శనివారం 06 జూన్ 2020
Nizamabad - Jan 26, 2020 , 02:51:19

ఆర్మూరు చైర్మన్‌ గిరీ ఎవరికో..!

ఆర్మూరు చైర్మన్‌ గిరీ ఎవరికో..!
  • -రేసులో ఆరుగురు ఆశావహులు
  • -వైస్‌ చైర్మన్‌ పదవికి తీవ్రపోటీ
  • -ఆసక్తిగా ఎదురుచూస్తున్నఆర్మూర్‌ ప్రజలు


ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ: ఆర్మూర్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ఈనెల 27న జరగబోయే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికపైనే తీవ్ర చర్చ ప్రారంభమైంది. ఆర్మూర్‌ మున్సిపల్‌ పీఠంపై పాగా వేసేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఆశావహులైన కౌన్సిలర్‌ అభ్యర్థులు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు త్రీవ ప్రయత్నాలు చేస్తున్నారు. చైర్‌పర్సన్‌ స్థానంతో పాటు వైస్‌ చైర్మన్‌ గిరీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇంకొందరు ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను దక్కించుకునేందుకు ఎవరికి వారుగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం మున్సిపల్‌ ఫలితాలు వెలువడిన వెంటనే టీఆర్‌ఎస్‌ పార్టీకి కౌన్సిలర్లు,టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లతో కలిసి ఓ ప్రైవేట్‌ బస్సులో క్యాంపునకు వెళ్లినట్లు తెలిసింది. ఫలితాల ప్రకటన తర్వాత చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఫీఠాలను దక్కించుకునేందుకు ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు.

చైర్‌పర్సన్‌ రేసులో ఆరుగురు... వైస్‌ చైర్మన్‌ రేసులో ముగ్గురు...

ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానం బీసీ మహిళకు రిజర్వు అయింది. దీంతో ఆర్మూర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు వారి సతీమణులను, కుటుంబ సభ్యులను బరిలో దించి కౌన్సిలర్లుగా విజయం సాధించారు. ఆర్మూర్‌ మున్సిపల్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ 23 స్థానాలను గెలుచుకోవడంతో ఆర్మూర్‌ బల్దియాపై గులాబీ జెండా ఎగరనుంది. ఈ చైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వన్నెల్‌దేవి లావణ్య, సంగీత ఖాందేశ్‌, పండిత్‌ వినీత, మేడిదాల సంగీత, గాండ్ల లక్ష్మి, అల్జాపూర్‌ రేవతి ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంగా చేస్తున్నారు. వీరితో పాటు తాజా మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కశ్యప్‌ స్వాతిసింగ్‌ సైతం మరోమారు చైర్‌పర్సన్‌ ఫీఠాన్ని అధిరోహించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ దఫా కశ్యప్‌ స్వాతిసింగ్‌కు చైర్‌పర్సన్‌ స్థానాన్ని చేపట్టేందుకు పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చనే చర్చ ఆర్మూర్‌లోని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

దీంతో పాటు ఆర్మూర్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు గంగామోహన్‌ చక్రు, తాటి హన్మాండ్లు, ఇట్టెడి నర్సారెడ్డి పోటీపడుతున్నట్లు తెలిసింది. చైర్‌పర్సన్‌ స్థానాన్ని ఆశిస్తున్న ఆరుగురు ఆశావహుల్లో ఎవరైనా ఒకరికే చైర్‌పర్సన్‌ పదవి వరిస్తుంది. సామాజిక సమీకరణల్లో భాగంగా చైర్‌పర్సన్‌ పీఠం ఒక సామాజిక వర్గానికి కేటాయిస్తే, మరో ప్రధాన సామాజిక వర్గానికి వైస్‌ చైర్మన్‌ పీఠం దక్కే అవకాశం ఉంటుంది. ఏదీఏమైనా ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆశీస్సులు ఉన్న వారికే ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలు దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. శనివారం ఫలితాల వెల్లడి తర్వాత కౌన్సిలర్లతో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను ఆశిస్తున్న ఆశావహులు క్యాంపునకు తరలి వెళ్లారు. సోమవారం చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లకు పరోక్ష పద్ధ్దతిలో ఎన్నికల నిర్వహించాల్సి ఉండగా.. ఆశావహులైన అభ్యర్థులకు కేవలం రెండు రోజుల్లోనే క్యాంపు రాజకీయం ముగియనుంది. ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలు ఎవరికి దక్కనున్నాయోనని ఆర్మూర్‌ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.logo