గురువారం 28 మే 2020
Nizamabad - Feb 04, 2020 , 01:25:47

ఇక గాడిలో.. బల్దియా పాలన !

ఇక గాడిలో.. బల్దియా పాలన !

 నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ప్రజల కోరిక నెరవేరింది. మున్సిపాలిటీ నుంచి అప్‌గ్రేడ్‌ చేసి నిజామాబాద్‌ను కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆ కల కలగానే ఉన్నది. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కమిషనర్‌గా ఓ ఐఏఎస్‌ అధికారిని నియమించాలి. ఈ అంశం చాలాసార్లు చర్చకు వచ్చింది. కానీ, ఇప్పటి వరకు కుదరలేదు. మున్సిపల్‌ శాఖ మంత్రిగా కేటీఆర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలనలో సంస్కరణలు తీసుకువచ్చే క్రమంలో కచ్చితంగా కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి కావాలని పట్టుబట్టారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కమిషనర్‌గా ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ను కేటాయించారు. 2016 సివిల్స్‌ బ్యాచ్‌ కు చెందిన జితేశ్‌ వీ పాటిల్‌ను కమిషనర్‌గా నియమించారు. సంగారెడ్డి జిల్లా ప్రత్యేకాధికారిగా  పనిచేశారు. ఆయన సోమవారం రాత్రి బాధ్యతలు తీసుకున్నారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు 24 గంటల్లోనే బాధ్యతలు తీసుకున్నారు. పాత కమిషనర్‌ జాన్‌ సాంసన్‌ రిలీవ్‌ అయ్యారు. కమిషనర్‌గా జాన్‌ సాంసన్‌ రెండున్నరేళ్లు పనిచేశారు. ఆయనకు ఇంకా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఇక పాలనలో దూకుడు.. సంస్కరణల పర్వం.. 

మున్సిపాలిటీ అంటేనే ఓ నిర్లక్ష్యం.. పట్టింపు లేనిత నం. ఏండ్లుగా పేరుకుపోయిన అలసత్వం.. దీనికి తోడు పెంచిపోషిస్తున్న అవినీతి.. దీంతో సామాన్య ప్ర జలు మున్సిపాలిటీ గడప తొక్కాలంటేనే జంకుతారు. పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ నుంచి మొదలుపెట్టి ఇంటి పర్మిషన్లు, పన్నులు, ఇతర ఏవైనా పనులకు సరే ముక్కుపిండి వసూలు చేస్తారు. ఇంజినీరింగ్‌ పనుల్లో అయితే అంతులేని అవినీతి రాజ్యమేలుతుందనే ఆరోపణలు ఉన్నాయి.  టౌన్‌ ప్లానింగ్‌ విభాగం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. వీరిపై ఎవరికీ అజమాయిషీ లేదు. అడిగే నాథుడే లేడు. యథేచ్ఛగా మున్సిపల్‌ స్థలాలను ఆక్రమించి పార్కింగ్‌ స్థలాలుగా, స్కూళ్లుగా మార్చుకు న్నా .. ఎవరూ పట్టించుకోరు. ఎవరైనా ప్రశ్నిస్తే ఓ బోర్డు పాతేస్తారు. కానీ, చర్యలు మాత్రం ఉండవు. అంతా లోపాయికారి వ్యవహారమే ఇక్కడ రాజ్యమేలుతుంది. లేఔట్ల పర్మిషన్లు కావాలన్నా పెద్ద ఎత్తున సమర్పించాల్సిందే. అధికారుల అవినీతిని ఆసరా చేసుకొని నగర శివారులో లే ఔట్లు లేని ఎన్నో వెంచర్లు వెలిశా యి. వీటిని పట్టించుకునేవారు కరువయ్యారు. ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్‌ మాటేమో గానీ, ముందు ఆ ఏరియా కార్పొరేటర్‌కు పెద్ద ఎత్తున సమర్పించుకోవా లి. అధికారికంగా పర్మిషన్‌ తీసుకోకున్నా సరే. ఇదే తంతు కొన్నేండ్లుగా ఇక్కడ కొనసాగుతోంది. ఇంటి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. వసూలుకు పట్టిం పు ఉండదు. ఎవరైనా చేతి తడిపితే ఇంటి పన్నుల్లో అనధికారికంగా భారీ రాయితీ ప్రకటించేస్తారు మన అధికారులు. రెండున్నరేళ్లుగా కమిషనర్‌గా పనిచేసిన జాన్‌ సాంసన్‌ పెద్దగా వీటిల్లో మార్పు తీసుకురాలేక పోయా రు. ఆయన నిమిత్తమాత్రుడిగానే పనిచేసుకున్నారు. అవినీతి, అలసత్వంపై తనదైన ముద్ర వేసుకోలేకపోయారు. కొత్తగా ఐఏఎస్‌ అధికారి కమిషనర్‌గా రావడంతో చాలా మందికి కొత్త ఆశలు చిగురించాయి. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు పాలనలో కీలక సంస్కరణలకు నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబా ద్‌ కార్పొరేషన్‌ అంటేనే అలసత్వానికి, అవినీతికి ఆలవాలంగా మారింది. దీన్ని పూర్తిగా సంస్కరించే పనిని కొత్త కమిషనర్‌ భుజానికెత్తుకోవాల్సి ఉంది. కొత్త కమిషనర్‌కు ఇది సింగిల్‌ సబ్జెక్ట్‌ కాబట్టి మరింత లోతుల్లోకి వెళ్లి పరిపాలన గాడిలో పెట్టే అవకాశం ఉంది. 


logo