బుధవారం 27 మే 2020
Nizamabad - Jan 25, 2020 , 01:33:04

దండనెవరికో.. దండలెవరికో..

దండనెవరికో.. దండలెవరికో..
  • -నేడు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ షురూ..
  • -ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • -మొత్తం 6 గంటల్లో అన్ని మున్సిపాలిటీల ఫలితాలు వెల్లడి
  • -మధ్యాహ్నం 2 గంటల్లోపు నిజామాబాద్‌ కార్పొరేషన్‌ , 12 గంటల్లోపు ఆర్మూర్‌, బోధన్‌ ఫలితాలు
  • -గెలుపుపై టీఆర్‌ఎస్‌లో ధీమా.. సమీకరణాల్లో మునిగిన ప్రతిపక్షాలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానేవచ్చాయి. మరికొన్ని గంటల్లో మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు మొదలుకానుండగా.. మున్సిపల్‌ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో దండలెవరికి వేస్తారో.. ఓటర్లు ఎవరిని దండించారో తేలిపోనుంది. బ్యాలెట్‌ పత్రాల ద్వారా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించగా.. బ్యాలెట్‌ బాక్సులను మున్సిపాలిటీల వారీగా స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్ట్రాంగ్‌రూమ్‌లను కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ శుక్రవారం పరిశీలించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 146 వార్డులకు, వార్డుల వారీగా కౌంటింగ్‌ టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి పోలైన ఓట్ల ఆధారంగా, రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. 25 చొప్పున ఓట్లను బండిల్‌గా చుట్టి వెయ్యి ఓట్లను  లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.  రౌండ్‌ ముగియగానే వాటి ఫలితాలను ప్రకటిస్తారు.  నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో మాత్రమే మొత్తం 60 డివిజన్లు పూర్తయ్యే సరికి మధ్యాహ్నం 2 గంటలు దాటే అవకాశం ఉంది. మిగిలిన మూడు మున్సిపాలిటీల్లో ముందే లెక్కింపు ప్రక్రియ ముగిసి ఫలితాలు వెల్లడవుతాయి. భీమ్‌గల్‌ ఫలితాలు ఉదయం 11 గంటల్లోపు, ఆ తర్వాత ఆర్మూర్‌, బోధన్‌ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తవుతుంది. అన్ని మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేస్తామని టీఆర్‌ఎస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీలు లెక్కలు వేసుకొనే పనిలోనే నిమగ్నమయ్యాయి. గెలుపొందిన అభ్యర్థులు 27న ప్రమాణం స్వీకారం చేయనుండగా.. అదేరోజు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు.
- నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: మరో రెండు గంటల్లో ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఈ నెల 22న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించనున్నారు. బ్యాలెట్‌ పత్రాల ద్వారా మున్సిపాలిటీ ఎన్నికలను నిర్వహించారు. ఈ మేరకు బ్యాలెట్‌ బాక్సులను మున్సిపాలిటీల వారీగా స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచారు. కౌంటింగ్‌కోసం కేంద్రాల వద్ద జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలైన ఓట్ల ఆధారంగా రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. తొలుత అన్ని పోలింగ్‌ స్టేషన్ల వారీగా భద్రపరిచిన ఓట్లను ఓ చోట గుమ్మరించి వాటిని కలిపేస్తారు. ఆ తర్వాత 25 చొప్పున ఓట్లను బండిల్‌గా తయారు చేస్తారు. అలా వెయ్యి ఓట్లను తొలుత లెక్కిస్తారు. దీన్ని తొలిరౌండ్‌గా పరిగణిస్తారు. అలా వెయ్యి ఓట్లను లెక్కించిన తర్వాత తొలిరౌండ్‌ ముగియగానే వాటి ఫలితాలను ప్రకటిస్తారు. అలా పోలైన ఓట్ల వారీగా రౌండ్లు ఉంటాయి.

