శనివారం 06 జూన్ 2020
Nizamabad - Jan 20, 2020 , 03:23:39

ఇందూరులో.. అభివృద్ధి పరుగులు

ఇందూరులో.. అభివృద్ధి పరుగులు
  • -ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పనులన్నీ పూర్తి
  • -నగరానికి కలికితురాయిగా యూజీడీ
  • -తుదిదశకు కలెక్టరేట్‌, ఐటీ హబ్‌ నిర్మాణాలు
  • -సుందరీకరణ దిశగా అడుగులు

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఇందూరు రూపురేఖలు సుందరంగా మారుతున్నాయి. హైదరాబాద్‌ తర్వాత శర వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ఇందూరు పేరు కూడా చేరింది. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంగా ఉండే పట్టణం.. నగరంగా ఏర్పా టు చేశాక సుందరంగా రూపుదిద్దుకుంటున్నది. తెలంగాణ వచ్చిన తర్వాతే నిజామాబాద్‌ సిటీ శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. ఇక్కడ ఎంపీగా కల్వకుంట్ల కవిత ప్రాతినిథ్యం వహించడం, స్వతహాగా ఇంజినీరైన అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా ప్రత్యేక చొరవ చూపారు. మంత్రి కేటీ రామారావు సహకారంతో భారీగా నిధులు రప్పించడంలో కవిత, ఎమ్మెల్యే సక్సెస్‌ అయ్యారు. నగరం విస్తరించడంతోపాటు అదే స్థాయిలో సౌకర్యాల మెరుగు, మెట్రోపాలిటన్‌ సిటీల మాదిరిగా అభివృద్ధి హంగులు తోడు కావడం, ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఉపయోగపడుతున్నాయి. సెంట్రల్‌ లైటింగ్‌, సెంట్రల్‌ మీడియన్‌, పార్కులు, మినీ ట్యాంక్‌బండ్‌, గల్లీగల్లీకీ తారు రోడ్లు ఇలా.. సౌకర్యాలు, అభివృద్ధి పరుగులు తీస్తున్నది. స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకునే క్రమంలో కీలకమైన యూజీడీ పనులు పూర్తి కావడం నగరానికి కలికితురాయిగా చెప్పుకోవచ్చు. ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా యూజీడీ పనులను పూర్తి చేయించి, విమర్శకుల చేత శభాష్‌ అనిపించుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నగరాభివృద్ధిపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. పకడ్బందీ ప్రణాళికతో సిటీని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించిన ఎమ్మెల్యే.. వాటిని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అదే విషయాన్ని ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు. ఐదారేండ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నగరాభివృద్ధిలో కీలకపాత్ర పోషించి తనదైన ముద్రను వేసుకున్న సందర్భంగా నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..


ఇంజినీర్‌గా ఇందూరుపై అర్బన్‌ ఎమ్మెల్యే ముద్ర..


స్వతహాగా ఇంజినీరైన అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా.. నగరాభివృద్ధిలో తనదైన ముద్రవేసుకుంటున్నారు. నగరంలో ఎన్నో ఏండ్లు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు మోక్షం కల్పించడంతోపాటు కొత్త కొత్త ప్రాజెక్టులు నగరానికి తీసుకురావడంతో సఫలీకృతులవుతున్నారు. మాజీ ఎంపీ కవిత సహకారం, మంత్రి కేటీఆర్‌తో ఉన్న చొరవతో నగరాభివృద్ధికి కావాల్సిన నిధులను తీసుకువచ్చి ఎప్పటికప్పుడు ఇక్కడి సమస్యలను పరిష్కరిండంలో సక్సెస్‌ అవుతున్నారు. అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. కొందరైతే ఏకంగా ‘డెవలప్‌మెంట్‌ స్టార్‌' అని ఆయనను ముద్దుగా పిలవడం గమనార్హం. దగ్గరుండి పనులు చేయించడంలో, అనుకున్నది సాధించడంలో ఆయన సిద్ధహస్తుడు. నగర సుందరీకరణ పనులు ప్రస్తుతం పరుగులు పెడుతున్నాయి. దీని వెనుక ఆయన ఎనలేని కృషి  ఉంది. గతంలో ఏ పాలకుడూ పట్టించుకోని పనులను అర్బన్‌ ఎమ్మెల్యే ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఓ మహాయజ్ఞంలా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను పూర్తి చేయించారు. ఐటీ హబ్‌ ఏర్పాటులో ఆయన కృషి ఎనలేనిది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్‌యూబీ పనులు రాకెట్‌ స్పీడ్‌తో కొనసాగుతున్నాయి.

యూజీడీ పూర్తి చేసి.. శభాష్‌ అనిపించుకొని..

మహా యజ్ఞంలా చేపట్టిన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు ఎస్టీపీ -1, ఎస్టీపీ -2 మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసి ప్రజలకు అంకితమిచ్చారు అర్బన్‌ ఎమ్మెల్యే. దీని కోసం ఆయన రాత్రింబవళ్లూ కష్టపడ్డారు. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. నిధుల విడుదల విషయంలో మాజీ ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్‌ సహకారాన్ని తీసుకొని పనులు ఆగకుండా చూసుకున్నారు. అనుకున్న సమాయానికి పనులను పూర్తి చేయించారు. నగరాన్ని స్మార్ట్‌ సిటీగా మార్చే క్రమంలో కీలకమైన ఈ యూజీడీ పనులు పులిమీద స్వారీలా మారినా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. స్వతహాగా ఆయన ఇంజినీర్‌ కావడంతో పనుల్లో వేగాన్ని పెంచగలిగారు. నాణ్యతతో కూడిన పనులను చేయించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఇపుడు ఎస్టీపీలు రెండూ పూర్తికావడంతో ఇంటింటికీ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఇక మురుగు కాలువలను స్ట్రామ్‌వాటర్‌ డ్రైనేజీలుగా వినియోగిస్తారు. దీంతో దోమల బెడద తప్పనుంది. ఎన్నో ఏండ్లుగా  ఎదురుచూసిన ఈ పనులు  అర్బన్‌ ఎమ్మెల్యే కృషితో పూర్తయ్యాయి. రూ. 98వేల కోట్లతో మొదలుపెట్టిన అమృత్‌ పథకంలో భాగంగా వాటర్‌ ట్యాంకులు, లైన్లు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.  అలీసాగర్‌ నుంచి  ఫిల్టర్‌బిడ్డ్‌ వరకు  రా వాటర్‌ను తీసుకువచ్చి ఇక్కడ ఫిల్టర్‌ చేసే కార్యక్రమం జరుగుతున్నది.  ఈ పనులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేపట్టారాయన.

కొత్త కలెక్టరేట్‌తో దశ మారనున్న సిటీ..

కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాను వేరు చేశారు. కొత్త జిల్లాలకే కలెక్టరేట్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అయితే మాజీ ఎంపీ కవిత ఇక్కడ ఉన్న పాత కలెక్టరేట్‌ మరీ పురాతనమైనదని సీఎం దృష్టికి తీసుకెళ్లి.. కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి ఒప్పించారు. దీంతో సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని దుబ్బ గిరిరాజ్‌కాలేజీ బైపాస్‌ రోడ్డులో చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. వచ్చే ఏడాది జనవరిలో పూర్తి చేయాలని  భావిస్తున్నారు.

ఐటీహబ్‌తో ఇందూరుకు కొత్త హోదా..

మెట్రోపాలిటన్‌ సిటీలకే పరిమితమైన ఐటీహబ్‌ను ఎమ్మెల్యే ఇందూరుకు తీసుకురాగలిగారు. ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌తో మాట్లాడి.. ఇందూరు ఐటీహబ్‌ నిర్మాణానికి కావాల్సిన వనరులను సమకూర్చగలిగారు. దీనికి సంబంధించి పలు ఒప్పందాలు చేయించడంతో బిగాల గణేశ్‌గుప్తా కీలకంగా వ్యవహరించారు.  ప్రస్తుతం ఐటీహబ్‌ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఆర్‌యూబీ పనులకు మోక్షం...

ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే అండర్‌ బ్రి డ్జి పనులు అర్బన్‌ ఎమ్మెల్యే చొరవతో వడివడిగా కొనసాగుతున్నాయి. నగరంలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌పడనుంది. ఈ పనులు చేపట్టేందుకు ఎన్నో ఆటంకాలు ఎదురైనా వాటన్నింటినీ అదిగమించి పూర్తి దశకు తీసుకువచ్చారు. త్వరలో ఆర్‌యూబీ  పనులు పూర్తి కానున్నాయి. ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి.

మారుతున్న నగర రూపురేఖలు..

నగరం రూపురేఖలు సుందరంగా మారుతున్నాయి. రోడ్లన్నీ అద్దాల్లా మెరుస్తున్నాయి. యూజీడీ పనులు పూర్తి కావడంతో నగర సుందరీకరణపై అర్బన్‌ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.  సెంట్రల్‌ మీడియన్‌, రోడ్లు, డివైడర్‌ పనులు, డ్రైనేజీల నిర్మాణం, నగర సుందరీకరణ తదితర పనులన్నీ ఒకదానికొకటి పోటీ పడుతూ కొనసాగుతున్నాయి.  కలెక్టరేట్‌, ఐటీహబ్‌ ప్రాంతానికి నాలుగు రోడ్ల విస్తరణ, సెంట్రల్‌ లైట్‌ మీడియన్‌ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.  ప్రధాన కూడళ్ల వద్ద ఇప్పటికే పూర్తయిన రోడ్లు నగరానికి కొత్తందాలను తీసుకువచ్చాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.logo