బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Jan 21, 2020 , 02:29:46

ప్రాణాలు మింగిన కుంట

ప్రాణాలు మింగిన కుంట
  • -పేపర్‌మిల్‌ గ్రామ శివారులో కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృత్యువాత
  • -మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు
  • -ఆదివారం గల్లంతు.. సోమవారం మృతదేహాల వెలికితీత

 రెంజల్‌ : రేగు పండ్లు తేవడానికి గ్రామ శివారుకు వెళ్లిన ఆ చిన్నారులను కుంట రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదవశాత్తు కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డ ఘటన రెంజల్‌ మండలం పేపర్‌మిల్‌ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పేపర్‌మిల్‌ గ్రామానికి చెందిన వాగ్మారే గౌతమ్‌, మీనా దంపతులకు దీపక్‌, సిద్ధార్థ్‌, ఆదిత్య ముగ్గురు సంతానం. జలాలుద్దీన్‌, వసీమాబేగం దంపతులకు అఖిఫొద్దీన్‌, సాకిఫొద్దీన్‌ , ఉజాపొద్దీన్‌ , జీషారొద్దీన్‌ సంతానం. వీరంతా పేపర్‌మిల్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తెలుగు మీడియంలో విద్యనభ్యసిస్తున్నారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో రేగు పండ్లు తెంపుకోవడానికి దీపక్‌ (9), సిద్ధార్థ్‌(8)  ఉజాపొద్దీన్‌ (7) కలిసి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి కందకుర్తి వైపు బైక్‌ టైరుతో ఆడుకుంటూ బయలుదేరి వెళ్లారు. సాయంత్రమైనా వారు ఇంటికి తిరిగిరాక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారి గురించి చుట్టుపక్కల పొలాల్లో వెతికినా జాడ తెలియరాలేదు. దీంతో రాత్రి రెంజల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెంజల్‌ పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం వారు వెళ్లిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రేగు పండ్లను తీసుకువచ్చేందుకు ఇంటి నుంచి వెళ్లిన సమయంలో బాలురు ద్విచక్ర వాహనం పాత టైర్‌ను అడుకుంటూ వెళ్లారని పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. దీంతో కందకుర్తి సమీపంలో ఓరైతుకు చెందిన నీటి కుంట వద్దకు రెంజల్‌ ఎస్సై శంకర్‌ తన సిబ్బంది కలిసి వెళ్లి అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు.విద్యార్థులను వెతికే క్రమంలో పాత టైరు ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కుంటలో వారికి కనిపించింది. దీంతో పోలీసులు ఫోన్‌లో ఆ టైరు చిత్రాన్ని తీసి పిల్లల తల్లిదండ్రులకు పంపగా.. ఆ టైరు తమ పిల్లలే తీసుకెళ్లిందే అని వారు నిర్ధారించారు. దీంతో పోలీసులు సోమవారం కుంటలో నీలా గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మూడు గంటలు శ్రమించి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. దీంతో పేపర్‌మిల్‌ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మృతదేహాలకు పంచనామా నిర్వహించి, శవ పరీక్ష నిమిత్తం బోధన్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుల్లో దీపక్‌ (9), సిద్ధార్థ్‌(8) అన్నదమ్ములు. వారి తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం కాగా.. ఈ ఘటనలో ఇద్దరు కుమారులు మృతిచెందడంతో ఆ కుటుంబంలో పుట్టెడు దుఃఖం అలుముకుంది. ముగ్గురు విద్యార్థుల మృతి బాధాకరమని డీఈవో జనార్దన్‌రావు సంతాపం ప్రకటించారు. సోమవారం పాఠశాలలో మౌనం పాటించి సెలవు ప్రకటించినట్లు ఎంఈవో గణేశ్‌రావు తెలిపారు.logo