శనివారం 30 మే 2020
Nizamabad - Jan 25, 2020 , 01:31:54

బోధన్‌లో రీపోలింగ్‌ ప్రశాంతం

బోధన్‌లో రీపోలింగ్‌ ప్రశాంతం
  • -32వ వార్డులోని 87వ పోలింగ్‌ స్టేషన్‌లో 73.63 శాతం పోలింగ్‌ నమోదు
  • -మొదటి పోలింగ్‌ కంటే తగ్గిన మూడు ఓట్లు
  • -పోలింగ్‌ను పర్యవేక్షించిన కలెక్టర్‌, జేసీరాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు శుక్రవారం బోధన్‌ పట్టణంలోని 32వ వార్డు పరిధిలోని 87వ పోలింగ్‌ స్టేషన్‌లో రీపోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 73.63 శాతం పోలింగ్‌ నమోదైంది. బుధవారం 32వ వార్డులోని మూడు పోలింగ్‌ స్టేషన్లలో ఒకటైన 87వ పోలింగ్‌బూత్‌లో టెండరు ఓటు నమోదు కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆ పోలింగ్‌ను రద్దుచేసి తిరిగి శుక్రవారం నిర్వహించాలని ఆదేశించింది.  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 87వ పోలింగ్‌ స్టేషన్‌లో రీపోలింగ్‌ నిర్వహించారు.  టెండరు ఓటు వేసిన మహిళ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. రీపోలింగ్‌ను కలెక్టర్‌ నారాయణరెడ్డి, జేసీ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.    
- బోధన్‌, నమస్తే తెలంగాణ

బోధన్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు శుక్రవారం బోధన్‌ పట్టణంలోని 32వ వార్డు పరిధిలోని 87వ పోలింగ్‌ స్టేషన్‌లో రీపోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. రీపోలింగ్‌లో 73.63 శాతం పోలింగ్‌ నమోదయింది. ఈ పోలింగ్‌ స్టేషన్‌లో మొత్తం 588 మంది ఓటర్లు ఉండగా, రీపోలింగ్‌లో 433 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో 208 మంది పురుషులు కాగా, 225 మంది మహిళా ఓటర్లున్నారు. బుధవారం బోధన్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 32వ వార్డులోని మూడు పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్‌ నమోదయింది. ఈ మూడు పోలింగ్‌ స్టేషన్లలో ఒకటైన 87వ పోలింగ్‌బూత్‌లో టెండరు ఓటు నమోదు కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ పోలింగ్‌ను రద్దుచేసి తిరిగి శుక్రవారం పోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. బుధవారం ఈ పోలింగ్‌బూత్‌లో జరిగిన పోలింగ్‌లో నసేహా సుల్తానా అనే పేరుతో వచ్చిన మహిళా ఓటరు స్లిప్‌ చూపించి ఓటువేయడానికి రాగా, పోలింగ్‌ ఏజెంట్లు ఎవరూ అభ్యంతరం తెలపలేదు. దీంతో ఓటరు స్లిప్‌ ఆధారంగా ఓటు వేయడానికి ఎన్నికల సిబ్బంది అనుమతించారు.

ఆ తర్వాత అదే పేరుతో మరో మహిళ వచ్చి ఓటింగ్‌ కోసం అన్ని ఆధారాలు చూపించడంతో సంబంధిత ప్రిసైడింగ్‌ అధికారి ఆమెను టెండరు ఓటు వేయడానికి అనుమతించారు. ఈ నివేదికను ఎన్నికల కమిషన్‌కు పంపగా, బోగస్‌ ఓటు పడిన విషయాన్ని నిర్ధారించుకొని ఆ పోలింగ్‌ను రద్దుచేసింది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్‌ స్టేషన్‌లో రీపోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేంకటేశ్వర్లు, బోధన్‌ ఏసీపీ జయపాల్‌రెడ్డి, మున్సిపల్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న ఎ.స్వామినాయక్‌ పర్యవేక్షించారు. రీపోలింగ్‌ అనంతరం సీజ్‌చేసిన బ్యాలెట్‌ బాక్స్‌ను, ఎన్నికల సామగ్రిని ప్రిసైడింగ్‌ అధికారి శ్రీనివాస్‌రావు, రెవెన్యూ అధికారుల సమక్షంలో కౌంటింగ్‌ కేంద్రానికి తరలించారు.

ఓటేయడానికి రాని టెండర్‌ ఓటరు..

టెండర్‌ ఓటు వేసి రీపోలింగ్‌కు కారణమైన నసేహా సుల్లానా అనే మహిళా ఓటరు రీపోలింగ్‌కు రాకపోవడం గమనార్హం. ఈ విషయమై అధికారులు, వార్డు ప్రజల్లోనూ చర్చ జరుగుతున్నది. మొదట బుధవారం జరిగిన పోలింగ్‌లో 87వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో 74.15 శాతం పోలింగ్‌ నమోదయింది. రీపోలింగ్‌లో మూడు ఓట్లు తక్కువగా పడ్డాయి. మొదటి పోలింగ్‌లో మహిళలు 228 మంది ఓట్లేయగా, రీపోలింగ్‌లో 225 మంది ఓట్లేశారు. కాగా, పురుషులు మాత్రం మొదటి పోలింగ్‌లోనూ, రీపోలింగ్‌నూ సమాన సంఖ్యలో.. అంటే 208 మంది చొప్పున తమ ఓట్లు వేయడం విశేషం. రీపోలింగ్‌లో స్థానికంగా ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తలేదు. అంతకుముందటి పోలింగ్‌లో ఈ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి ఇలియాస్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇమ్రాన్‌పై దాడిచేసి ముక్కు కొరికిన సంఘటన తెలిసిందే. అయినప్పటికీ, శుక్రవారం రీపోలింగ్‌ సందర్భంగా ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

సందర్శించిన కలెక్టర్‌..

రీపోలింగ్‌ జరుగుతున్న 87 పోలింగ్‌బూత్‌ను కలెక్టర్‌ నారాయణరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. రీపోలింగ్‌ సందర్భంగా జరిగిన ఏర్పాట్లపై జాయింట్‌ కలెక్టర్‌ వేంకటేశ్వర్లు, ఇతర ఎన్నికల అధికారులతో చర్చించారు.logo