శనివారం 30 మే 2020
Nizamabad - Jan 29, 2020 , 01:14:44

అంతా.. చూచిరాతే..

అంతా.. చూచిరాతే..

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందంటారు. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టేందుకు చేస్తున్న వృత్తి విద్యా కోర్సు (బీఈడీ) కొన్ని కళాశాలల తీరుతో అభాసుపాలవుతోంది. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పలు బీఈడీ కళాశాలల తీరు అధ్వానంగా మారిందనడానికి రెండు రోజులుగా జరుగుతున్న ప్రాక్టికల్‌ పరీక్షలే నిదర్శనం. నిబంధనలకు విరుద్ధంగా అంతా చూచిరాతనే నడుస్తోంది. ఇదంతా ఏకంగా టీయూ పరీక్షల నియంత్రణాధికారి తనిఖీల్లో వెల్లడికావడం గమనార్హం. పరీక్షల్లో ఒకరో, ఇద్దరో చూసి రాస్తుండగా పట్టుకొని మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కానీ, ఏకంగా కళాశాల పరీక్షా కేంద్రాలనే రద్దు చేసే చర్యలు తీసుకున్నారంటే అక్కడ జరుగుతున్న పరీక్షా విధానం ఏమిటో తెలుస్తోంది. 

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 15 కళాశాలల్లో ఈనెల 27, 28 తేదీల్లో బీఈడీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ ఛాత్రోపాధ్యాయులకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించారు. ప్రాక్టికల్‌ పరీక్షలంటే షరా మామూలే కదా అనుకుని నిర్వహించిన కళాశాలలకు షాక్‌ కొట్టినట్లయ్యింది. గ తంలో ఎన్నడూ లేని విధంగా ప్రాక్టికల్‌ పరీక్షలను ఏకంగా తెలంగాణ విశ్వవిద్యాలయ పరీక్షల ని యంత్రణాధికారి తనిఖీ చేశారు. తనిఖీలంటే కూ డా మామూలుగానే ఉంటుందని ఊహించిన వారికి.. సీఈవో తీసుకున్న చర్యలతో ఖంగుతినాల్సి వచ్చింది. మొదటి రోజు సోమవారం నిజామాబాద్‌, ఆర్మూర్‌, సారంగాపూర్‌లో నిర్వహించిన ప్రాక్టికల్‌ పరీక్షా కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి ఘంటా చంద్రశేఖర్‌ తనిఖీ చేశారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న రెండు కళాశాలల పరీక్షా కేంద్రాలను ఆయన రద్దుచేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న కామారెడ్డి కర్షక్‌ బీఈడీ కళాశాల అధ్యాపకులను విధుల నుం చి తొలగించడం గమనార్హం. మంగళవారం సైతం ఓ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన సీవోఈ అక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష కొనసాగు తుండడంతో పరీక్షను రద్దు చేశారు. పరీక్షా కేంద్రాలను రద్దు చేస్తూ తర్వా త రోజు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అసలు బీఈడీ ప్రాక్టికల్‌ పరీక్షలంటేనే చూసి రాయడమే కదా అనే విధంగా మారిం ది. గతంలో యూనివర్సిటీ అధికారుల వైఫల్యమో, కళాశాలల్లోని సిబ్బంది అమ్యామ్యాలతోనో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. 

ప్రాక్టికల్‌ పరీక్షా విధానం..

బీఈడీ కళాశాలలో మొదటి సెమిస్టర్‌లో ఈపీసీ-1ను ప్రాక్టికల్‌ పరీక్షగా నిర్వహిస్తారు. ఇందులో యోగా, కమ్యూనికేటీవ్‌ ఇంగ్ల్లిష్‌, లైఫ్‌ స్కిల్స్‌ అనే విభాగాలను పొందుపరుస్తారు. ఈ మూడు విభాగాల నుంచి ప్రశ్నలను ఎంచుకొని ప్రాక్టికల్‌ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష అనంతరం వైవా తీసుకుంటారు. పరీక్ష, వైవాలో వచ్చిన మార్కులను అవార్డు లిస్ట్‌లో పొందుపర్చి జవాబుపత్రాలతో యూనివర్సిటీకి పంపిస్తారు. 

జరుగుతున్నది ఇది..

ప్రాక్టికల్‌ పరీక్షలకు యూనివర్సిటీ అధికారులు ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్లను పరీక్షా కేంద్రాలకు కేటాయిస్తారు. ఒక కళాశాలకు చెందిన అధ్యాపకులు మరో కళాశాలకు ఎగ్జామినర్లుగా వెళ్తుంటారు. ఇదంతా బాగానే ఉన్నా.. పరీక్షా కేంద్రాలకు ఎక్స్‌టర్నల్స్‌ సమయానికి రాకపోవడం, వచ్చినా చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ఛాత్రోపాధ్యాయులు రికార్డులను పక్కనే పెట్టుకొని ప్రాక్టికల్‌ పరీక్షలను రాసేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30  వరకు నిర్వహించాల్సిన పరీక్షలు.. మధ్యాహ్నం వరకే ముగించేసి వెళ్తుండడం గమనార్హం.  

సీవోఈ తనిఖీల్లో వెల్లడైన నిజాలు.. 

పరీక్షా కేంద్రాల్లో సమయపాలన పాటించక పోవడం గుర్తించారు. ప్రశ్నాపత్రాలు రూపొందించక పోవడం, ఏకంగా పరీక్షా కేంద్రంలోని ఛాత్రోపాధ్యాయులందరూ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడడం గమనించారు. ఎక్స్‌టర్నల్స్‌ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. 


logo