శనివారం 06 జూన్ 2020
Nizamabad - Jan 25, 2020 , 01:30:48

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు..

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు..బోధన్‌, నమస్తే తెలంగాణ: బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్‌ కార్పొరేషన్‌కు శనివారం జరిగే మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం బోధన్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రా న్ని ఆయన సందర్శించారు. కౌంటింగ్‌ కోసం జరుగుతున్న ఏర్పాట్లపై జాయింట్‌ కలెక్టర్‌ వేంకటేశ్వర్లు, ము న్సిపల్‌ ఎన్నికల అధికారి స్వామినాయక్‌, బోధన్‌ ఏసీపీ జయపాల్‌రెడ్డి తదితరులతో చర్చించి సూచనలు ఇచ్చా రు. అనంతరం మీడియాను ఉద్ధేశించి మాట్లాడుతూ.. శనివారం నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు కచ్చితంగా ప్రారంభమవుతుందన్నారు. ఆయా వార్డుల అభ్యర్థులు, వారి తరఫున కౌంటింగ్‌ ఏజెంట్లు కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చేందుకు సంబంధిత మున్సిపల్‌ ఎన్నికల అధికారుల నుంచి గుర్తింపు కార్డులు విధిగా తీసుకోవాలన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతున్నందున కౌంటింగ్‌ ఏజెంట్లు ఉదయం 6.30 నుంచి 7 గంటల లోపు కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ సిబ్బందికి రెండుసార్లు తగిన శిక్షణ ఇచ్చామని, ఓట్ల లెక్కింపులో ఎటువంటి పొరపాట్లు జరగకుండా పూర్తిచేస్తామన్నారు.

జిల్లాలోని మొత్తం 146 వార్డులకు ఓట్ల లెక్కింపు ఏకకాలంలో జరుగుతుందన్నారు. ఒక్కో డివిజన్‌ లేదా ఒక్కో వార్డుకు ఒక టేబుల్‌ను ఏర్పాటుచేశామని, ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఈ లెక్కన బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటీల్లో లెక్కింపు రెండు రౌండ్లలో జరుగుతుందన్నారు. ఈ మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 2 గంటలకల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశముందన్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో పోలైన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ ఫలితాలు 3 నుంచి 5 గంటల మధ్య వచ్చే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియను మైక్రో ఆబ్జర్వర్‌ పర్యవేక్షిస్తారని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ యావత్తు వీడియో తీస్తామని చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు ఉంటాయని, ఎవరినీ అనుమతింబోరని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లకు అనుమతిలేదని, ఈ విషయాన్ని అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు గమనించాలని కలెక్టర్‌ కోరారు. ఓట్ల లెక్కింపులో 526 మంది సిబ్బంది పాల్గొంటారని, వీరేగాకుండా సహాయంగా ఉండేందుకు మరో 500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

27న మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నికలు..

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు ఈ నెల 27న జరుగుతాయని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల కోసం ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించామన్నారు. ఈ ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో 27న ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశాలు జరుగుతాయన్నారు. మొద ట ఎన్నికయిన కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం ఉంటుంద ని, ఆ తర్వాత 12.30 గంటలకు మున్సిపాలిటీల్లో చైర్మ న్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు, కార్పొరేషన్‌లోనైతే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు జరుగుతాయన్నారు.

గణతంత్ర వేడుకలు ఘనంగా ఉండాలి

ఇందూరు: గణతంత్ర వేడుకలను ఆకట్టుకునే విధంగా ఘనంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సంబంధిత అధికారులతో మాట్లాడారు. 26న గణతంత్ర వేడుకలు గతంలో లాగే ఆకట్టుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నా రు.  శకటాల ప్రదర్శన ఎంపిక చేయబడిన శాఖల ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. ప్రోటోకాల్‌ పాటించాలన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుం డా అన్ని ఏర్పాటు చూసుకోవాలన్నారు. 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు చేసుకొని నిర్వహించాలన్నారు.

బోధన్‌ రీపోలింగ్‌పై విచారణ..

బోధన్‌ పట్టణం 32వ వార్డులోని 87వ పోలింగ్‌ స్టేషన్‌లో టెండర్‌ ఓటు నమోదుతో రీపోలింగ్‌కు దారితీసిన ఘటనపై సమగ్రంగా విచారణ జరుపుతున్నామని కలెక్టర్‌ నారాయణరెడ్డి వెల్లడించారు. ఈ రీపోలింగ్‌లో బోగస్‌ ఓటువేసిన వ్యక్తిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకొనే ప్రయత్నం జరుగుతోందన్నారు. పోలింగ్‌బూత్‌లో రీపోలింగ్‌కు కారణమైన పోలింగ్‌ సిబ్బందికి మెమోలు జారీచేశామని తెలిపారు.logo