బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Jan 31, 2020 , 03:31:35

బాధ్యతలు స్వీకరించిన పురా ధీశులు

బాధ్యతలు స్వీకరించిన పురా ధీశులు

జిల్లాలో కొత్తగా ఎన్నికైన పురపాలిక అధ్యక్ష, ఉపాధ్యక్షులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. వసంత పంచమి కావడం, శుభ ముహూర్తం ఉండడంతో నిజామాబాద్‌ మేయర్‌, ఉప మేయర్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్మన్లు వారివారి చాంబర్లలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి పాల్గొని నూతన చైర్‌పర్సన్లకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపించాలని వారు ఆకాంక్షించారు.

  • హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
  • చాంబర్లలో ప్రత్యేక పూజల నిర్వహణ
  • అధ్యక్ష, ఉపాధ్యక్షులకు శుభాకాంక్షల వెల్లువ

ఖలీల్‌వాడి : అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామని నిజామాబాద్‌ నగర మేయర్‌ నీతూ కిరణ్‌ అన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగర మేయర్‌గా నీతూకిరణ్‌ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ ఆకుల లలిత, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. మేయర్‌ ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నగర మేయర్‌గా నీతూకిరణ్‌ పట్టా తీసుకొని బాధ్యతలు స్వీకరించారు. 


ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. నిజామాబాద్‌ నగర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని మేయర్‌గా ఎన్నుకున్నామన్నారు. నిజామాబాద్‌ నగరం అభివృద్ధి కోసం ప్రజలకు మంచి సేవలు అందించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. మేయర్‌ నీతూకిరణ్‌ మాట్లాడు తూ.. మంత్రి, ఎమ్యెల్యే, నగర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొట్టమొదటిసారి మేయర్‌ కావడం సంతోషంగా ఉం దని తెలిపారు. నగర అభివృద్ధితో పాటు సుందరంగా మారుస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేయడమే తన ధ్యేయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌శాంసన్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


logo