శనివారం 06 జూన్ 2020
Nizamabad - Jan 29, 2020 , 01:11:16

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం..!

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం..!

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయబోమని, వారి నమ్మకాన్ని నిలబెడతామని, మరింత బాధ్యతతో మెలుగుతామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి కారణం.. సిద్ధ్దాంతాలు, విలువలకు తిలోదకాలచ్చి డి.శ్రీనివాస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటై పనిచేశారని, టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రచారం చేశారని ఆరోపించారు. అందుకే బీజేపీకి అన్ని సీట్లు వచ్చాయని, ఒరిజినల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఇద్దరే గెలిచారని, వారు కూడా లౌకిక పార్టీ అయిన తమతో ఉంటామని వచ్చారని, మతతత్వ పార్టీ బీజేపీకి మద్దతివ్వలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పాశుపతాస్ర్తాలుగా ప్రజల వద్దకు తీసుకుపోయామని, ఓవైపు సంక్షేమం.. మరోవైపు మంత్రి కేటీఆర్‌ మున్సిపాలిటీల అభివృద్ధికి చూపిన ప్రత్యేక శ్రద్ధ, నిధుల కేటాయింపు .. ఈ రెండూ టీఆర్‌ఎస్‌కు అఖండ విజయాన్ని సాధించిపెట్టాయని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా కష్టపడి టీఆర్‌ఎస్‌ గెలుపునకు కృషి చేశారన్నారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భీమ్‌గల్‌ అభివృద్ధి ఇక నా బాధ్యత అని మంత్రి ప్రకటించారు.  

ఉభయ జిల్లాల్లో అన్ని స్థానాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. దీనిపై మీ కామెంట్‌..? 

చాలా సంతోషంగా ఉంది. ఈ ఎన్నికల్లో మా బ్రహ్మాస్తాలు, పాశుపతాస్త్రాలు .. అన్ని అస్ర్తాలు సీఎం కేసీఆరే. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా మున్సిపాలిటీలకు నిధులిచ్చి డెవలప్‌మెంట్‌ చేశారు. ఈ రెండు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీని విజయపథంలో ముందుకు తీసుకెళ్లాయి. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడి ప్రజలకు విడమర్చి చెప్పి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించిపెట్టారు. కామారెడ్డి, నిజామాబాద్‌ ఉభయ జిల్లాల్లో 55 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌ పార్టీకే వచ్చినయి. ఇది అనూహ్యమైన విజయం. మరింత బాధ్యతతో మెలుగుతాం. ప్రజలకు ఏ నమ్మకం పెట్టుకొని సీట్లు గెలిపించిండ్రో.. ఆ నమ్మకాన్ని నిలబెడతాం. 

బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. మేమే గెలిచామని ఎంపీ అర్వింద్‌ అంటున్నాడు. దీనిపై అభిప్రాయం..?  

బీజేపీకి 28 సీట్లు టెక్నికల్‌గా వచ్చినయి.. కరెక్టే. కానీ, నిజామాబాద్‌ నగరంలో జరిగిన పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. బీజేపీ ఒక్కటే ఇవి గెలవలేదు. డి.శ్రీనివాస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అన్ని కలిపి ఇక్కడ కొట్లాడినయి. గతంలో మున్సిపల్‌ ఎన్నికల్లో 16 సీట్లు కాంగ్రెస్‌కు ఉండే. ఇవాళ రెండు సీట్లే వచ్చినయి. ఆ 14 సీట్లు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌కు పోయాయి. ఒరిజినల్‌ కాంగ్రెసోళ్లు ఇద్దరు మాత్రమే గెలిచారు. వారు కూడా మాతోనే నిలబడ్డారు. డి.శ్రీనివాస్‌, కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పోయినయి.. అందుకే వాళ్లకు అన్ని సీట్లు వచ్చినయి. లేకుంటే వచ్చేవి కావు. 

అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఇదే విజయ రహస్యమా?

అన్ని నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి ప్రజలకు విడమరిచి చెప్పి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించి పెట్టారు. వంద శాతం చైర్మన్‌ సీట్లు సాధించాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర నాయకత్వం, ఇన్‌చార్జిలు, నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయాం. అందరి సహకారం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపునకు కృషిచేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 55శాతం వార్డులు టీఆర్‌ఎస్‌కే దక్కాయి. ఇది అనూహ్యమైన విజయం. మరింత బాధ్యతతో మెదలుతాం. ప్రజలు ఏ నమ్మకం పెట్టుకొని మమ్మల్ని గెలిపించారో, తప్పకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. 

భీమ్‌గల్‌ మున్సిపాలిటీని క్లీన్‌స్వీప్‌ చేశారు. ఇది ఎలా సాధ్యమైంది.? 

మేము ఎలాంటి ప్రణాళిక రూపొందించ లేదు. సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమం, మంత్రి కేటీఆర్‌ మున్సిపాలిటీలను డెవలప్‌మెంట్‌ చేయడం ఈ రెండు అంశాలే మా విజయానికి కారణం. దీనికి తోడు కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేశారు. ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను సవివరంగా ప్రజలకు వివరించారు. అందుకే భీమ్‌గల్‌ బల్దియాను టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. దీనికి గాను పట్టణ ప్రజలకు నా హృదయాయ పూర్వక ధన్యవాదాలు. మా పార్టీ, మా మీద, కౌన్సిలర్ల మీద నమ్మకం పెట్టుకొని సంపూర్ణ విజయం అందించారు. భీమ్‌గల్‌ అభివృద్ధికి మరింత కృషిచేస్తా.


logo