గురువారం 28 మే 2020
Nizamabad - Jan 23, 2020 , 03:42:52

పోలింగ్ ప్రశాంతం

పోలింగ్ ప్రశాంతం


నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలో చెదురు మదురు ఘటనలు మినహా బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బ్యాలెట్ పత్రాలతో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియ పూర్తిగా సజావుగా సాగింది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం సమయానికి 50శాతానికి పైబడి ఓటింగ్ పూర్తయింది. సాయంత్రం వరకు తమ ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకున్నారు. పోలీసులు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. బీజేపీ పలుచోట్ల అల్లర్లకు తెరలేపింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమనిగింది. 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో ఎంపీ అర్వింద్, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. ఒక దశలో అర్వింద్ సహనం కోల్పోయి పోలీసులపై ఇష్టానుసారంగా మాట్లాడారు.

స్థాయికి తగిన వ్యాఖ్యలు చేయలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. జిల్లామొత్తంగా 64.40 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా ఆర్మూర్ బల్దియాలో 72.40 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా నిజామాబాద్ అర్బన్ 61.12 శాతం నమోదైంది. ఈసారి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్ శాతం పెరుగుతుందని అంతా భావించారు. అయితే షరా మామూలుగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అత్యల్పంగానే పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే మహిళలు పలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. కలెక్టర్ సి. నారాయణరెడ్డి, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సీపీ కార్తికేయ శర్మ పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ప్రచారం గడువు ముగిసినా.. సోషల్ మీడియాలో బీజేపీ శ్రేణులు అభ్యంతరకర, మతపరమైన ప్రచారాలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో కొంత మంది ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు.

దీంతో నేరుగా ఎన్నికల కమిషన్ అర్వింద్ ఫేస్ వాల్ ఉన్న అభ్యంతరకర పోస్టులు తీసివేయాలని హెచ్చరించింది. కేసులు నమోదు చేస్తామని తెలిపింది. దీంతో అర్వింద్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోస్టులు తొలగించినట్లు తొలగించి మళ్లీ అదే పోస్టులను పెట్టారు. ఇది చర్చనీయాంశమైంది. జిల్లాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాటు బోధన్, ఆర్మూరు, భీమ్ మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్మూర్, బోధన్, అర్బన్ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ మహ్మద్ షకీల్, బిగాల గణేశ్ గుప్తా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీలు డీ రాజేశ్వర్ వీజీగౌడ్, నుడా చైర్మన్ ప్రభాకర్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి, జేసీ వెంకటేశ్వర్లు తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.logo