శనివారం 30 మే 2020
Nizamabad - Jan 21, 2020 , 02:31:13

పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు

పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
  • -ఓటర్లు స్వేచ్ఛగా ఓటేయాలి
  • -నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
  • -మొత్తం 621 పోలింగ్‌కేంద్రాల ఏర్పాటు
  • -మీడియాతో కలెక్టర్‌ నారాయణరెడ్డి

ఇందూరు: ఈనెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూలు విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు అన్ని ముందస్తు చర్యలతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ రెండు రోజులకు మరింత పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు జరగడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మరో పది ఎంసీసీ టీమ్‌లు ఏర్పాటు చేశామని, వచ్చే 48 గంటల్లో నిబంధనలు అతిక్రమణ జరగకుండా గట్టి పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. సోమవారం సాయంత్రం 5గంటల నుంచి మున్సిపాలిటీల పరిధిలో మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఆదేశించామన్నారు. ఇప్పటికే అనుమానితుల నుంచి రూ. 5.27 లక్షలు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేసినట్లు తెలిపారు. నిబంధనల అతిక్రమణకు పాల్పడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులు గమనించాలని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలని కోరారు. అసెంబ్లీ, మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ స్టేషన్లు వేర్వేరుగా ఉన్నందున, ఓటర్ల సౌకర్యార్థం ఓటర్‌ స్లిప్‌ పంపిణీ చేశామని, దాని ఆధారంగా ఓటర్లు సులభంగా ఓటు వేయవచ్చని తెలిపారు.

ఓటర్‌ గుర్తింపు కార్డు లేదా మరో 18 ఇతర గుర్తింపు కార్డులు ఏదైనా చూపించి, ఓటర్ల జాబితాలో పేరు ఉంటే ఓటు వేయవచ్చని సూచించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటువేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ తెలిపారు. ఎవరైనా తమది కాకుండా దొంగ ఓటు వేయడానికి ప్రయత్నిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలింగ్‌ కేంద్రాల్లో పకడ్బందీగా తనిఖీ చేయడానికి మహిళా అధికారులను కూడా నియమించామని తెలిపారు. కేంద్రాల్లో ఓటర్లకు కనీస సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హెల్ప్‌డెస్క్‌లు  ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


మొత్తం 621 పోలింగ్‌ కేంద్రాలు...

జిల్లాలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీల్లో 146 వార్డులు, 621 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. మొత్తం 4,36,887 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందుకు గాను 5.26 లక్షల బ్యాలెట్‌ పేపర్లు ముద్రించామని, 14వేల పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు ఉద్యోగులకు పంపిస్తామన్నారు. 5 సమస్యాత్మక, 126 అతి సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు, 162 సెన్సిటీవ్‌ పోలింగ్‌ స్టేషన్లు, 328 నార్మల్‌ పోలింగ్‌ స్టేషన్లు గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 205 పోలింగ్‌ స్టేషన్‌ లొకేషన్‌లలో.. 621 పోలింగ్‌ స్టేషన్లకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. 100 పోలింగ్‌ స్టేషన్‌ లొకేషన్లలో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 735 మంది చొప్పున ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, 2,205 మంది ఇతర పోలింగ్‌ సిబ్బందిని, 107 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. 779 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని వివరించారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమావేశంలో శిక్షణ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌, డీఆర్వో అంజయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌ తదితరులు పాల్గొన్నారు.
logo