గురువారం 04 జూన్ 2020
Nizamabad - Jan 18, 2020 , 03:09:32

దమ్ముంటే చర్చకు రా!

దమ్ముంటే చర్చకు రా!మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతున్నది. ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో ముందున్నది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం భీమ్‌గల్‌ బల్దియాలో పలు వార్డుల్లో ప్రచారంలో పాల్గొన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా ఉదయం నుంచి రాత్రి వరకు అనేక వార్డుల్లో ప్రచారంలో పాల్గొని క్యాడర్‌లో ఉత్సాహంగా నింపారు. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ ప్రచార సభలో పాల్గొన్నారు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్డు షోల్లో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు, అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
-నిజామాబాద్‌ యంత్రాంగం

-జోరుగా సాగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రచారం
-భీమ్‌గల్‌లో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి
-ఆర్మూరులో రోడ్డు షోల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
-డివిజన్లను చుట్టేసిన ఎమ్మెల్యేలు గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి
-బోధన్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌


నిజామాబాద్‌,నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భీమ్‌గల్‌: ధర్మపురి అర్వింద్‌ ఎంపీ హోదాలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కారు ఇస్తున్న పింఛన్లపై అబద్ధాలు ఆపాలని హితవు పలికారు. పింఛన్ల పై కేంద్రం ఎంత ఇస్తుందో.. రాష్ట్ర ఎంత ఇస్తున్నదో లింబాద్రిగుట్ట నర్సింహా స్వామి పై ఒట్టువేసి మాట్లాడుదాం.. దమ్ముంటే చర్చకు రా.. అని అర్వింద్‌కు మంత్రి సవాల్‌ విసిరారు. శుక్రవారం భీమ్‌గల్‌ పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరపున మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 8వ వార్డులో జోగినిపల్లి సతీశ్‌ గౌడ్‌, ఒకటో వార్డులో కన్నె ప్రేమలత, రెండు వార్డులో ధరవాత్‌ లింగయ్య, పదో వార్డులో తుమ్మ భూదేవిలను కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ ఆయా వార్డుల్లో కాలినడకన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో పింఛన్లకు కేసీఆర్‌ సర్కారు ఏటా రూ. 9,230 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇందులో మోదీ ప్రభుత్వం ఇచ్చేది బోడి 200 కోట్ల రూపాయలు మాత్రమేనని వివరించారు. కేంద్రమే బారానా శాతం ఇస్తోందని అర్వింద్‌ చెబుతున్న అబద్ధాల ను నమ్మవద్దని ప్రజలను కోరారు. పింఛన్‌కు ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 2016 ఇస్తుంటే.. అందులో కేంద్రం ఇచ్చేది కేవలం 46 రూపాయలు మాత్రమేనని అన్నారు. దీనిని ప్రజలు గమనించాలని కోరారు. అర్వింద్‌ తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడని అన్నారు. అర్వింద్‌లాగా తాను వ్యక్తిగత విమర్శలు చేయనని అన్నారు. తనకు రూ. 50వేల కోట్లు ఉన్నాయని, తనపై అర్వింద్‌ అసత్యాలు మాట్లాడుతున్నాడని, దమ్ముంటే భీమ్‌గల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు రావాల ని.. అక్కడ ‘నా ఆస్తులు, నీ పేరు మీద.. నీ ఆస్తులు నా పేరు మీద రాసుకుందాం’ అని మంత్రి సవాలు విసిరారు. బాండ్‌ పేపర్‌ రాసిస్తా అని మాత్రం అనకుసుమా.. అని అర్వింద్‌కు సూచించారు. ‘నా భార్య, పిల్లల, తండ్రి ఆస్తుల న్నీ నీకు రాసిస్తా.. నా ఆస్తి నీవు తీసుకో’ అంటూ భీమ్‌గల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు రావడానికి సిద్ధా మా అంటూ సవాల్‌ విసిరారు. పసుపుబోర్డు పై పూటకో మాట మాట్లాడుతున్నావంటూ విమర్శించారు. 

అభివృద్ధి కృషి చేసిన టీఆర్‌ఎస్‌కు ఓటేయండి...

భీమ్‌గల్‌ పట్టణ అభివృద్ధికి కృషి చేసిన టీఆర్‌ఎస్‌కు ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులందని గెలిపించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కోరారు. ఈ ఎన్నికలు కేసీఆర్‌ కోసమో, ప్రశాంత్‌రెడ్డి కోసమో కాదన్నారు. భీమ్‌గల్‌కు అన్ని రకాల సౌకర్యాలను తీసుకువచ్చే వారి కోసం జరిగే ఎన్నికలు ఇవి అన్నారు. పుట్టెడు కష్టాలతో నెట్టుకొచ్చిన భీమ్‌గల్‌ ఇప్పుడిప్పుడే కష్టాల్లోంచి బయటపడుతుందన్నారు. రూ. 20 కోట్లతో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలు పెట్టించి పోచంపాడ్‌ ప్రాజెక్టు నుంచి గంగనీళ్లను ఇంటికి చేర్చి భీమ్‌గల్‌ పట్టణానికి అందించి తాగునీటి గోస తీర్చిన, భీమ్‌గల్‌లో రోడ్లు వేసిన టీఆర్‌ఎస్‌ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రూ. 2016 పింఛన్‌ ఇస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేద్దామా... లేదా రూ.200 మాత్రమే ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటేద్దామా అనేది ఆలోచించాల్సిన అవసరముందన్నారు. భీమ్‌గల్‌ పట్టణ ప్రజలకు ఏం కావాలో తనకు బాగా తెలుసునని, ఏ సంతకం కావాలన్నా వేల్పూర్‌కు వస్తే సరిపోతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అర్వింద్‌ అబద్ధాలను నమ్మి ఎంపీగా అభివృద్ధి, సేవలు అందించిన కల్వకుంట్ల కవితను ఓడగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అబద్ధాలతో వస్తున్న అర్వింద్‌ను ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. పువ్వు గుర్తు పార్టీ వాళ్లు హిందువులు, ముస్లింలు అంటూ వస్తారని, మనమంతా ఐక్యంగా ఉండాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే భీమ్‌గల్‌ అభివృద్ధి బాధ్యత తాను చూసుకుంటానని పునరుద్ఘాటించారు. పేదల పెండిండ్లకు, శుభకార్యాలకు రూ. కోటి ఫంక్షన్‌ హాల్‌, రూ. కోటి అన్ని రకాల సదుపాయాలతో మార్కెట్‌ నిర్మిస్తామన్నారు. పట్టణంలో సెంట్రల్‌ లైటింగ్‌ చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రూ. 21 కోట్లతో వంద పడకల దవాఖాన ఏర్పాటు చేయించి భీమ్‌గల్‌ పట్టణ ప్రజలకు చక్కని వైద్య సౌకర్యం అందుబాటులోకి తెస్తానని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి తుల ఉమ, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి, రాష్ట్ర నాయకులు కొండ ప్రకాశ్‌ గౌడ్‌, డాక్టర్‌ మధుశేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, ఎంపీపీ ఆర్మూర్‌ మహేశ్‌, జడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, జడ్పీకోఆప్షన్‌ మెంబర్‌ మొహీజ్‌, తదితరులు పాల్గొన్నారు.

పతంగులెగరేసిన మంత్రి

భీమ్‌గల్‌ ప్రచారంలో భాగంగా అక్కడ కేసీఆర్‌ బొమ్మలతో ఉన్న పతంగులను కొందరు యువకులు ఎగురవేస్తుండడాన్ని చూసిన మంత్రి.. వారి వద్దకు వెళ్లి తను పతంగులు ఎ గురవేశారు. పిల్లలతో సరదాగా కాసేపు ముచ్చటించారు. కేసీఆర్‌ పతంగులను ఎగురవేస్తూ ఆ యువకులు ఈలలు వేయడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కాసేపు ప్రచార అలసటను మరిచారు. సరదాగా వారితో కలిసి పతంగి ఎగురవేసి ఆకట్టుకున్నారు.
logo