నిజామాబాద్‌ కార్పొరేషన్‌ విషయానికే వస్తే.. ఒక్కో డివిజన్‌లో నాలుగు వేలు.. ఆపై ఓట్లు పోలయ్యాయి. వీటిని నాలుగు రౌండ్లుగా లెక్కిస్తారు. ఆ వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. ఐదు వేలపై ఓట్లు పోలైన డివిజన్‌లో ఐదు రౌండ్ల మేర లెక్కింపు ప్రక్రియను చేపడతారు. దీంతో నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో మాత్రమే మొత్తం 60 డివిజన్లు పూర్తయ్యే సరికి మధ్యాహ్నం 2 గంటలు దాటే వీలుందని అధికారులు తెలిపారు. మిగిలిన మూడు మున్సిపాలిటీల్లో ముందే లెక్కింపు ప్రక్రియ ముగుస్తుంది. ఫలితాలు వెల్లడవుతాయి. భీమ్‌గల్‌ ఫలితాలు ఉదయం 11 గంటల్లోపే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆర్మూర్‌, బోధన్‌ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తవుతుంది. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒకటే.. మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం తీసుకునే అవకాశం ఉంది. అన్ని మున్సిపాలిటీల్లో ఓటరు తీర్పుకు ఆరు గంటల సమయం తీసుకోనుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు నిజామాబాద్‌ ఫలితాలు వెల్లడి కావడంతో ఏ మున్సిపాలిటీపై ఎవరు జెండా ఎగురవేస్తారో తేలిపోనుంది. అన్ని మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు లెక్కలు వేసుకొనే పనిలోనే నిమగ్నమయ్యారు. ‘నీకెన్ని నాకెంత..’ అనే సమీకరణలో అభ్యర్థులు తలమునకలయ్యారు. ఆ ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్‌ షురూ కానుంది.

ఉదయం 8 గంటలకే కౌంటింగ్‌ ప్రారంభం..

నాలుగు మున్సిపాలిటీల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన రీపోలింగ్‌ జరుగుతున్న కేంద్రంలోనూ, శనివారం కౌంటింగ్‌ నిర్వహించనున్న కౌంటింగ్‌ కేంద్రంలోనూ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో 146 వార్డులకు, వార్డుల వారీగా కౌంటింగ్‌ టేబుల్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియ పకడ్బందీ బందోబస్తు మధ్య జరుగుతుందన్నారు. కౌంటింగ్‌ సెంటర్‌లో ప్రతి హాల్‌లో వీడియో గ్రఫీ, వెబ్‌ కాస్టింగ్‌ ఉంటుందని తెలిపారు. కౌంటింగ్‌ సెంటర్‌లో ఎన్నికల కమిషన్‌ అనుమతించిన వారిని మాత్రమే కౌంటింగ్‌ హాల్‌లో అనుమతి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్‌ సెంటర్‌కు 100 మీటర్ల దూరంలో వాహనాలు నిలబడాలని తెలిపారు. సెల్‌ఫోన్స్‌ అనుమతించబడవని అన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జనవరి 27వ తేదీన ఎన్నుకోబడిన వారికి నాలుగు మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశం ఉంటుందని తెలిపారు. సమావేశం నిర్వహించుటకు నాలుగు మున్సిపాలిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో మొదటి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు 27వ తేదీన ప్రమాణస్వీకారం ఉంటుందని, అనంతరం 12.30 గంటలకు నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల ఉంటుందన్నారు.

మిగతా మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ఉంటుందన్నారు. 50శాతం కోరం ఉంటే ఎన్నిక నిర్వహిస్తామన్నారు. లేకుంటే వాయిదా వేసి మరుసటి రోజు ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. నిజామాబాద్‌ సీపీ ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్త్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు బోధన్‌లోని 32వ వార్డు 87 పోలింగ్‌ స్టేషన్‌లో రీపోలింగ్‌ జరుగుతున్న తీరును పరిశీలించారు. అధికారులను బందోబస్తు గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట జేసీ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషన్‌ జాన్‌సాంసన్‌, బోధన్‌ తహసీల్దార్‌ తదితరులు ఉన్నారు.logo