బుధవారం 27 మే 2020
Nizamabad - Jan 29, 2020 , 01:17:40

ఆహారం వికటించి విద్యార్థులకు అస్వస్థత

 ఆహారం వికటించి  విద్యార్థులకు అస్వస్థత
  • ఆహారం వికటించి విద్యార్థులకు అస్వస్థత

కోటగిరి : నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో భోజనం తిన్న 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరికి వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్య సిబ్బంది వెంటనే గ్లూకోజ్‌లు పెట్టి ఇంజక్షన్‌లు ఇచ్చి అదుపులోకి తెచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే జడ్పీటీసీ శంకర్‌పటేల్‌ హుటాహుటిన దవాఖానకు చేరుకున్నారు. జరిగిన సంఘటన గురించి వార్డెన్‌ నర్సింహులును ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... కోటగిరి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో రోజు మాదిరిగానే మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో అందరు విద్యార్థులు కలిసి భోజనం చేస్తున్నారు. భోజనం చేసే సమయంలో సొరకాయ సాంబారు గిన్నెలో బల్లి కనబడింది. అప్పటికే బల్లి చనిపోయి కనబడింది. దీనిని చూసిన బాలాజీ అనే విద్యార్థి వెంటనే తోటి విద్యార్థులకు చెప్పాడు. అప్పటికే విద్యార్థులందరూ సొరకాయ సాంబారుతో భోజనం చేశారు. ఆ తర్వాత కొందరు విద్యార్థులు కడుపు నొప్పికి గురికాగా.. మరికొందరికి విరేచనాలు చేసుకున్నారు. ఈ విషయాన్ని వార్డెన్‌కు తెలియగానే వెంటనే ఆయన వచ్చాడు. విద్యార్థులను దవాఖానకు తరలించారు. కోటగిరి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ వైద్య సిబ్బంది విద్యార్థులకు స్లైన్‌ పెట్టి ఆదుపులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కోటగిరి జడ్పీటీసీ శంకర్‌పటేల్‌, మాజీ వైస్‌ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, కొల్లూర్‌ కిశోర్‌బాబు, సుంకిని సర్పంచి మాధవ్‌రావు, సోంపూర్‌ ఎంపీటీసీ అనంత విఠల్‌, కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్‌, తహసీల్దార్‌ విఠల్‌, పొతంగల్‌ విండో చైర్మన్‌ విజయ్‌కుమార్‌ పటేల్‌ హుటాహుటిన దవాఖానకు చేరుకొని విద్యార్థుల పరిస్థితిపై ఆరాతీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని సూచించారు.

అసలేమి జరిగింది...

బీసీ హాస్టల్‌లో వంట చేసే వ్యక్తి వివాహం ఉందని మంగళవారం ఉదయం సెలవుపై వెళ్లాడు. వంట మనిషి (కుక్‌) లేకపోవడంతో హాస్టల్‌లో వాచ్‌మెన్‌  సుదర్శన్‌ సాయంత్రం వంట చేశాడు. సాంబారులో బల్లిపడింది ఆయన గమనించలేదు. విద్యార్థులందరూ భోజనం చేయడానికి కూర్చున్నారు. హాస్టల్‌లో 71 మంది విద్యార్థులు ఉండగా.. అప్పటికే చాలామంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. చివరి సమయంలో సాంబారు గిన్నెలో బల్లి కనిపించడంతో దానిని చూసిన విద్యార్థులు ఒక్కసారిగా నివ్వెర పోయి వాంతులు చేసుకున్నారు. మరికొంత మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడ్డారు. ఆస్వస్థతకు గురైన విద్యార్థులను కోటగిరిలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)దవాఖానలో చికిత్స చేశారు. డీఎంహెచ్‌వో సుదర్శనం మంగళవారం రాత్రి విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసి అందిస్తున్న వైద్యసేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.


logo