శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 01, 2020 , 02:36:58

కౌన్‌ బనేగా ఎమ్మెల్సీ..?

కౌన్‌ బనేగా ఎమ్మెల్సీ..?
  • త్వరలో స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నిక..?
  • రెండేండ్ల కాలపరిమితి కోసం ఎన్నిక
  • నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా గెలుపొందిన డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డిపై అనర్హత వేటుపడిన విషయం తెలిసిందే. మొత్తం ఆరేండ్ల కాలపరిమితి ఉన్న ఈ ఎమ్మెల్సీ స్థానానికి నాలుగేండ్లు పూర్తయ్యాయి. మిగిలిన రెండేండ్ల కాలపరిమితి కోసం త్వరలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మొన్నటి వరకు మున్సిపల్‌ ఎన్నికలు జరగనందున వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో పాటు భూపతిరెడ్డి తనపై వేసిన అనర్హత వేటుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. అక్కడా ఆయనకు ఎదురుదెబ్బే తగిలింది. దీంతో ఎన్నికలకు దారి సుగమమైంది. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధులంతా ఈ ఎన్నికలో ఓటు వేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీలు, కో ఆప్షన్‌ మెంబర్లు, జడ్పీటీసీ మెంబర్లు, జడ్పీ కో ఆప్షన్‌ మెంబర్లు.. మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కార్పొరేషన్‌ కార్పొరేటర్లు.. వీరంతా ఓటు వేయాల్సి ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం స్థానిక సంస్థలకు సంబంధించి ఏవైనా ఖాళీలు ఉన్నాయా? అని ఆరా తీయగా.. ఎలాంటి ఖాళీలు లేవని, ఎన్నిక నిర్వహణకు రెడీగా ఉన్నామని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం తెలిపింది. 


దీంతో త్వరలో దీనికి కూడా నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో అన్ని ఎన్నికలు ముగిశాయి. ఇటీవలే బల్దియా ఎన్నికలు జరిగి పాలకవర్గాలు కొలువుదీరాయి. తాజాగా సహకార ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 15న సహకార ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఇదే నెలలో పూర్తి చేసేలా నోటిఫికేషన్‌ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు ఎన్నికలు జరిగితే ఇక ఎన్నికల వాతావరణం జిల్లాలో కొన్నేండ్ల వరకు కనిపించదు. పాలన మరింత వేగంగా ముందుకు సాగనుంది. పాలకవర్గాలన్నీ కొలువుదీరుతాయి. అయితే స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానం టీఆర్‌ఎస్‌ వశమే కానుంది. అన్నింటా టీఆర్‌ఎస్‌ సభ్యులదే హవా ఉంది. దీంతో టీఆర్‌ఎస్‌ నుంచి ఉమ్మడి జిల్లా నేతలు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే అధిష్టానం వద్ద తమ పేర్లను నివేదిస్తున్నారు. పార్టీ కోసం పనిచేశామని, ఓపికగా ఎదురుచూశామని, ఈ అవకాశం తనకు ఇవ్వాలని కోరుతున్నారు.  ఎమ్మెల్సీ కోసం కోసం టీఆర్‌ఎస్‌ ఆశావహులు పోటీపడుతున్నారు. ఫిబ్రవరి నెలలో ఈ రెండు ఎన్నికల హడావిడి కనిపించనుంది. సహకార ఎన్నికల ద్వారా సొసైటీ డైరెక్టర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్లుగా పదవులు లభించడంతో పాటు డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లుగా అవకాశాలు రానున్నాయి. 


logo