2020 , 01:27:17

లెక్కతేలింది!

లెక్కతేలింది!

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో సహకార ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. సోమవారం సొసైటీల వారీగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఫామ్‌-1 నోటీసులను విడుదల చేసి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రదర్శించారు. ఈనెల 15న ఎన్నికలను నిర్వహించనున్న తరుణంలో ఓటర్ల తుది జాబితాను కూడా ప్రదర్శించారు. ఆదివారం అర్ధరాత్రి వరకు జిల్లా సహకార శాఖ కసరత్తు చేసింది. నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 89 సహకార సొసైటీలకు గాను.. 1,48,241 మంది సభ్యులు ఉన్నారు. 1,15, 211 మంది ఓటర్లు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 55 సొసైటీలు ఉండగా.. 91,288 మంది ఓటర్లున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ ఉభయ జిల్లాల్లో మొత్తం 144 సహకార సొసైటీలు ఉన్నాయి. 2,06,499 మంది ఓటర్లు ఉన్నారు. ఈనెల 5, 6, 7 తేదీల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. 8న స్క్రూటినీ, 9న ఉపసంహరణ ఉంటుంది. 15న ఎన్నికలు మధ్యాహ్నం వరకు జరుగుతాయి. ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. ఆ మరుసటి రోజే సొసైటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఒక్కో సొసైటీలో మొత్తం 13 సెగ్మెంట్లు ఉంటాయి. వీటి పరిధిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఏ సెగ్మెంట్‌కు ఏ సామాజికవర్గానికి కేటాయించాలో నిర్ణయించారు. కొన్ని సొసైటీల్లో 12 సెగ్మెంట్లకే రిజర్వేషన్లు కేటాయించారు. బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ 13 సెగ్మెంట్ల నుంచి సొసైటీకి డైరెక్టర్లుగా పోటీచేసి గెలుపొందిన వారు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కూడా బ్యాలెట్‌ పత్రాల ద్వారానే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన రోజే అభ్యర్థుల పోటీలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితాను ప్రదర్శిస్తారు. అదే రోజు అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయించనున్నారు. మొత్తం ఉభయ జిల్లాలోని సొసైటీలకు చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్లు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉంటుంది. దీని కోసం ప్రభుత్వం మరో ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. ఆ షెడ్యూల్‌ ప్రకారం ఈ ఎన్నిక ఉంటుంది. ఉమ్మడి జిల్లా నుంచి గెలుపొందిన ప్రతి సొసైటీ చైర్మన్‌ సహకార బ్యాంకు డైరెక్టర్లు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో పాల్గొని ఓటేయాల్సి ఉంటుంది. బ్యాలెట్‌ ద్వారానే ఈ ఎన్నికను నిర్వహించనున్నారు. మొత్తం 23 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. 


logo