శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Jan 27, 2020 ,

బోధన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పీఠంపై ఉత్కంఠ

బోధన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పీఠంపై ఉత్కంఠ

బోధన్‌, నమస్తే తెలంగాణ : బోధన్‌ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరుగుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బోధన్‌ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 20 వార్డులను గెలుచుకుంది. దీంతో ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. దీంతో ఈ మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోబోతోంది. చైర్మన్‌ పీఠంపై ఎవరు కూర్చుంటారన్న విషయమై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం వచ్చినందును ఎంఐఎం మద్దతు అవసరం లేదన్న భావనలో ఆ పార్టీ స్థానిక నాయకులు ఉన్నారు. దీంతో చైర్మన్‌ పదవితో పాటు వైస్‌ చైర్మన్‌ పదవి కూడా టీఆర్‌ఎస్‌లోనే ఒకరికి దక్కనుంది. శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడగానే, గెలుపొందిన టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. అక్కడి ఒక హోటల్‌లో వారు బసచేసినట్లు తెలిసింది. సోమవారం ఉదయం మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు జరిగే బోధన్‌ మున్సిపల్‌ కార్యాలయానికి నేరుగా చేరుకుంటారని సమాచారం. బీసీ మహిళకు రిజర్వు అయిన మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 25వ వార్డు నుంచి గెలుపొందిన తూము పద్మావతి పేరు ప్రచారంలో ఉంది. పద్మావతితో పాటు ఆమె భర్త తూము శరత్‌రెడ్డి కూడా 35వ వార్డు నుంచి గెలుపొందారు. మున్సిపల్‌ చైర్మన్‌ రేసులో ఉన్నట్లు మొదటి నుంచి పద్మావతి పేరు ప్రచారంలో ఉంది. 

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే షకీల్‌.. 

బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలుసుకున్నారు. బోధన్‌ మున్సిపల్‌ ఫలితాలను, స్థానిక పరిస్థితులను ఆయనకు వివరించినట్లు ఎమ్మెల్యే ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. సోమవారం మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 

ఓవైసీని కలిసిన ఎంఐఎం కౌన్సిలర్లు.. 

బోధన్‌ బల్దియా నుంచి గెలుపొందిన 11 మంది ఎంఐఎం కౌన్సిలర్లు ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లి తమ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీని కలిసారు. తమ అధినేతకు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలను వారు వివరించినట్లు సమాచారం. 

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు ఏర్పాట్లు ..

మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం బోధన్‌ మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం డీఆర్డీవో రమేశ్‌ రాథోడ్‌ను ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు బోధన్‌ మున్సిపాలిటీలో గెలుపొందిన అభ్యర్థుల సమావేశం జరుగుతుంది. ముందుగా అభ్యర్థులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం 12.30 గంటలకు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక అనంతరం వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల కోసం కార్యాలయంలోని కొత్త సమావేశం హాల్‌లో ఏర్పాట్లు జరిగాయి. సమావేశం హాల్‌లో పోడియం ఎడమవైపున ఒక వరుసలో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల కోసం సీట్లు ఏర్పాటు చేశారు. వారి వెనుక బీజేపీకి ఉన్న ఒకే ఒక్క కౌన్సిలర్‌ కోసం సీటు అమర్చారు. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల వరుసకు ముందు భాగంలో పోడియం దగ్గరగా ఎక్స్‌ఆఫీషియో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే కోసం సీటు, పోడియం కుడిపక్కన ముందుగా ఎంఐఎం కౌన్సిలర్లు కూర్చునే వీలుగా సీట్లను ఏర్పాటు చేశారు. వారి వెనుక కాంగ్రెస్‌ కౌన్సిలర్లకు కుర్చీలు వేశారు.


logo