సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Jan 28, 2020 , 01:38:17

అర్వింద్‌.. హుందాగా మెదులు..

అర్వింద్‌.. హుందాగా మెదులు..
  • పెద్దవారిని విమర్శిస్తే పెద్దోడివి అయిపోవు..
  • ఎంపీపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిప్పులు
  • చెప్పినట్టే టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే మేయర్‌ చేశాం : ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌పై రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. మేయర్‌ ఎన్నిక తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన ఎంపీ అర్వింద్‌ వైఖరిని తూర్పారబట్టారు. హుందాతనంగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికారు. పెద్దవాళ్లను తిడితే పెద్దవాడిని అయిపోతాననే భ్రమలో ఉన్న అవివేకి అర్వింద్‌ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఇద్దరు, ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థి బీజేపీ రావొద్దనే ఉద్దేశంతో సెక్యులర్‌ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌కు మేయర్‌ ఎన్నిక సందర్బంగా మద్దతు పలికారని తెలిపారు. ఎవరు అబద్దాలు ప్రచారం చేశారు? ఎవరు మాటమీద నిలబడ్డారు? ఎవరి మాట మీద నిలబడి చెప్పింది చెప్పినట్లుగా చేశారో ఒకసారి ప్రజలు గమనించాలని కోరుతున్నానని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ గట్టిగా తుమ్మితే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కొట్టుకొని పోతారని ఒకాయన మాట్లాడుతున్నాడని, ఆయన ఆజ్ఞానానికి జాలి వేస్తుందని ఎంపీ అర్వింద్‌ను ఉద్దేశించి మంత్రి ఎద్దేవా చేశారు. కామారెడ్డి, నిజామాబాద్‌ ఉభయ జిల్లాల్లో బల్దియా ఎన్నికల్లో 52శాతం ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటేసి మద్దతు తెలిపారని, బీజేపీకి 17శాతం ప్రజల మద్దతు మాత్రమే ఉందని మంత్రి అన్నారు. ఎవరు దగ్గితే ఎవరు పోతారో, ఎవరు తుమ్మితే ఎవరు పోతారో ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఇది వరకే అర్వింద్‌కు హితబోధ చేశారని, అయినా ఆయన పద్ధతి మార్చుకోవడం లేదని గుర్తుచేశారు. ఏదో మీడియాతో మాట్లాడితే పెద్దవాడిని అయిపోతానని అనుకోవద్దని అన్నారు. తమకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.  


 టీఆర్‌ఎస్‌ నుంచే అభ్యర్థినే మేయర్‌ చేశాం : ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా

ఎన్నికల ప్రచారంలో అర్వింద్‌ అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా ఆరోపించారు. ఎంఐఎంకు మేయర్‌ ఇస్తారంటూ అబద్ధ్దపు ప్రచారాలు చేసి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, ఇచ్చిన మాట ప్రకారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే మేయర్‌ చేసి మాట మీద నిలబడ్డామని అన్నారు. అప్పుడే తాను సవాల్‌ విసిరానని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మేయర్‌ కాకపోతే రాజీనామా చేస్తానని చెబితే సవాల్‌ స్వీకరించకుండా తప్పించుకొని తిరిగాడని, వక్రభాష్యాలు చెప్పాడని ఎంపీ అర్వింద్‌ తీరును విమర్శించారు. మంత్రి కేటీఆర్‌, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో మేయర్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ దక్కించుకోగలిగిందని అన్నారు. 


ఇందూరు గడ్డ టీఆర్‌ఎస్‌దే :  ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి 

నిజామాబాద్‌ గడ్డ టీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తుందని, ఉద్యమ కాలం నుంచి ఎన్నికలు ఏవైనా కొండంత ధైర్యాన్నిచ్చి టీఆర్‌ఎస్‌కు ఘన విజయాన్ని అందిస్తున్నదని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. తొలిసారిగా జడ్పీపీఠాన్ని ఇక్కడ కైవసం చేసుకొని టీఆర్‌ఎస్‌ సత్తా ఏంటో ఆనాడే చాటి చెప్పామని, అప్పటి నుంచి విజయపరంపర ఇప్పటికి కొనసాగుతున్నదని అన్నారు. 


logo