మంగళవారం 26 మే 2020
Nizamabad - Jan 29, 2020 , T01:10

లాభాల బాటలో పరుగులు

లాభాల బాటలో పరుగులు

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆర్టీసీని లాభాల బాటలోకి తేవడానికి సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వ చర్యలతో నష్టాల ఊబిలోంచి ఆర్టీసీ సంస్థ లాభాల బాటలోకి పయనిస్తున్నది. సీఎం కేసీఆర్‌ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో అధికారులు సంస్థను కాపాడుకునే బాధ్యతను పెంచాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కలగడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచింది. స్థూలంగా ఆర్టీసీకి కొత్త కళను తెస్తోంది. లాభాల వైపు ప్రస్తుతం ఆర్టీసీ పయనిస్తున్నది. తాజాగా డిసెంబర్‌ మాసంలో నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో ఆర్టీసీకి వచ్చిన ఆదాయ గణంకాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. డిసెంబర్‌ నెలాఖరు నాటికి నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో మొత్తం రూ. 28 కోట్ల నష్టం నుంచి బయటపడి.. రూ.13 కోట్ల నష్టానికి గట్ట్టెక్కింది. అంటే దాదాపు రూ. 15 కోట్ల నష్ట భారాన్ని తగ్గించుకుని ఊపిరి పీల్చుకుంది. రానున్నది మంచి భవిష్యత్తేనన్న సంకేతాలు అందుకొని ఊరట పొందుతున్నది. మార్చి నాటికి ఈ నష్టాలన్నీ తీర్చేసి పూర్తిగా లాభాలతో సరికొత్త పంథాలో ఆర్టీసీ ప్రగతిచక్రం దూసుకుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల్లో ఈ పరిణామాలు సంతోషాన్ని నింపుతున్నాయి. కొత్త భవిష్యత్తుకు నాంది పలుకుతున్నాయి. యూనియన్‌ ముసుగులో రాజకీయాలతోనే సరిపోయిన సర్వీస్‌.. ఇప్పుడు సంతృప్తికరంగా సంస్థకు మేలుచేసే విధంగా నిర్వహించడం ఉద్యోగుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నది. కేసీఆర్‌ అమలు చేసిన 40 పాయింట్ల సంస్కరణల ఫలితంగానే ఆర్టీసీలో పెనుమార్పులు జరుగుతున్నాయని ఉద్యోగవర్గం ముక్తకంఠంతో అంగీకరిస్తున్నది. ఆ 40 సంస్కరణలను క్రమానుగతంగా ఆర్టీసీలో అమలు చేస్తూ రావడంతో వాటి ఫలాలు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో లోపభూయిష్టమైన వ్యవస్థ నుంచి బలోపేతమైన సంస్థగా ఆర్టీసీ రూపుదిద్దుకునే క్రమంలో తొలి అడుగు పడిందని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రధానంగా 40 పాయింట్ల ఆచరణలో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందడం, ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం, దీని కోసం ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, స్ఫూర్తి నింపడం, కౌన్సిలింగ్‌ నిర్వహించడం, విజ్ఞప్తుల మేరకు మానవీయకోణంలో బదిలీలకు అవకాశం కల్పించడం, ప్రతి డిపోలో ఫిర్యాదుల బాక్సును అందుబాటులో ఉంచి సమస్యలేవైనా సత్వరం స్పందించే యంత్రాంగం ఏర్పాటు చేసుకోవడం, ఇటీవల స్వల్పంగా టికెట్‌ చార్జీలు పెంచడంతో కొంత అదనపు ఆదాయం సమకూరడడం, ప్రతి వారం ఉద్యోగుల సంక్షేమ సంఘం కోసం సమావేశాలు నిర్వహించుకుని చర్చించుకోవడం తదితర కీలకమైన అంశాలను అమలు చేయడం ఆర్టీసీకి ఆయువుపట్టుగా మారింది. కొత్త జవజీవాలనిచ్చింది. మార్చి నాటికి నష్టాలన్నీ తీర్చుకుని లాభాల బాటలో కొనసాగుతామని ఈ సందర్భంగా ఆర్టీసీ నిజామాబాదఖ రీజినల్‌ మేనేజర్‌ సోలోమాన్‌ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. నిజామాబాద్‌ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలోకి వచ్చే నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో మొత్తం 2,800 ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. రీజియన్‌ పరిధిలో కార్గో సేవలు అందుబాటులోకి తేవడానికి సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. కార్గో సేవలు అందుబాటులోకి వస్తే సంస్థకు మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంది.


logo