శనివారం 06 జూన్ 2020
Nizamabad - Jan 19, 2020 , 02:19:25

అర్వింద్‌వి బట్టేబాజ్‌ మాటలు

అర్వింద్‌వి బట్టేబాజ్‌ మాటలు
  • - ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచాడు
  • - పింఛన్లలో కేంద్రం వాటా చారానా కూడా లేదు
  • -ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శ
  • - తనతో చర్చకు రావాలని ఎంపీకి సవాల్‌


నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భీమ్‌గల్‌: ఎంపీ ధర్మపురి అర్వింద్‌వి పక్కా బట్టేబాజ్‌ మాటలని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్కెఫెడ్‌ చైర్మన్‌, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి లోక బాపురెడ్డితో కలిసి పట్టణంలోని 3వార్డులో లత లింబాద్రి, 4వ వార్డులో భగత్‌, 5వ వార్డులో బొదిరె నర్సయ్య, 6వ వార్డులో సీహెచ్‌ గంగాధర్‌ను గెలిపించాలని మంత్రి ప్రచారంలో కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గౌరవప్రదమైన హోదాలో ఉన్న నాయకులు అబద్ధాలు ఆడడం మంచిది కాదన్నారు. అబద్ధాలు మాట్లాడే ఎంపీ అర్వింద్‌ లాంటి మనిషి దేశానికే మంచిది కాదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అబద్ధాలతో ప్రజలను బోల్తా కొట్టించాడని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లలో కేంద్రం వాటా బారానా ఉందంటూ సిగ్గు లేకుండా ఎంపీ అబద్దాలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. కేంద్రం వాటా బారానా కాదు కదా.. చారానా కూడా లేదని వివరించారు. రాష్ట్రంలో పింఛన్లకు టీఆర్‌ఎస్‌ సర్కారు రూ. 9,230 కోట్లు ఖర్చు చేస్తుంటే.. కేంద్రం ఇస్తున్నది కేవలం రూ. 200 కోట్లు మాత్రమేనని అన్నారు. ఒక పింఛన్‌ లబ్ధిదారుడికి రాష్ట్రం రూ. 2,016 ఇస్తుంటే.. అందులో కేంద్రం ఇస్తున్నది రూ. 46 మాత్రమేనని మంత్రి లెక్కలతో సహా వివరించారు.

 నిజాలు ఇలా ఉంటే.. ఎంపీ అర్వింద్‌ అబద్ధ్దాలు ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు. ఈ విషయంపై భీమ్‌గల్‌లోని లింబాద్రిగుట్టపై ఒట్ట్టేసి మాట్లాడుదాం రమ్మంటే.. ఎంపీ అర్వింద్‌ చప్పుడు చేయడం లేదన్నారు. తెలంగాణలో పేద ఆడబిడ్డల పెండిండ్లకు కల్యాణలక్ష్మి కింద అందిస్తున్న రూ. లక్ష కేంద్రమే ఇస్తున్నదని సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. కల్యాణలక్ష్మి పథకంలో కేంద్రం వాటా ఏకానా లేదన్నారు. 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్‌ అందించే జాబితా సిద్ధమవుతోందన్నారు. మరో రెండు నెలల్లో వీరందరికీ పింఛన్లు అందుతాయని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల వేళ అన్ని పార్టీల అభ్యర్థులు వస్తారని, వారు చెప్పేది విని ఆగం కాకుండా.. బాగా ఆలోచించి పనిచేసే వారికే ఓటు వేయాలని ఓటర్లను కోరారు. గత పాలకులు భీమ్‌గల్‌ అభివృద్ధిని పట్టించుకోలేదని గ్రహించాలని కోరారు. భీమ్‌గల్‌లో నీటి గోస తీర్చిన ఘనత టీఆర్‌ఎస్‌దే అన్నారు. గతంలో రూ.200 పింఛన్‌ మాత్రమే వచ్చేదన్నారు. అది కూడా ఒకరు చనిపోతే ఆ స్థానంలో మరొకరికి వచ్చే దరిద్రపు పరిస్థితి ఉండేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక అర్హత కలిగిన వారందరికీ పింఛన్‌ ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. బీజేపీ నాయకులు మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. భీమ్‌గల్‌లో త్వరలోనే రూ. 21 కోట్లతో వంద పడకల దవాఖాన ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. భీమ్‌గల్‌కు సమీపంలో రూ. 6 కోట్లతో మరో చెక్‌డ్యాం నిర్మిస్తామన్నారు. భీమ్‌గల్‌లో 3వేల ఎకరాలకు రూ. 30 కోట్లతో కాళేశ్వరం నీటిని అందించే పనులు త్వరలో పూర్తవుతాయని తెలిపారు. పట్టణంలో దాదాపు 70 గదులతో ఎకరా స్థలంలో పట్టణ ప్రజలందరికీ ఒకేచోట కూరగాయలు, చికెన్‌, మటన్‌ ఒకే చోట లభ్యమయ్యేలా రూ. కోటితో చక్కని మార్కెట్‌ నిర్మిస్తామన్నారు. ఈ మార్కెట్లో చేపలు విక్రయించుకోవడానికి గంగపుత్రులు, పండ్లు విక్రయించుకోవడానికి ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. భీమ్‌గల్‌లో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయిస్తానన్నారు.  భీమ్‌గల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. logo