శనివారం 06 జూన్ 2020
Nizamabad - Jan 28, 2020 , 01:36:11

పల్లె ప్రగతికి అత్యంత ప్రాధాన్యం

పల్లె ప్రగతికి అత్యంత ప్రాధాన్యం

ఇందూరు: పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుద్ధ్యం, పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి  అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. సమన్వయ సమావేశంతో శాఖ అధికారుల మధ్య ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. తప్పనిసరిగా జిల్లా అధికారులు సోమవారం ఉదయం ప్రజావాణికి, సాయంత్రం కన్వర్జెన్స్‌ సమావేశానికి హాజ రు కావాలని తెలిపారు. ప్రజావాణి ప్రాముఖ్యాన్ని తగ్గించవద్దని, గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. అధికారులు చురుకుగా పని చేయాలని, అప్పుడే శాఖాపరమైన పనులు సజావుగా పూర్తి చేయడానికి వీలవుతుందన్నారు. ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు అందించి 100శాతం తడి, పొడి చెత్త సేకరించడంతో ప్రతి గ్రామానికి తప్పకుండా ట్రాక్టర్‌ సమకూర్చుకోవడం, దాని నెలసరి వాయిదాల చెల్లింపులు, మొక్కలకు నీరు అందించే కార్యక్రమం చేపట్టడం ద్వారా ఉపాధిహామీ నుంచి నిధులు వస్తాయన్నారు. శ్మశాన వాటికలో ప్రతి గ్రామంలో వచ్చే నెల చివరికల్లా పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలను నిర్మించుకొనేలా తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఆయా గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమాల పై నివేదికలు సిద్ధం చేసుకోవాలని, మండల అధికారులు ఆ  మండలాల నుంచే వీడియో కాన్ఫరెన్సుకు హాజరుకావాలన్నారు. ఫిబ్రవరి 1న పలు జిల్లాల విశ్రాం త మాజీ సైనికుల ఉద్యోగులతో వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నందున దానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు సంబంధిత శాఖలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో అంజయ్య, సైనిక సంక్షేమశాఖ మేనేజర్‌ గౌరవ్‌ జాదవ్‌, డీఆర్డీవో రమేశ్‌ రాథోడ్‌, డీపీవో జయసుధ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

‘మీ వెనకాల నేనుంటా..’ 

‘అధికారులు లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని, ఏమైనా ఇబ్బందులుంటే సరిచేయడానికి మీ వెనకాల నేను ఉంటా’ అని కలెక్టర్‌  నారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా అధికారుల కన్వర్జెన్స్‌ మీటింగ్‌ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని విధాలా అధికారులను ప్రోత్సహిస్తూ ప్రశాంతంగా నిర్వహించడానికి వెనక ఉండి నడిపించిన కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అధికారుల సమక్షంలో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి ఎవరూ ఇబ్బందులు పెట్టరని, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే తాను మీ వెంట ఉంటాం అని తెలిపారు. జిల్లాలో గత ఒకటిన్నర సంవత్సరంగా ఎన్నికల విధుల్లో ఉన్నందున కమిషనర్లు , జిల్లా అధికారులు బాగా పనిచేశారని అందుకు గాను  ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నాలుగు సంవత్సరాలు కార్యక్రమాల పై శ్రద్ధ వహించడానికి అవకాశం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో అంజయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌ పాల్గొన్నారు. 


logo