గురువారం 28 మే 2020
Nizamabad - Jan 28, 2020 , 01:28:04

భీమ్‌గల్‌ బల్దియా తొలి చైర్‌పర్సన్‌గా రాజశ్రీ

భీమ్‌గల్‌ బల్దియా తొలి చైర్‌పర్సన్‌గా రాజశ్రీ

భీమ్‌గల్‌ : జిల్లాలో నూతనంగా ఏర్పడిన భీమ్‌గల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా 9వ వార్డు కౌన్సిలర్‌ మల్లెల రాజశ్రీ ఎన్నికయ్యారు. వైస్‌ చైర్మన్‌గా 4వ వార్డు అభ్యర్థి గున్నాల భగత్‌ ఎన్నికయ్యారు. వీరిద్దరినీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉదయం 11 గంటలకు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్‌గా మల్లెల రాజశ్రీని 4వ వార్డు కౌన్సిలర్‌ గున్నాల బాల భగత్‌ ప్రతిపాదించగా.. 6వ వార్డు కౌన్సిలర్‌ చెప్పాల గంగాధర్‌ బలపర్చారు. మిగతా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. వైస్‌ చైర్మన్‌గా గున్నాల భగత్‌ను 8వ వార్డు కౌన్సిలర్‌ జోగినిపల్లి సతీశ్‌గౌడ్‌ ప్రతిపాదించగా.. 5వ వార్డు కౌన్సిలర్‌ బొదిరె నర్సయ్య బలపర్చారు. మిగతా సభ్యులందరూ ఏకగ్రీంగా ఆమోదించారు. దీంతో చైర్మన్‌ వైస్‌ చైర్మన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం చైర్‌పర్సన్‌ రాజశ్రీ, వైస్‌ చైర్మన్‌ గున్నాల బాల భగత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భీమ్‌గల్‌లో 12 స్థానాలకు గానూ 7వ వార్డు స్థానం ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మిగతా 11 వార్డులకు ఎన్నికలు జరగగా.. టీఆర్‌ఎస్‌ అన్నింటిలో ఘన విజయం సాధించింది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకోవడంతో భీమ్‌గల్‌ మున్పిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం పరిపూర్ణమయ్యింది. భీమ్‌గల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ స్థానం బీసీ మహిళకు రిజర్వేషన్‌ రావడంతో మల్లెల రాజశ్రీని ఎంపిక చేశారు. సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ప్రిసైడింగ్‌ అధికారి సింహాచలం ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నిక నిర్వహించిన మున్సిపల్‌ కార్యాలయం వద్ద సీఐ సైదయ్య, ఎస్సైలు తగు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ గోపు గంగాధర్‌, తహసీల్దార్‌ రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నిండిన జోష్‌..

భీమ్‌గల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తం పన్నెండుకు పన్నెండు స్థానాలను కైవసం చేసుకొని తొలి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను కైవసం చేసుకోవడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నిండింది. సోమవారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ముగియగానే సభ్యులు, కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. చైర్మన్‌ను ఆమె భర్త మలెల్ల లక్ష్మణ్‌ పైకి ఎత్తుకొని ఆనందం వ్యక్తం చేయడం నవ్వులు పూయించింది. అభ్యర్థులను కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తారు.


logo