శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Jan 20, 2020 , 03:25:41

నేటితో ప్రచారానికి తెర..!

నేటితో ప్రచారానికి తెర..!
  • -గెలుపే ధ్యేయంగా సాగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రచారం
  • -అన్ని పీఠాలే లక్ష్యంగా గర్జిస్తున్న గులాబీ సైన్యం
  • -అభివృద్ధే ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి..
  • -సోషల్‌ మీడియాలో ప్రచార హోరు

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారహోరుకు నేటితో తెరపడనున్నది. సోమవారం సాయంత్రం 5గంటల వరకే ప్రచారం చేసుకొనే అవకాశం ఉండడంతో అభ్యర్థులు నేడు పోటాపోటీగా ప్రచారం నిర్వహించనున్నారు. బహిరంగ సభలు నిర్వహించుకోవడం, లౌడ్‌స్పీకర్ల వినియోగం సోమవా రం సాయంత్రం 5 తర్వాత నిషేధం. ఆ తర్వాత అంతర్గత ప్రచారానికే అభ్యర్థులు పరిమితమవుతారు. ఈ నెల 22న మున్సిపల్‌ ఎన్నికలు ఉండడంతో దీనికి రెండు రోజుల ముందుగానే ప్రచారం సమాప్తం చేయాల్సి ఉం టుంది. ఎన్నికల నియమావళిని అనుసరించి ప్రతి అభ్య ర్థి దీన్ని పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటన సైతం విడుదల చేశారు. నేటితో ప్రచార గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వరకు ముమ్మర ప్రచా రం చేసిన అభ్యర్థులు.. సోమవారం(నేడు) సాయంత్రం వరకు చివరి సారిగా మళ్లీ గల్లీలు చుట్టేందుకు సిద్ధమయ్యారు.  ఎక్కడికక్కడ ప్రచార రథాలన్నీ మూలకు చేరనున్నాయి. హోరెత్తించిన మైకుల చప్పుళ్లు మూగబోనున్నాయి. సాయంత్రం 5గంటల తర్వాత ఎవరూ ప్ర చారం చేసినా.. కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద కేసులు నమోదు చేసేందుకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఈనెల 22 జరిగే పోలింగ్‌కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 25న ఫలితాలు ప్రకటిస్తారు.

హోరాహోరీగా సాగిన ప్రచారం..

పురపోరులో భాగంగా వారం రోజుల పాటు అభ్యర్థులు నువ్వా నేనా అనే రీతిలో హోరాహోరీగా ప్రచారం చేశారు. ఈసారి సంక్రాంతి పండుగ మధ్యలో వచ్చినా.. ఆరోజు నుంచే ప్రచారాన్ని ఆరంభించారు. పండుగ రోజు సైతం ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. తక్కువ సమయాన్ని వినియోగించుకొనే క్రమంలో చలి ని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే గల్లీబాట పట్టారు. ఇంటింటికీ తిరుగుతూ తమకే ఓటేయాలంటూ ఎవరికి వారే తమదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. బుధవారం నుంచి ఉధృతంగా మొదలైన ప్రచార కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ పెద్ద ఎత్తున భాగస్వామ్యమైంది. జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, మహ్మద్‌ షకీల్‌, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్‌, రాజేశ్వర్‌తో పాటు పార్టీ జిల్లా ఇన్‌చార్జి తుల ఉమ, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బాపురెడ్డి, ఎమ్మెల్సీ ఫరూఖ్‌ హుస్సేన్‌ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. పోలింగ్‌ తేదీ దగ్గర పడడంతో ప్రచారంలో వెనుకబడిన అభ్యర్థులను అప్రమత్తం చేస్తూ, వార్డుల వారీగా స్థితిగతులను అంచనా వేస్తూ మంత్రి, ఎమ్మెల్యేలు కదనరంగంలో దూసుకుపోతున్నారు.

మైకుల హోరు... ప్రచార జోరు..

