సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Jan 21, 2020 , 02:32:16

అభివృద్ధి కావాలంటే.. టీఆర్‌ఎస్‌కు ఓటెయ్యాలి

అభివృద్ధి కావాలంటే.. టీఆర్‌ఎస్‌కు ఓటెయ్యాలి
  • -కాంగ్రెస్‌, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం
  • -మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం
  • -ఇందూరు మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దే
  • -హైదరాబాద్‌లోనే మేయర్‌ పదవిని ఎంఐఎంకు ఇవ్వలేదు.. నిజామాబాద్‌లో ఎలా ఇస్తాం?
  • -అసత్య ప్రచారం,రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం అర్వింద్‌కు తగవు
  • -రాష్ట్రవాటాగా వచ్చే నిధులే తప్ప కేంద్రం పైసా ఎక్కువ ఇవ్వట్లేదు
  • -ఏప్రిల్‌ నుంచి కొత్త పింఛన్లు ,అర్హులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు
  • -నిజామాబాద్‌,బోధన్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: అభివృద్ధి కావాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేయాలని, అశాంతి కావాలంటే ఎంఐఎం, బీజేపీలకు ఓటేయాలని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. 22న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో ని ఓటర్లు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్‌ నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పాత నిజామాబాద్‌ జిల్లాలోని నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూ ర్‌, బోధన్‌, భీమ్‌గల్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలకు సంబంధించిన ఓటర్లు జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆలోచించి ఓ టేయాలని కోరారు. రెచ్చగొట్టే మాటలు, మాయమాటలు విని మోసపోవద్దన్నారు. సీఎం కేసీఆర్‌ నే తృత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అనేక సంక్షేమ పథకాలతో ఎంతోమందికి లబ్ధి చేకూరుతుందన్నారు. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో ఉభయ జిల్లాలోని మున్సిపాలిటీలకు వందల కోట్ల రూపాయాలు మంజూరు చేసుకొని పనులు జరుగుతున్నట్లు తెలిపారు. భీమ్‌గల్‌ మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఆర్మూర్‌కు రూ. 50 కోట్లు, కామారెడ్డికి రూ. 60 కోట్లు, బోధన్‌కి రూ. 50 కోట్లు, ఎల్లారెడ్డికి రూ. 15 కోట్లు, బాన్సువాడ మున్సిపాలిటీకి రూ. 30 కోట్లు నిధులు మంజూరు చేశామని, ఇది వరకే కొన్ని పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులు వేగిరంగా కొనసాగుతున్నాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మంత్రి ఆరోపించారు. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే వారి మాటలను నమ్మొద్దని ఓటర్లకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఎంపీ అబద్ధాలతో మభ్యపెడుతున్నాడు : అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ అసత్యపు ఆరోపణలు, అబద్ధాల మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నాని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా విమిర్శంచారు. ఇంతకు ముందు బీజేపీలో ఎమ్మెల్యేగా ఉన్న యెండల లక్ష్మీనారాయణ కేంద్రంలో వారి ప్రభుత్వం లేనందున, అభివృద్ధి చేయలేకపోయారన్నారు. కానీ, ప్రజల మధ్య ఆయన ఎలాంటి చిచ్చు పెట్టలేదన్నారు. ఒకప్పుడు బీజేపీ నాయకులు నగరంలో ప్రజలతో మమేకమై ఉండేవారని, చీమలు కట్టిన పుట్టలో పాములు దూరి ఈ రోజు నగర ప్రజలపై విషయం చీమ్ముతూ ఎంపీ అర్వింద్‌ మోదీ ఇంట్లో పుట్టినట్లు, పెంపకంలో పెరిగినట్లు గతంలో ఇతర పార్టీలు లేనట్టు, బీజేపీలోనే ఉంటున్నట్టు, కాషాయం తప్ప మరి ఏ జెండా తాను వేసుకొని విధంగా ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.  2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంఐఎం రెండు ఏకమై మేయర్‌ పదవి టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుందన్నారు. ఈసారి ఎంఐఎంకి మేయర్‌ పదవి ఇవ్వడం జరుగుతుందనే భ్రమలో ఉండి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచిన తర్వాత మేయర్‌ పదవిని టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని నియమిస్తుందని, ఒకవేళ మేయర్‌ ఎంఐఎం పార్టీ అభ్యర్థిని టీఆర్‌ఎస్‌ ప్రకటిస్తే ఎమ్మెల్యేగా తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. అలా జరగలేదు అంటే రాజీనామాకు రెడీగా ఉన్నారా అని అర్వింద్‌కు ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా సవాల్‌ విసిరారు. 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మేయర్‌గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఎన్నుకుని మరింత అభివృద్ధిని సాధించి నగర ప్రజలు సుఖ సంతోషాలతో శాంతియుతంగా ఉండాలని ఆయన కోరారు. సమావేశంలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తుల ఉమ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, రెడ్‌కో చైర్మన్‌ ఎస్‌ఏ అలీం, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, సత్యప్రకాశ్‌, సుజిత్‌సింగ్‌ ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు.


‘పొత్తు లేకుండానే పోటీ చేస్తున్నాం’...

నిజామాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల్లో ఎవరితోనూ టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకోలేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని 60 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, ఎంఐఎం స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ గెలవబోతున్నదని తెలిపారు. బలమైన అభ్యర్థులతో పోటీ చేయిస్తున్నామని, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులకు ఏం చేయాలో అర్థంకాక   అబద్దాలు ఆడుతున్నారని మంత్రి విమర్శించారు. హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా టీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లను గెలిపించుకున్నామని, ఎంఐఎంకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. నిజామాబాద్‌ మేయర్‌ పదవిని ఎందుకు వదలిపెడతామని, ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాద్‌ ప్రజల ఆశీర్వదంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థే నిజామాబాద్‌ మేయర్‌ పీఠంపై కూర్చుంటారని మంత్రి ఘంటాపథంగా చెప్పారు. బీజేపీ వాళ్లు చేయించిన సర్వేలో టీఆర్‌ఎస్‌ 48 స్థానాలను గెలుచుకుంటుందని తేలిందని, దీంతో వాళ్లకు భయం పట్టుకుందని మంత్రి విమర్శించారు. అందుకే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని, ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపు వెళ్లకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
అబద్ధపు ప్రచారాలు చేసే వారిని నమ్మవద్దని అభివృద్ధిని, పేదల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను చూసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మంత్రి కోరారు. నిజామాబాద్‌ నగరంలో రూ. 246 కోట్లతో యూజీడీ పనులు అర్బన్‌ ఎమ్మెల్యే, అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో పూర్తి చేశారని తెలిపారు. వందల కోట్ల నిధులతో రోడ్లు, సెంట్రల్‌ మీడియం తదితర పనులన్నీ ప్రజల కళ్ల ముందే జరిగాయన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. అన్ని మున్సిపాలిటీల్లో ఆ బీజేపీ, కాంగ్రెస్‌ లోపాయికారీ పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో పోటీచేస్తున్నాయని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు.logo