శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Jan 20, 2020 , 03:26:48

మరోసారి మానవత్వాన్ని చాటిన మంత్రి కేటీఆర్‌

 మరోసారి మానవత్వాన్ని చాటిన మంత్రి కేటీఆర్‌
  • -బ్లడ్‌ క్యాన్సర్‌ బాలుడి చికిత్సకు భరోసా
  • -వారం క్రితం కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చిన్నారికి సైతం వైద్యం చేయించిన మంత్రి
  • -కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబాలు
  • -ఇద్దరు చిన్నారుల వైద్యానికి ఆర్థిక సహాయం అందజేస్తామని భరోసా
  • - నందిపేట మండల వాసుల ట్విట్టర్‌కు స్పందించిన మంత్రి
  • - కృతజ్ఞతలు తెలుపుతున్న బాధితులు
నందిపేట్‌ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మరోమారు మానవత్వాన్ని చాటారు. అనారోగ్యం పాలైన ఇద్దరు చిన్నపిల్లల చికిత్సకు అండగా నిలుస్తున్నారు.
ట్విట్టర్‌లో యువకులు చేసిన పోస్ట్‌కు వెంటనే స్పందించారు. ఇద్దరు పిల్లల కుటుంబీలకు మంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకొని, చికిత్సకు సంబంధించిన దవాఖాన రిపోర్టులు, బిల్లులు తెప్పించుకొని సహాయం అందిస్తున్నారు. వారం రోజుల క్రితం నందిపేట్‌కు చెందిన దర్శనం అవంతిక కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురికాగా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు పాప వివరాలను యువకులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. వెంటనే స్పందించి చికిత్సకు ఏర్పాట్లు చేశారు.

ఇప్పుడు లక్కంపల్లి గ్రామానికి చెందిన నవనూర్‌ గంగసాయిలు - గోదావరి దంపతుల కుమారుడు నితిన్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో హైదరాబాద్‌లోని రెయిన్‌బో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు చికిత్సకు రూ. 20 లక్షలకు పైగా డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో వారి ఆర్థిక పరిస్థితిని, బాబు ఆరోగ్యంపై నందిపేట్‌కు చెందిన టీఆర్‌ఎస్‌వీ నాయకుడు వినయ్‌ తనకు పరిచయం ఉన్న భార్గవ్‌ కుమార్‌తో ట్విట్టర్‌లో వివరాలను మెసేజ్‌ చేశాడు. మెసేజ్‌ పంపిన కొద్ది గంటల్లోనే మంత్రి కార్యాలయం నుంచి బాలుడి తరుఫు వారికి ఫోన్‌ వచ్చింది. దవాఖాన రిపోర్టులు, దవాఖాన ఎస్టిమేషన్‌ బిల్లులను తెప్పించుకున్నారు. చికిత్స చేయిస్తామని భరోసా ఇచ్చారు. వైద్యం చేయించే స్థోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రెండు కుటుంబాలకు అండగా నిలవడంపై వారి కుటుంబీకులతో పాటు, రెండు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

బాధిత కుటుంబానికి అందుతున్న సాయం..

మండలంలోని లక్కంపల్లి గ్రామానికి చెందిన నవనూర్‌ గంగసాయిలు - గోదావరి దంపతుల కుమారుడు నితిన్‌ చికిత్స కోసం దాతలు విరాళాలు అందజేస్తున్నారు. నితిన్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో హైదరాబాద్‌లోని రెయిన్‌బో దవాఖానలో చికిత్సపొందుతున్నాడు. బాలుడి ఆరోగ్య, కుటుంబ ఆర్థిక పరిస్థితులపై సోషల్‌ మీడియా, దిన పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన పలువురు దాతలు విరాళాలను అందజేశారు. రెండో రోజూ ఆదివారం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు మూడ మహేందర్‌ రూ. లక్ష నగదును బాధిత కుటుంబీకులకు అందజేశాడు. స్వాధ్యాయ పరివారం రూ. 50 వేలు, ఖతర్‌ దేశంలో ఉన్న లక్కంపల్లి గ్రామస్తులు రూ. 20 వేలు, తల్వేదకు చెందిన బుద్దన్నగారి నరేశ్‌ రూ. 10 వేలు విరాళం అందజేశారు.logo