శనివారం 30 మే 2020
Nizamabad - Feb 03, 2020 , 02:00:20

139 మంది చిన్నారులకు విముక్తి

 139 మంది చిన్నారులకు విముక్తి


ఖలీల్‌వాడి: తప్పిపోయిన చిన్నారులు, బాల కార్మికులు, వెట్టిచాకిరి చేసే, యాచక వృత్తిలో ఉన్న పిల్లలను రక్షించేందుకు ఉద్దేశించిన ఆరో విడత ఆపరేషన్‌ స్మైల్‌లో సుమారు 139 మంది చిన్నారులకు నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విముక్తి కల్పించామని పోలీసు కమిషనర్‌ కార్తికేయ శర్మ తెలిపారు. ఈ కార్యాచరణలో భాగంగా నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మూడు సబ్‌ డివిజన్ల పరిధిలో ఒక ఎస్సై స్థాయి అధికారితో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కూడిన మూడు టీఎంలు గత నెల మొత్తం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయన్నారు. చైల్డ్‌ట్రాక్‌ పోర్టల్‌, పేషియల్‌ రికగ్నేషన్‌ యాప్‌, ధర్పణ్‌ సేవలను వినియోగించామని తెలిపారు. తరచుగా బాల కార్మికులను పనుల్లో పెట్టుకొనే వారిపై నిఘా ఉంచడంతో పాటు ట్రాఫిక్‌ కూడళ్లు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, మెకానిక్‌ షాప్‌లు, మతపరమైన స్థలాలు, టీస్టాళ్లు, దుకాణాలు తదితర వాటిపై దృష్టి సారించి  అనుకున్న లక్ష్యాన్ని సాధించామని పేర్కొన్నారు. 


విముక్తి పొందిన చిన్నారుల్లో మన రాష్ర్టానికి సంబంధించిన 92 బాలురు, 14 మంది బాలికలు, ఇతర రాష్ర్టాలకు చెందిన 32 మంది బాలురు, ఒక బాలిక ఉన్నారన్నారు. నాలుగు కేసులు నమోదు చేశామని తెలిపారు. డివిజన్ల వారీగా నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో 43 మంది, ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో 74 మంది, బోధన్‌ డివిజన్‌ పరిధిలో 22 మందిని గుర్తించామన్నారు. ప్రజలు తప్పిపోయిన బాలురు, బాలికలు ఉంటే డయల్‌ 100,  స్పెషల్‌  బ్రాంచ్‌ కంట్రోల్‌ రూం నంబర్‌ 08462-220750, 94906 18000, నిజామాబాద్‌ ఇన్‌చార్జి ఎస్సై 96761 20245, ఆర్మూర్‌ ఇన్‌చార్జి ఎస్సై 94412 50992, బోధన్‌ ఇన్‌చార్జి ఎస్సై 79011 33152 నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం అందించాలని సూచించారు. 


logo