గురువారం 04 జూన్ 2020
Nizamabad - Jan 24, 2020 , 02:01:29

రెండు చోట్ల నేడు రీపోలింగ్‌

రెండు చోట్ల నేడు రీపోలింగ్‌
  • - బోధన్‌ 32వ వార్డు, కామారెడ్డి 41వ వార్డులోని ఒక్కో బూత్‌లో..
  • - టెండరు ఓటు దాఖలు కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం
  • - ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5వరకు పోలింగ్‌
  • - ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌లో బోధన్‌ బల్దియాలోని 32వ వార్డు 87వ పోలింగ్‌ స్టేషన్‌లో, కామారెడ్డి బల్దియాలోని 41వ వార్డు 101 పోలింగ్‌ బూత్‌లో టెండర్‌ ఓటు పడింది. దీంతో ఈ వార్డు పరిధిలోని పైన తెలిపిన పోలింగ్‌ బూత్‌ల్లో శుక్రవారం రీపోలింగ్‌ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అధికారులు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరగనుంది. వీటికి సంబంధించి ఓట్ల లెక్కింపు కూడా శనివారం యథావిధిగా కొనసాగనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు యంత్రాంగం చర్యలు చేపట్టింది.
-బోధన్‌, నమస్తే తెలంగాణ

బోధన్‌, నమస్తే తెలంగాణ : బోధన్‌ మున్సిపల్‌ పరిధిలోని 32వ వార్డులో ఒక పోలింగ్‌ బూత్‌కు రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి అశోక్‌కుమార్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. బుధవారం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌లో 32వ వార్డులోని 87వ పోలింగ్‌ స్టేషన్‌లో టెండర్‌ ఓటు నమోదవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆ పోలింగ్‌ స్టేషన్‌లో రీపోలింగ్‌ నిర్వహించాలని గురువారం మధ్యాహ్నం నిర్ణయించింది. 24న శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పట్టణంలోని 87 పోలింగ్‌ స్టేషన్‌లో ఈ రీపోలింగ్‌ జరుగుతుంది. బుధవారం 87వ పోలింగ్‌ స్టేషన్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో నసేహా సుల్తానా అనే పేరుతో ఒక మహిళ ఈ పోలింగ్‌బూత్‌కు వచ్చి ఓటరు స్లిప్‌ చూపించి ఓటు వేయటానికి రాగా, పోలింగ్‌ ఏజెంట్లు ఎవరూ అభ్యంతరం తెలపలేదు. దీంతో ఆమె తెచ్చిన ఓటరు స్లిప్‌ ఆధారంగా ఎన్నికల సిబ్బందికి ఓటింగ్‌కు అనుమతించగా.. ఆమె ఓటు వేసి వెళ్లిపోయారు.

ఆ తర్వాత మధ్యాహ్నం నసేహా సుల్తానా అనే మరో మహిళ ఓటింగ్‌ కోసం వచ్చారు. తనే నసేహా సుల్తానా అంటూ అన్ని ఆధారాలు చూపడంతో సంబంధిత ప్రిసైడింగ్‌ అధికారి ఆమె కూడా ఓటు వేయడానికి.. అంటే టెండరు ఓటు వేయడానికి అనుమతిచ్చారు. 87వ పోలింగ్‌ స్టేషన్‌లో టెండరు ఓటు దాఖలు కావడంతో జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్ని వివరాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు  నివేదించారు. దీని ఆధారంగా మున్సిపాలిటీలోని 32వ వార్డులో నిర్వహించిన పోలింగ్‌ను రద్దుచేస్తూ, తిరిగి శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. ఈ రీపోలింగ్‌ సందర్భంగా ఓటువేసిన ఓటర్లకు చేతి మధ్యవేలుకు సిరా గుర్తు వేయాల్సిందిగా ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

గ్రామ చావిడిలో 87వ పోలింగ్‌ స్టేషన్‌..

బోధన్‌ పట్టణంలోని గ్రామ చావిడిలోనే 32వ వార్డుకు సంబంధించి మూడు పోలింగ్‌ బూత్‌లు 86, 87, 88 ఏ ర్పాటుచేశారు. వీటిలోని 87వ పోలింగ్‌బూత్‌లో టెండరు ఓటు దాఖలు కావడంతో అక్కడ శుక్రవారం రీపోలింగ్‌ జరగనుంది. రీపోలింగ్‌ కోసం మున్సిపల్‌ ఎన్నికల యంత్రాం గం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ పోలింగ్‌బూత్‌లో మొత్తం 588 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లు శుక్రవారం రీపోలింగ్‌లో ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది.

కామారెడ్డిలోని 41 వార్డులో...

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ / కామారెడ్డి, నమస్తే తెలంగాణ : కామారెడ్డి మున్సిపాలిటీలోని పంచముఖి హనుమాన్‌ కాలనీ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 41 వార్డులోని 101 పోలింగ్‌ బూతులో టెండర్‌ ఓటు పడింది. టెండర్‌ ఓటుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం రీపోలింగ్‌పై ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులంతా 41 వార్డులోని టెండర్‌ ఓటు చోటు చేసుకున్న 101 పోలింగ్‌ బూత్‌లో రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. 41 వార్డులో 101, 102 పోలింగ్‌ బూత్‌లున్నాయి. ఇందులో మొత్తం 1742 ఓట్లున్నాయి. రీపోలింగ్‌ జరుగుతున్న పోలింగ్‌ బూత్‌లలో 580 ఓట్లుండగా బుధవారం జరిగిన ఎన్నికల్లో 378 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 199 మహిళా ఓటర్లు, 179 పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేడు జరిగే రీపోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. యథావిధిగా ఉదయం ఏడు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు. బుధవారం ఓటు వేసిన పౌరులందరికీ ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా చుక్కను వేశారు. శుక్రవారం ఓటు వేసే ఓటర్లకు ఎడమ చేతి మధ్య వేలికి సిరా చుక్కను పెట్టనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. పోలింగ్‌ జరిగే ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. రీపోలింగ్‌ నిర్వహిస్తున్న పోలింగ్‌ బూత్‌లోని ఓట్లను రేపే అన్ని వార్డులతో కలిపే లెక్కిస్తారు.logo