బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Jan 30, 2020 , 04:08:05

కమలంలోఆరని జ్వాలలు

కమలంలోఆరని జ్వాలలు
  • అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిన గ్రూపుల పోరు
  • భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టిపెట్టిన భాయ్‌సాబ్‌ అనుచరులు
  • పార్టీ నేతలపై పట్టు మరింత బిగిస్తున్న అర్వింద్‌
  • యెండల ఒంటరి.. నైరాశ్యంలో అనుచర వర్గం
  • మున్సిపల్‌ ఫలితంతో సీన్‌ రివర్స్‌

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: యెండల లక్ష్మీనారాయణ .. బీజేపీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలవడమేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా కూడా కొనసాగారు. బీజేపీకి ఇందూరులో ప్రత్యేక గుర్తింపు తెచ్చివారిలో ఈయనొకరు. వివాదరహితుడే కాకుండా అందరితో కలుపుగోలుగా ఉండే నాయకుడు. తనకంటూ ఓ అనుచరవర్గాన్ని పెంచి పోషించి వారికి అండగా నిలబడ్డ వ్యక్తి. ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చే నేత కాబట్టే.. అనుచరులంతా భాయ్‌సాబ్‌ అంటూ చనువుగా పిలుచుకొంటుంటారు. కానీ, ఇదంతా నిన్నటి వరకు... ఇపుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. తాను వేలుపట్టి నడిపించిన జిల్లా బీజేపీలో.. ఇప్పుడు ఆయనే ఒంటరిగా మిగిలిపోయారు.


బీజేపీ ద్వారా తన రాజకీయ ఆరంగేట్రాన్ని ప్రారంభించిన ధర్మపురి అర్వింద్‌.. బీజేపీలోని సీనియర్‌ నేతలకు ఒక్కొక్కరిగా చెక్‌పెడుతూ వచ్చారు. తనకంటూ ఓ సొంత గ్రూపును ఏర్పాటు చేసుకుని.. యెండలను, ఆయన వర్గాన్ని దూరం పెట్టారు. ఎంపీగా ఆయన గెలిచిన తర్వాత.. జిల్లా బీజేపీలో ఆయన తన పట్టును మరింత బిగించారు. అధిష్ఠానం సైతం మౌనంగా అర్వింద్‌ను అనుసరించడమే అలవాటు చేసుకోవడంతో.. ఏండ్లుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న యెండల వంటి నేతల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 


సొంత గడ్డపై సొంత పార్టీలోనే ఎన్నో చేదు అనుభవాలు, మరెన్నో అవమానాలను యెండల ఎదుర్కోవాల్సి వచ్చింది. అనుచవర్గానికి ఎదురుదెబ్బలు. చీదరింపులు.. ఛీత్కారాలు.. అన్నీ భరించారు. పార్టీ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమనే రీతిలో ఓపికగా ఉంటూ వచ్చారు. ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల సమయంలో అసంతృప్తి అగ్నిపర్వతంలా బద్దలైంది. బీజేపీకి ఆయువు పట్టుగా భావిస్తున్న నిజామాబాద్‌ నగరంలో కార్పొరేషన్‌ ఎన్నికల్లో తన అనుచరులను అర్వింద్‌ పూర్తిగా పక్కకు పెట్టడం.. తన సొంత అన్న కొడుకుకూ కార్పొరేషన్‌ టికెట్‌ ఇవ్వకపోవడం యెండలను ఆగ్రహానికి గురిచేసింది. అధిష్టానం వద్ద తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కడమే కాకుండా.. అనుచరులతో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆందోళన చేయించారు. అయినా అధిష్టానం అర్వింద్‌కే మొగ్గు చూపింది. అర్వింద్‌ రాజకీయ ఎత్తుగడలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపించారే తప్ప.. యెండల లక్ష్మీనారాయణ ఆవేదనను ఎవరూ వినిపించుకోలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏంటో తేల్చుకుందామని యెండల మిన్నకుండిపోయారు. భాయ్‌సాబ్‌ అడుగు జాడల్లోనే అనుచరులూ నడిచారు. 


ఫలితాలు బీజేపీకి కొంత ఆశాజనకంగా రావడంతో అర్వింద్‌ వర్గం చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. పార్టీతో ఇక తమకు తిరుగేలేదన్న రీతిలో పలువురు నేతలు వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత నగర ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు పెట్టిన ప్రెస్‌మీట్‌కు షరా మామూలుగా యెండలకు సమాచారం అందలేదు. అయినా సరే ఆత్మాభిమానాన్ని చంపుకొని పార్టీ కార్యాలయానికి వెళ్లిన ఆయన ఒకరిద్దరు నాయకులతో కలిసి బయటే మీడియాతో మాట్లాడాల్సి వచ్చింది. బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంపై సంతోషాన్ని వ్యక్తంచేసి గుంభనంగా తిరిగిపోవాల్సి రావడం గమనార్హం. బీజేపీలో యెండల ప్రస్థానానికి అర్వింద్‌ పూర్తిగా బ్రేకులు వేసినట్లేనని ఆ పార్టీలో చర్చ మొదలైంది. అర్వింద్‌ దూకుడుతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న భాయ్‌సాబ్‌ అనుచరులు తాజా పరిణామాలతో ఎటూ పాలుపోని స్థితిలో పడ్డారు. సీనియర్‌ నేతలను క్రమంగా పార్టీ పట్టించుకోకపోవడంపై వారంతా అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై యెండల వర్గం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. 


logo