శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 01, 2020 , 02:29:45

బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగుల ఇంటిబాట..

  బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగుల ఇంటిబాట..

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) వ్యవస్థ అతలాకుతలమైంది. కేంద్ర ప్రభుత్వం షరతులకు తలొగ్గిన ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) బాట పట్టారు. జిల్లాలో శుక్రవారం మొత్తం 269 మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌లో 424 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో ఎగ్జిక్యూటీవ్‌, నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌ క్యాడర్‌కు చెందిన 269 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. ఇంకా ఇక్కడ మిగిలింది 155 మంది ఉద్యోగులు మాత్రమే. బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాల్లో నడుస్తుందని ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా  అడుగులు వేస్తోంది. ప్రతినెలా వేతనాలు ఇవ్వకుండా రెండు మూడు నెలలకోసారి వేతనాలిస్తోంది. దీంతో పాటు కొన్ని కఠినతరమైన నిబంధనలను పెట్టింది. 33 ఏండ్లు సర్వీసు నిండినవారికి వీఆర్‌ఎస్‌ ఇచ్చేస్తామంటూ పలు కండీషన్లు పెట్టింది. స్వచ్ఛందంగా వీఆర్‌ఎస్‌ తీసుకుంటే మిగిలిన సర్వీసు కాలానికి కొంత మొత్తాన్ని చేర్చి ఇస్తామని చెప్పంది. దీంతో చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ బాట పట్టారు. దేశ వ్యాప్తంగా మొత్తం 79,857 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకోగా.. నిజామాబాద్‌ జిల్లాలో 269 మంది వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. 


ఇందులో ఎగ్జిక్యూటీవ్‌ క్యాడర్‌కు చెందిన డిప్యూటీ జనరల్‌ (ఫైనాన్స్‌), చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, ఏజీఎంలు, ఎస్‌డీ, జేటీవోలు ఉండగా.. నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌ క్యాడర్‌ విభాగంలో జేఈలు ఇతరులు కలిసి మొత్తం 230 మంది వరకు ఉన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఈవీఎల్‌ నారాయణ ఖండించారు. నష్టాల పేరుతో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారని, ఎంతో చరిత్ర కలిగిన, ఆస్తులున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉనికి లేకుండా చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న రూ. 7 లక్షల కోట్ల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి వీఆర్‌ఎస్‌ తీసుకునేలా చేశారన్నారు. 8.5 లక్షల కిలోమీటర్ల మేర ఉన్న లైనింగ్‌ నెట్‌వర్క్‌ను, టవర్స్‌ను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేంద్రం రూ. 20వేల కోట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేటాయించి సంస్థను గాడిలో పెట్టే అవకాశం ఉన్నా, ఆ వైపు దిశగా ఏనాడూ ఆలోచించలేదన్నారు.   logo