శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Jan 30, 2020 , 03:56:10

నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం

నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం

ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ: ఆర్మూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. తహసీల్‌ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన నిర్మాణ పనులను కోటి రూపాయల నిధులతో చేపట్టారు. సీఎం కేసీఆర్‌ రెండేళ్ల క్రితం ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో అందుబాటులో ఉండే విధంగా నియోజకవర్గానికి క్యాంపు కార్యాలయాలకు రూ. కోటి నిధులను మంజూరు చేశారు. రెండేళ్ల క్రితం ఆర్మూర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి భూమి పూజ చేశారు. క్యాంపు నిర్మాణ పనులను టీఆర్‌ఎస్‌ ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణ చేసి త్వరితగతిన పూర్తి చేయించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రెండు అంతస్తుల్లో నిర్మాణం జరిగింది. పైఅంతస్తులో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసం ఉండేందుకు అనుగుణంగా నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రెండు ఆఫీస్‌రూమ్‌లను, నియోజకవర్గ ప్రజల కోసం వెయిటింగ్‌ రూమ్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు కాన్ఫరెన్స్‌హాల్‌, ఎమ్మెల్యే పీఏకి ప్రత్యేక గది నిర్మాణాలను చేపట్టారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కార్యాలయానికి పూజ చేసి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభంతో నియోజకవర్గంలోని ప్రజలు వారి సమస్యలు పరిష్కరించుకునేందుకు వెసులుబాటు కలుగనుంది.


logo