బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Jan 24, 2020 , 02:01:29

మన ఊరు.. మన నర్సరీ

మన ఊరు.. మన నర్సరీ
  • - గ్రామానికో నర్సరీ ఏర్పాటు
  • - స్థల సేకరణ పూర్తి
  • - జోరుగా సాగుతున్న పనులు
  • - ఈజీఎస్‌ ఆధ్వర్యంలో 530 నర్సరీల ఏర్పాటు

మోర్తాడ్‌ : పర్యావరణ పరిరక్షణ, పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా, మరిన్ని ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఈజీఎస్‌) ఆధ్వర్యంలో గ్రామానికి ఒక నర్సరీని ఏర్పాటు చేసేందుకు  చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో ఉపాధిహామీ ఆధ్వర్యంలో 530 నర్సరీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న నర్సరీల ద్వారా ఏడాది పాటు స్థానిక ప్రజలకు కావాల్సిన మొక్కలను అందిస్తారు.

జిల్లాలో 530 నర్సరీల ఏర్పాటు...

జిల్లాలో 530 గ్రామాల్లో గ్రామానికి ఒక నర్సరీ ఏర్పాటు పనులు చురుగ్గా  కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్థలం ఉండి నీటి సౌకర్యం ఉన్న చోట నర్సరీల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రభుత్వ స్థలం, నీటి సౌకర్యం లేనిచోట ప్రైవేటు స్థలాల్లో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది వరకు ఉపాధిహామీ ఆధ్వర్యంలో 400 నర్సరీలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 256 నర్సరీలను ఏర్పాటు చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణ వారికి భారంగా మారడం, వారి నర్సరీల్లో పెంచిన మొక్కలు ఎక్కువగా తీసుకెళ్లక పోవడం, మెయింటనెన్స్‌ కాకపోవడం తదితర కారణాలతో అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న నర్సరీలు అన్నింటినీ అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపాధిహామీకి అప్పగించారు. ప్రస్తుతం ఉపాధిహామీ ఆధ్వర్యంలోనే గ్రామానికి ఒక నర్సరీ ఏర్పాటు జరుగుతోంది.

ప్రజల అభీష్టం మేరకే మొక్కల పెంపకం...

హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం, గ్రామానికి లక్ష్యాన్ని నిర్దేశించడం, వాటిని సంరక్షించాలని చెప్పడం కొన్నేండ్లుగా కొనసాగుతోంది. ఎన్ని మొక్కలు నాటినా.. వాటిని సంరక్షించే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫలితం పెద్దమొత్తంలో కనిపించని పరిస్థితి ఉంది. కొన్నిచోట్ల మొక్కలను తొలగించే పరిస్థితులు ఉన్నాయి. జరిమానాలు విధించినా మొక్కల తొలగింపు ఘటనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పల్లెప్రగతి-1 కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఏ మొక్కలు నాటుకోవడానికి ఇష్టపడుతున్నారు అనే అంశంపై సర్వే చేయించింది. ప్రతి గ్రామంలో ఈ సర్వే కొనసాగింది. ప్రజలు ఏ మొక్కలైతే నాటాలనుకుంటున్నారో అవే మొక్కలను ప్రస్తుతం ఏర్పాటు చేసే నర్సరీలో పెంచనున్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం గ్రామంలో సర్వే నిర్వహించడం, వారు కోరిన మొక్కలను పెంచాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ప్రజలు ఇష్టపడి మొక్క నాటుకుంటే, దానిని ఇష్టపడే సంరక్షించుకుంటారు. తద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం కావడంతో పాటు ఫలితాలు కనబడతాయి.

118.64 లక్షల మొక్కలు...

జిల్లావ్యాప్తంగా వచ్చే హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా నాటిన మొక్కలను సంరక్షించుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసే 530 నర్సరీల్లో 27.37 లక్షల మొక్కలను పెంచనున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన హరితహారం కార్యక్రమాల్లో 36.41 లక్షల మిగిలిన మొక్కలను వినియోగించనున్నారు. అదే విధంగా చిన్నబ్యాగుల నుంచి పెద్దబ్యాగుల్లోకి మార్చాల్సిన మొక్కలు 54.86 లక్షలు ఉన్నాయి. ఇవన్ని కలిపి జిల్లా టార్గెట్‌ 118.64 లక్షలుగా నిర్ణయించారు. గత హరితహారం కార్యక్రమాల్లో గ్రామానికి 40వేల మొక్కలు నాటాలన్న టార్గెట్‌ ఉండేది. దీంతో జిల్లాకు దాదాపు 4కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకునేవారు. టార్గెట్‌ మేరకు మొక్కలు నాటినా.. సంరక్షణ విషయంలో ఇబ్బందులు ఏర్పడి నాటిన మొక్కలన్నీ బతికేవి కాదు. ప్రస్తుతం నాటిన మొక్కలను కచ్చితంగా సంరక్షించేలా చర్యలు తీసుకోనున్నారు.

గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేస్తున్నాం..

అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న నర్సరీలను ఉపాధిహామీకి అప్పగించారు. ప్రస్తుతం ఉపాధిహామీ ఆధ్వర్యంలోనే గ్రామానికో నర్సరీని ఏర్పాటు చేస్తున్నాం. పల్లెప్రగతి సమయంలో ప్రజలు ఏ మొక్కలు నాటాలనుకుంటున్నారో సర్వే నిర్వహించాం. ఆ సర్వే ప్రకారం ఆ గ్రామంలో అవే మొక్కలు పెంచే విధంగా చూస్తున్నాం. ఏడాది కాలంగా ప్రజలకు మొక్కలు అందుబాటులో ఉండే విధంగా చూస్తాం.
-నర్సయ్య, ఏపీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు  


logo