సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Feb 02, 2020 , 01:07:17

పసుపు రైతులకు మొండిచేయి

పసుపు రైతులకు  మొండిచేయి
  • మద్దతు ధరపై ప్రకటన రాలేదు
  • ఎంపీ అర్వింద్‌ తీరుపై రైతుల ఆవేదన
  • త్రిశంకు స్వర్గంలో పసుపు రైతు
  • పసుపు బోర్డు ఏర్పాటుప నీరుగారిన ఆశలు
  • జోరుగా త్వవకాలు, శుద్ధి
  • విక్రయాలు సమీస్తున్నవేళ పసుపు రైతుకు దిగాలు

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ: పసుపు బోర్డు ఏర్పాటు, పసుపునకు మద్దతు ధరపై కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పసుపు రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఎంపీ అర్వింద్‌, కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని పసుపు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ బడ్జెట్‌ తమను తీవ్ర నిరాశపర్చిందని వారంతా వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పసుపు రైతుకు మళ్లీ ధర దిగాలు పట్టుకుంది. ప్రస్తుతం పసుపు తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పంట మార్కెట్‌కు తరలించడమూ ప్రారంభమైంది. కానీ, ఎప్పటిలాగే ధర మాత్రం నిరాశాజనకంగానే కనిపిస్తున్నది. నిజామాబాద్‌ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.4,600 మించి ధర లేదు.ఆరుగాలం సాగుచేసిన పసుపును ఆశలతో మార్కెట్‌కు తరలిస్తే ..నిరాశే మిగులనుందా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది.ఏటా పసుపు రైతుకు ఈ నైరాశ్యాన్ని ఎదుర్కొంటూ వస్తున్నాడు. 


కానీ, ఈసారి రైతు మరింత ఆందోళన చెందుతున్నాడు.పసుపునకు మద్దతు ధర తెస్తానని హామీ ఇచ్చి ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్‌, ఎన్నికల్లో ఈ మేరకు హామీ ఇచ్చిన బీజేపీ సర్కారు నుంచి ఉలుకు పలుకు లేకపోవడం ఇందుకు కారణం. గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని సార్వత్రిక ఎన్నికల వేళ ధర్మపురి అర్వింద్‌ చెబితే నమ్మి ఓటేసిన రైతులు.. ఈసారి పంట దిగుబడి కాలానికల్లా పసుపు బోర్డు ఉపయోగాలు చూస్తామనుకున్నారు. ఈసారి పంట మార్కెట్‌కు తరలించే సరికి పసుపునకు మద్దతు ధరను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఓట్లేయించుకుని నిరాశ మిగిల్చారని పసుపు రైతు దిగాలు చెందుతున్నాడు.


తవ్వకాల వేళ ధర చింత...

పసుపు తవ్వకాల సీజన్‌ ప్రారంభమై జోరందుకుంది. స్వల్ప కాలిక  , మధ్యకాలిక రకాల పసుపు తవ్వకాలు దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. దీర్ఘకాలిక రకపు పసుపు పంట కాలం పూర్తి కావచ్చింది.దీంతో దీర్ఘ కాలిక రకాల పసుపు తవ్వకాలు పదిహేను రోజుల్లో ప్రారంభం కానున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో ఈసారి 40,616 ఎకరాల్లో పసుపు సాగయ్యింది,1,01,540 మెట్రిక్‌ టన్నుల పసుపు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. పసుపు సాగు జిల్లాలో ఆర్మూర్‌ ప్రాంతంలో ఆధికంగా ఉంటుంది. ఈసారి మండలాల వారీగా ఆర్మూర్‌లో 6,412 ఎకరాలు, బాల్కొండలో 1,946, భీమ్‌గల్‌లో 431, బోధన్‌లో 38, చందూర్‌లో 4, ధర్పల్లిలో 492, డిచ్‌పల్లిలో 96, ఇందల్వాయిలో 166, జక్రాన్‌పల్లిలో 4,182, కమ్మర్‌పల్లిలో 5,266, కోటగిరిలో 20, మాక్లూర్‌లో 110, మెండోరాలో 3,364, మోర్తాడ్‌లో 4,372, మోపాల్‌లో 85, ముప్కాల్‌లో 2,307, నందిపేట్‌లో 3,437, నవీపేట్‌లో 1, రెంజల్‌లో 7, రుద్రూర్‌లో 5, సిరికొండలో 309, వేల్పూర్‌లో 4,526, ఏర్గట్లలో 3,040 ఎకరాల్లో పసుపు సాగుచేశారు.


ఇందులో సుమారు 10 శాతం స్వల్పకాలిక, మధ్యకాలిక రకాలైన ఏసీసీ 79, ఏసీసీ 48, రాజేంద్ర సోనియా, రాజేంద్ర సోనాలి, రాజ్‌పురి, బీఎస్‌ఆర్‌ 2, పితంబర్‌ రకాలు సాగుచేశారు. ఈ రకాల పసుపు తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.ఉడకబెట్టి, కల్లాల మీద ఆరబట్టడం కూడా పూర్తి కావస్తోంది.మార్కెట్‌కు తరలించడమే తరువాయి.కొన్నిచోట్ల మార్కెట్‌కు తరలించారు.ఇలాంటి పరిస్థితిలో పసుపు ధరపై రైతుల ఆలోచనలు సాగుతున్నాయి.ఈసారి పంట అమ్ముకునే సమయానికల్లా కేంద్రం పసుపు బోర్డు ఇస్తుందని, మద్దతు ధర ప్రకటిస్తుందని ఆశతో సాగు చేశామని రైతులు పేర్కొంటున్నారు.ఎప్పటిలాగే ధర తిప్పలు తప్పవని కేంద్ర బడ్జెట్‌ను చూసిన తర్వాత రైతులు వాపోతున్నారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని ఎంపీ అర్వింద్‌ ఇచ్చిన హామీతో పెట్టుకున్న ఆశలు అడియాశలేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


logo