శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 03, 2020 , 02:06:14

‘సహకార’ సందడి

‘సహకార’ సందడి
  • అర్హులైన ఓటర్ల జాబితా కూడా..
  • nఓటర్ల లెక్కతేల్చే పనిలో ఆదివారం అర్ధరాత్రి వరకు కుస్తీపట్టిన అధికారులు

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : సహకా ర సంఘాల ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన కసరత్తు పూర్తి చేస్తున్నది. సోమవారం నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాలోని అన్ని సహకార సొసైటీల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగా సొసైటీల వారీగా ఎన్నికల అధికారులు ఫామ్‌ -1 నోటీసును విడుదల చేస్తారు. అందులో ఎన్నికల షెడ్యూల్‌ వివరాలు ఉంటాయి. షెడ్యూల్‌తో పాటు సొసైటీల వారీగా అర్హులైన ఓటర్ల జాబితాను కూడా ప్రదర్శిస్తారు. నిజామాబాద్‌ జిల్లాలో 89 సొసైటీలు ఉండగా.. కామారెడ్డి జిల్లాలో 55 సొసైటీలు ఉన్నాయి. మొత్తం ఉభయ జిల్లాల్లో 144 సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎంత మంది అర్హులైన ఓటర్లు ఉన్నారనే విషయాన్ని ధ్రువీకరించి, ఆ మేరకు నేడు సొసైటీల వారీ గా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. నిజామాబాద్‌ జిల్లాలో 1.20 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కామారెడ్డి జిల్లాలో లక్ష వరకు ఓటర్లు ఉన్నారు. 


నిబంధనల ప్రకారం 2018 డిసెంబర్‌ నెలాఖరు వరకు సభ్యులుగా నమోదైన వారికి మాత్రమే ఓటు హక్కు అవకాశం ఇవ్వనున్నారు. ఆ తర్వాత నమోదు చేసుకున్న వారికి ఈసారి ఓటు హక్కు ఉండదు. ఓటు హక్కు అర్హత ఉన్న వారిలో కూడా మిగిలిన నిబంధనలకు అనుగుణంగా ఉన్నారో లేదో చూస్తారు. రూ.300 షేర్‌ క్యాపిటల్‌ చెల్లించి ఉండడంతో పాటు తీసుకున్న రుణాల చెల్లింపుల్లో వాయిదాల్లో తీవ్ర జాప్యం (ఓవర్‌ డ్యూస్‌) ఉంటే వారిని అనర్హత కింద గుర్తిస్తారు. ఇప్పుడు ఇవన్నీ కూడా సరిచూసుకొని, నిజంగా ఓటు అర్హత ఎవరికి ఉంటే వారి జాబితాలో చేరుస్తారు. దీనికోసం జిల్లా సహకార శాఖ ఆదివారం అర్ధరాత్రి వరకు కసరత్తు చేసింది. మంగళవారం ఉదయం 10గంటలకు అన్ని సొసైటీల్లో ఫామ్‌-1 నోటీ సు విడుదల చేయడంతో పాటు తుది ఓటరు జాబితాను కూడా ప్రకటించనున్నది. కాగా, ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్న ఓటర్ల సంఖ్యలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. 


నేడు ఉభయ జిల్లాల్లో పక్కాగా ఎంత మంది ఓటర్లు సహకార సంఘాల్లో ఉన్నారో లెక్కతేలనున్నది. కాగా, ఈ నెల 6,7,8 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనుండగా.. 9 నామినేషన్ల స్క్రూటీని, 10న ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించి గుర్తులను  కేటాయిస్తారు. 15 ఎన్నికలు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. 16న సొసైటీల చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌, డైరెక్టర్ల ఎన్నిక కోసం మళ్లీ ప్రత్యేకం గా నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. logo