గురువారం 04 జూన్ 2020
Nizamabad - Jan 26, 2020 , 03:13:57

ఎన్నికలు ఏవైనా..గెలుపు టీఆర్‌ఎస్‌దే

ఎన్నికలు ఏవైనా..గెలుపు టీఆర్‌ఎస్‌దే
  • -కేసీఆర్‌ అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమమే అస్ర్తాలు
  • -ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతు
  • -మంత్రి, ఎమ్మెల్యేల కృషితో ఫలితాలు
  • -మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశంలో సత్ఫలితాలు
  • -టీఆర్‌ఎస్‌లో రెట్టించిన ఉత్సాహం


నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఎన్నికలు ఏవైనా గెలుస్తున్నది మాత్రం టీఆర్‌ఎస్సే. 2014 నుంచి 2020 వరకు శాసనసభా ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సాధించిన విజయాలు ఇందుకు నిదర్శనం. 2014లో శాసనసభా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జిల్లాలోని అన్ని శాసనసభా స్థానాల్లో ఘన విజయం సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సైతం పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 2019లో శాసనసభా ఎన్నికల్లోనూ అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. 2014లో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ 2019లోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే విజయాలను పునరావృతం చేసింది. గత మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లాలోని నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటీల్లో విజయాలు సాధించింది. తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ ఆర్మూర్‌, బోధన్‌ మున్సిపాలిటీలతో పాటు నూతనంగా ఏర్పడిన భీమ్‌గల్‌ మున్సిపాలిటీలోనూ జెండా ఎగురవేసింది. నిజామాబాద్‌లో ఎంఐఎంతో కలిసి మేయర్‌ పదవిని దక్కించుకోనుంది.

ప్రతిపక్షాల డిపాజిట్ల గల్లంతు...

భీమ్‌గల్‌, ఆర్మూర్‌, బోధన్‌ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌, బీజేపీ మెజారీటీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. పలుచోట్ల అభ్యర్థులైనా దొరకని కాంగ్రెస్‌, బీజేపీలు పోటీలో ఉన్న స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి అడ్రస్‌ గల్లంతయ్యాయి. టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు జీరో స్కోరును మూట గట్టుకున్నాయి.

అభివృద్ధి, సంక్షేమమే అస్ర్తాలు..

అభివృద్ధి, సంక్షేమంతో సీఎం కేసీఆర్‌ అందిస్తున్న మానవీయ పరిపాలన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయానికి కీలకంగా పనిచేసింది. గ్రామాలతో పాటు పట్టణ ప్రాంత పేదలకు అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ముఖ్యమంత్రి సహాయ నిధి, అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్టు, గురుకుల విద్యాలయాలు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు అందిస్తున్న రూ.2016 చొప్పున, దివ్యాంగులకు రూ.3016 చొప్పున అందిస్తున్న నెలనెలా అందిస్తున్న పింఛన్లు, తదితర పథకాలు ఎన్నో అస్ర్తాలుగా ప్రతిపక్షాలను చిత్తు చేశాయి. ఈ పథకాలతో పాటు అరవై ఏండ్లలో జరగని అభివృద్ధి తమ కండ్ల ముందే జరుగుతుండడంతో ప్రజలు టీఆర్‌ఎస్‌కే విజయాలన్నీ కట్టబెట్టారు.

మంత్రి, ఎమ్మెల్యేల కృషి... 

తాజా మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్‌, బిగాల గణేశ్‌ గుప్తా కృషి ఎంతో ఉంది. ఆయా మున్సిపాలిటీలలో వారు అభివృద్ధి చేస్తున్న తీరుతో ప్రజల్లో వీరితో మాత్రమే అభివృద్ది సాధ్యమనే అభిప్రాయం నెలకొంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశంతో వీరు కేసీఆర్‌ సర్కారు చేసిన అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు చక్కగా గుర్తు చేస్తూ ఎన్నికల్లో ముందుకు సాగారు. జిల్లా, నియోజక వర్గాల ఇన్‌చార్జిలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. జిల్లా ఇన్‌చార్జిగా తుల ఉమ, ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల ఇన్‌చార్జిగా లోక బాపురెడ్డి, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గాల ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌ మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం మేరకు జిల్లాలో పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. అందరి సమష్టి కృషితో జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.logo