డివిజన్‌లు, వార్డుల వారీగా ఆయా పార్టీల్లో పోటాపోటీగా ప్రచారం హోరెత్తుతోంది. ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా ప్రచారాన్ని సవాల్‌గా తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా గులాబీ సైన్యం వినూత్నంగా ప్రజల మధ్యకు వెళ్లి ఓటర్లను కలుసుకుంటున్నారు. బల్దియా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ.. జిల్లాలోని నిజామాబాద్‌ నగర పాలక సంస్థతో పాటు బోధన్‌, ఆర్మూరు, భీమ్‌గల్‌ మూడు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతోంది. బల్దియా ఎన్నికల్లో పోటాపోటీ ప్రచారానికి నేటితో తెర పడనుండడంతో చివరి రోజు వీలైనంత మందిని కలుసుకొని ఓట్లను అభ్యర్థించే పనిలో నాయకగణం నిమగ్నమైంది. వారం రోజుల నుంచి ఏకధాటిగా సాగుతోన్న ప్రచార హోరుకు నేటి సాయంత్రం 5గంటలకు ఫుల్‌స్టాప్‌ పడనుంది. దీంతో సమయాన్ని వృథా చేయకుండా ప్రజల్లో కలియ తిరిగేందుకు నేతలంతా ప్లాన్‌ వేసుకున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయంలోపే ప్రచారానికి ముగింపు పలకడంతో పాటుగా కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను గౌరవించాలనే ఆలోచనతోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులంతా సిద్ధమయ్యారు. ఇంతకు ముందు ఎన్నికల ప్రచారమంటే కాలనీల్లో గోడల మీద రాతలు కనిపించేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకోవడం, వారి మద్దతును కూడగట్టుకోవడంలో పోటీ ఏర్పడడంతో అభ్యర్థులకు కత్తిమీది సాములా మారింది. మారిన పరిస్థితులకు అ నుగుణంగా అభ్యర్థులందరూ ఓటర్లను తమవైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలోనూ ప్రచార సందడి..

అభ్యర్థుల ప్రచారం ఊపందుకోగా.. మరికొద్ది గంటల్లోనే ప్రచారానికి పరిసమాప్తం పడనుంది. అయితే, ఈసారి జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల రణరంగంలో సామాజిక మాధ్యమాల పాత్ర అంతా ఇంత కాదు. పోటీలో నిలిచిన వారిలో అత్యధికులు చదువుకున్న వారే కావడంతో ఓటర్లను కలుసుకొనేందుకు సులువుగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌ వంటి సౌకర్యాలను వాడుకుంటున్నారు. ప్రచారానికి సంబంధించిన అంశాలను ఫొటోలు తీయడం, ఆకట్టుకునే విధంగా వాటిని రూపకల్పన చేసి గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. అంతేకాక, అభ్యర్థుల వీడియో సందేశాలు, ఫొటోలతోనూ సందేశాత్మక వీడియోలను క్రియేట్‌ చేస్తూ ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా సెల్‌ఫోన్లకు పంపుతుండడం విశేషం. సా మాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం కొత్త తరహాలో సాగుతోంది. మనుషులు కనిపించకున్నప్పటికీ.. చెప్పాలనుకున్నదీ సులువుగా ఓటర్లకు చేరవేస్తున్నారు. పండుగలొస్తే శుభాకాంక్షలు, విషాధ సమయంలో సంతాపాలకే కాకుండా.. ఎన్నికల సమయంలో ప్రచారాలకూ సో షల్‌ మీడియాను అభ్యర్థులు వేదికగా మార్చుకుంటున్నా రు. జిల్లాలో బరిలో ఉన్న అభ్యర్థులు, వారి అనుచరులు, ఔత్సాహికులు, నాయకులు, కార్యకర్తలు ఈ సౌకర్యాన్ని తమకు అనుకూలంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇంటర్నెట్‌ సాయంతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని మార్మోగిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎవరి ప్రచారం వారిదే అన్నట్లుగా పోటాపోటీగా కనిపిస్తుండడం విశేషం.logo