సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Feb 02, 2020 , 01:04:06

సైనిక కుటుంబాలకు అండగా ఉంటాం..

సైనిక కుటుంబాలకు అండగా ఉంటాం..
  • వీర సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి
  • జిల్లాకేంద్రంలో సైనిక కుటుంబాలకు అవగాహన సదస్సు
  • దక్షిణ భారత ఏరియా కమాండింగ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పీఎన్‌ రావు
  • అధికార యంత్రాంగం వారిని పట్టించుకోవాలి

ఇందూరు : దేశ సేవకు అంకితమై ప్రాణాలను అర్పించిన సైనికులను గుర్తు చేసుకోవడంతో పాటు వారి కుటుంబసభ్యులకు సహాయం అందించడం మన బాధ్యత అని దక్షిణ భారత ఏరియా కమాండింగ్‌ ఆఫీసర్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ పీఎన్‌ రావు అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్‌లో శనివారం నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని మాజీ సైనికులు, వారి కుటుంబసభ్యులకు కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ భారత ఏరియా కమాండింగ్‌ ఆఫీసర్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ పీఎన్‌ రావు హాజరై మాట్లాడారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే సైనికులకు సహాయ సహకారాలు అందించడానికి ఇలాంటి ర్యాలీలు నిర్వహించడంతో కుటుంబాలకు ధైర్యం ఇచ్చిన వారమవుతామని అన్నారు.  దేశభక్తిని మరింత ఇనుమడింపజేస్తుందని తెలిపారు. 


దేశం కోసం పోరాడిన వారిలో దేశభక్తి మరింత ఎక్కువ అవుతుందని చెప్పారు. దేశం కోసం ఎంతో క్రమశిక్షణతో అంకితభావంతో పనిచేశారని వారి కుటుంబసభ్యులను కలుసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రా ఏరియా జనరల్‌ ఆర్కె సింగ్‌ మాట్లాడుతూ మాజీ సైనికులకు, కుటుంబ సభ్యులను కోల్పోయిన వీర మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను వివరించడానికి ఈ ర్యాలీ ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మాజీ సైనికులకు, వారి కుటుంబీకులకు సేవలు అందించే గొప్ప అవకాశం కలిగిందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. అనంతరం వీర సైనికుల కుటుంబ సభ్యులను, మాజీ సైనికులను సన్మానించారు. కార్యక్రమంలో కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ, డీఆర్వో అంజయ్య, రమేశ్‌, ఏసీపీ శ్రీనివాస్‌  కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌శాంసన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo