గురువారం 04 జూన్ 2020
Nizamabad - Jan 19, 2020 , 02:20:23

అర్వింద్‌కు అభివృద్ధి పట్టదు!

అర్వింద్‌కు అభివృద్ధి పట్టదు!
  • -ఇందూరు వాసులు ఆనందంగా ఉంటే ఆయన భరించలేడు..
  • -ప్రజల్లో వైషమ్యాలు తెచ్చేందుకు ప్రయత్నం
  • -బీజేపీలో కొత్త బిచ్చగాడి పాత్ర ఆయనది
  • -అభివృద్ధి, సంక్షేమం మా ప్రచారాస్ర్తాలు
  • -టీఆర్‌ఎస్‌కే ప్రజల బ్రహ్మరథం
  • -ఎంఐఎంకు మేయర్‌ సీటు ఇస్తానని మాటిచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా..
  • -‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా
నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్‌ నగర ప్రజలు సంతోషంగా జీవించడం ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఇష్టం లేదని , అందుకే ప్రశాంతంగా ఉన్న నగరంలో కల్లోలం రేపి రాక్షసానందం పొందేందుకు ఆయన రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని, ప్రజల్లో వైషమ్యాలు పెంచుతున్నాడని .. అభివృద్ధి, సంక్షేమం ఆయనకు పట్టదని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా ధ్వజమెత్తారు. బీజేపీలో అర్వింద్‌ పాత్ర కొత్త బిచ్చగాడి వేషంలా ఉందని, నీతులు చెబుతూ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ అభాసు పాలవుతున్నాడని విమర్శించారు. అర్వింద్‌ నేపథ్యం ఏమిటో అందరికీ తెలుసన్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా ఎదిగాడో ప్రజలకు తెలుసునని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు నీతి సూత్రాలు చెబితే చెవిలో పువ్వులు పెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. నలభై నుంచి నలభై ఐదు సీట్ల వరకు టీఆర్‌ఎస్‌ గెలుచుకొని మేయర్‌ పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎంకు తాను మేయర్‌ సీటు ఇస్తానని మాటిచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు ఇవి...

నమస్తే: మున్సిపల్‌ ఎన్నికల్లో మీ ప్రధానాస్ర్తాలు ఏమిటీ?

ఎమ్మెల్యే: చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలే ప్రధానాస్ర్తాలు. మా హయాంలో చేసిన అభివృద్ధి, రానున్న రోజుల్లో చేయబోయే అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. 

మీ హయాంలో ఏమేర నగరాభివృద్ధి జరిగింది?

ఎమ్మెల్యే: నిజామాబాద్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. నలభై సంవత్సరాలుగా అభివృద్థిలో కుంటుపడిన నిజామాబాద్‌ నగరంలో.. చెప్పుకోదగిన అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగింది. ప్రధానంగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, రూ. 98 కోట్లతో తాగునీటి వ్యవస్థ, మిషన్‌ భగీరథ, రోడ్ల పునరుద్ధరణ, రైల్వే బ్రిడ్జి, పార్కుల నిర్మాణం, ప్రధాన కూడళ్ల వద్ద సెంట్రల్‌ మీడియం, బటర్‌ ైప్లె లైటింగ్‌ పనులు పూర్తి చేశాం.

ఇంజినీరుగా నగరాభివృద్ధిలో మీ ప్రాత ఏమిటీ?

ఎమ్మెల్యే: ప్రతి పనిని అధికారులకు, కాంట్రాక్టర్లకు వదిలేయకుండా ప్రముఖ ఆర్కిటెక్ట్‌లతో నమూనా లు చేయించి పనిచేయించా. దీనికి ఉదాహరణ ము న్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం. తెలంగాణ రా ష్ట్రంలో ఎక్కడా ఇలాంటి మున్సిపల్‌ కార్యాలయం లేదు. అలా నూతనంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముస్తాబవుతున్నది. ప్రధాన కూడళ్లను హైదరాబాద్‌ తరహాలో ఇందూరులో తీర్చిదిద్దాం. శ్మశాన వాటికలు నిర్మాణంలో ఉన్నాయి. హైదరాబాద్‌లోని మహాప్రస్థానానికి ధీటుగా నిర్మాణం కాబోతున్నాయి. రఘునాథ్‌ చెరువు మినీట్యాంక్‌ బండ్‌గా రూపుదిద్దుకోబోతున్నది.

ఎంపీ అర్వింద్‌ ఆరోపణలపై మీ కామెంట్‌?

ఎమ్మెల్యే: జిల్లాలో బీజేపీ అంటే యెండల లక్ష్మీనారాయణ, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, అల్జాపూర్‌ శ్రీనివాస్‌గా చెప్పవచ్చు. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్నట్లు, కొత్తగా మతం తీసుకున్న వాడికి పట్టింపులు ఎక్కువగా అన్నట్లు, అర్వింద్‌ ఏ కుటుంబం నుంచి వచ్చిండు.. ఆయన బ్యాక్‌ గ్రౌండ్‌ ఏమిటి అనేది యావత్‌ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఈ రోజు వచ్చి నేను బీజేపీలో కొనసాగుతున్నాను  అంటే నమ్మడానికి ఎవరూ ఇక్కడ సిద్ధంగా లేరు.

కాంగ్రెస్‌, బీజేపీల తెరవెనుక పొత్తు కొనసాగిస్తున్నారని అంటున్నారు.. మీ కామెంట్‌?

ఎమ్మెల్యే: కాంగ్రెస్‌, బీజేపీలు సిద్ధాంతాలు వదిలి టీ ఆర్‌ఎస్‌పై పోటీకి తట్టుకోలేక తెరవెనుక ఒక్కటయ్యా రు. ప్రజలందరూ ఇది గమనిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కుమ్మకైన మాట వాస్తవమే. టీఆర్‌ఎస్‌ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఇతర పార్టీలు ఎంత బురదజల్లే ప్రయత్నం చేసినా.. ప్రజలు నమ్మరు. టీఆర్‌ఎస్‌ వైపు నడుస్తున్నారు. కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

గతంలో చేయని అభివృద్ధి గురించి ప్రచారంలో ఏం చెబుతున్నారు?

ఎమ్మెల్యే: యువతీయువకుల కోసం ఐటీహబ్‌ నిర్మాణం కాబోతున్నది. కేవలం కొత్త జిల్లాల్లోనే నూతన కలెక్టరేట్‌ భవన సముదాయం నిర్మిస్తుండగా.. పాత జిల్లా అయిన ఇందూరులో సైతం నిర్మాణ పనులు చేపడుతున్నాం. అవి చివరి దశలో ఉన్నాయి. బైపాస్‌ రోడ్లు నాలుగులైన్లుగా విస్తరణ జరుగుతున్నది. నిజామాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసుకున్నాం. 1974లో రూపొందించిన మాస్టర్‌ప్లానే ఇప్పటికీ అమలవుతున్నది.  వాస్తవానికి ఇరవై ఏండ్లకు ఒకసారి మాస్టర్‌ప్లాన్‌ మార్చాలి. కానీ, గతంలో అలా జరగలేదు. దీంతో నగరాభివృద్ధిపై ప్రభావం చూపింది. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే కొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాం.

మేయర్‌ పీఠం మీదే అంటున్నారు? ఇంకా ఏం చేయబోతున్నారు

ఎమ్మెల్యే: తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరం  వరంగల్‌. కరీంనగర్‌, ఖమ్మం  కూడా పెద్ద నగరాలే. హైదరాబాద్‌ తర్వాత నిజామాబాదే సుందర నగరంగా తీర్చిదిద్దే విధంగా పనులు చేస్తాం. రాబోయే కాలంలో ప్రజలకు కచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. అదే ప్రచారంలో చెబుతున్నాం. ప్రజలకు మాపై విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏం చెప్పామో అదే చేస్తూ వచ్చాం. ఇకపై కూడా చేసిన ప్రతి వాగ్ధానం నెరవేరే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. అభివృద్ధిపై పట్టుదల, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ధే అంకుఠిత దీక్ష నా సొంతం. ఆ విషయం నగర ప్రజలకు తెలుసు. మరో రెండేళ్లలో నగరాన్ని మరెంతో అభివృద్ధి చేస్తా. అది ప్రజలే చూస్తారు. అమెరికా, దుబాయ్‌లలో ఉండే చాలామంది నగరానికి వచ్చి, ఇక్కడ అభివృద్ధిని చూసి స్వయంగా నన్ను కలిసి అభినందించారు. వారెవరో కూడా నాకు తెలియదు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకొని ఇందూరును చూసిన వారు ఇప్పటి పరిస్థితిని పోల్చి చూసుకుని మా పనితనం ఏమిటో స్వయంగా తెలుసుకొని వారే అభినందిస్తున్నారు.

ప్రచారంలో సంక్షేమ పథకాల గురించి ఎలా వివరిస్తున్నారు?

ఎమ్మెల్యే: టీఆర్‌ఎస్‌ పాలనలో అన్నివర్గాలకు మేలు జరుగుతున్నది. రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్‌ ఇస్తున్నాం. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అమలు చేస్తున్నాం. కేసీఆర్‌ కిట్‌ అందిస్తున్నాం. పెద్ద ఎత్తున గురుకులాలు, మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థిపై ఏటా రూ. 1.20 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఆసరా పింఛన్లతో ఎందరికో సామాజిక భద్రత కల్పిస్తున్నాం. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నాం. అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఏ ఒక్క వర్గాన్ని ప్రభుత్వ విస్మరించడం లేదు.

గతంలో మేయర్‌ సీటు టీఆర్‌ఎస్‌ తీసుకొని, ఈ సారి ఎంఐఎంకు వదిలిపెడతామని మీరు మాటిచ్చినట్లు అర్వింద్‌ ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఏమంటారు?

ఎమ్మెల్యే: ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. చరిత్ర కలిగిన మహిమాన్విత నీలకంఠేశ్వర స్వామిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఐదుసార్లు అయ్యప్ప మాల వేసుకున్న భక్తుడిగా అయ్యప్ప స్వామి పై ప్రమాణం చేసి చెబుతున్నాను. నేనేవరికి మాటివ్వలేదు. మాటిచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా. నా చాలెంజ్‌ను అర్వింద్‌ స్వీకరించి ముందుకు రావాలి. నైతికంగా ఓటమిని అంగీకరించి టీఆర్‌ఎస్‌ గెలుపును ప్రకటించేసి దింపుడుగళ్లెం ఆశలో భాగంగా అబద్ధాపు ప్రచారాలు చేస్తున్నాడు అర్వింద్‌. గుడిని, గుడిలో లింగాన్ని మింగే రకం ఆయనది. అర్వింద్‌ అబద్ధాల ప్రచారంపై ఎల్‌ఐసీ చౌరస్తాలో చర్చకు సిద్ధం. దమ్ముంటే సవాల్‌ స్వీకరించి చర్చకు రావాలి.

యూజీడీ పనులు సాహసోపేతంగా పూర్తి చేశారు. దీనిపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది?

ఎమ్మెల్యే: అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ(యూజీడీ) అనేది చాలా చాలెంజింగ్‌ ప్రాజెక్టు. వాస్తవానికి ఏ నాయకుడు కూడా ఈ సాహసం చేయరు. తవ్విన రోడ్లు దుమ్మూ లేసి, ట్రాఫిక్‌ జామ్‌ అయి, ప్రజలతో అభాసు పాలవుతారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని ఎవరూ దాన్ని ముట్టుకోరు. కానీ, ఒక మహాయజ్ఞంలా రాత్రింబవళ్లు కష్టపడి యూజీడీ పనులను పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందాం. ఎస్టీపీని కూడా ప్రారంభించుకుని ఇందూరు నగర ప్రజలకు అంకితమిచ్చాం. టెక్నాలజీని ఉపయోగించి  88 ఎకరాలు సేకరించిన స్థలంలో కేవలం 17 ఎకరాలకు కుదించి.. 71 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడుకోగలిగాం. ఆ 71 ఎకరాల స్థలంలో 25 ఎకరాల్లో కలెక్టరేట్‌ నిర్మాణం, మూడున్నర ఎకరాల్లో ఐటీహబ్‌, మిగతా ప్రాంతంలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. యూజీడీ పనులు పది, పన్నెండు సంవత్సరాల క్రితం మొదలైనప్పటికీ మధ్యలో ఈ పనులు ఆగిపోయాయి. మధ్యలో ఈ పనులన్నీ నిలిచిపోతే మళ్లీ నిధులు కేటాయించుకుని పనులను పూర్తి చేశాం. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు ముట్టుకుంటే గెలవడం కష్టమని చాలామంది హెచ్చరించారు. ప్రజల మీద ప్రేమ, నమ్మకముండి, ఓప్పించగలుగుతానే నమ్మకంతో ఈ పనులను పూర్తి చేశా. ప్రజలు ఆశీర్వదించి, రెట్టింపు మెజార్టీతో నన్ను మళ్లీ గెలిపించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆశీర్వదిస్తారు.logo