సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Jan 18, 2020 , 03:08:42

పనిచేసే అభ్యర్థులకే పట్టంకట్టాలి

పనిచేసే అభ్యర్థులకే పట్టంకట్టాలి


ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి

ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో సకల జనుల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తుందని, రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజల బాగోగుల కోసం పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకోవాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ ము న్సిపల్‌లో శుక్రవారం రాత్రి ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి లోకబాపురెడ్డితో కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్‌ పట్టణంలోని 11, 12, 13, 15,16, 17, 30, 33, 34, 35  వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులతో కలిసి జీవన్‌రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పలు కూడళ్ల వద్ద మాట్లాడుతూ.. ఆర్మూర్‌కు ప్రాతినిథ్యం వహించిన హేమాహేమీలు చేయలేని, చేతగాని ఎన్నో అభివృద్ధి పనులు చేయించడం జరిగిందన్నారు. ఆర్మూర్‌లోని ఆర్టీసీ రోడ్‌, ఆలూర్‌ బైపాస్‌రోడ్డు, సిద్ధుల గుట్టఘాట్‌ రోడ్ల నిర్మాణాలను చేపట్టామన్నారు. తన చిన్నతనంలో ఆలూర్‌ రోడ్డులో స్వయంగా ఇక్కడ ఇబ్బందులు పడ్డానని, ప్రజల ఇబ్బందులు స్వయంగా చూశానన్నారు. తాను మేనమామ ఇంట్లో ఉన్న సమయంలో ఎదురైనా సమస్యను తాను ఎమ్మె ల్యే అయి పూర్తి చేయించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఆలూర్‌ రోడ్డు వాసుల కళ అయినా బైపాస్‌రోడ్డును తన హా యంలో నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. ఆలూర్‌బైపాస్‌ రోడ్డు నిర్మాణం కోసం రైతులను ఒప్పించి నష్టపరిహారం ఇప్పించానన్నారు. రైతాంగానికి రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటును అందిస్తున్నట్లు చెప్పారు. ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులను నింపుతూ రైతుల పంటల నీరందిస్తున్నామన్నారు. పసుపు బోర్డు సాధనకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి ఢిల్లీతో పాటు, ఇతర రాష్ర్టాల్లో ఎందరినో కలిసిన విషయం మీకందరికీ తెలిసిందేనన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పసుపు బోర్డు కోసం ఏన్నో ప్రయత్నాలు చేశామన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన 5 గంటల్లోనే పసుపు బోర్డు తెస్తానని ప్రగల్భాలు పలికిన వారు ఏక్కడున్నారని ప్రశ్నించారు. మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు పసుపు బోర్డు వచ్చింది అనే కొత్త రకం నాటానికి తెరలే పారన్నారు. మొన్నటి వరకు రాదు అన్నవాడు.. ప్రస్తుతం ఓట్ల కోసం వస్తుంది అంటే నమ్మేవారు లేరన్నారు. బీజేపీ చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఆర్మూర్‌ పట్టణాభివృద్ధికి రూ.700 కోట్ల నిధులను తీసుకొచ్చి టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున అభివృద్ధి చేశామన్నారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఆర్మూర్‌ పట్ణణ అభివృద్ధి కళ్లారా చూసిన మీరు ఆలోచన చేసి ఓట్లు వేయాలన్నా రు. పని చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీని, తమ పార్టీ బలపర్చి బరిలో నిలిపిన కౌన్సిలర్‌ అభ్యర్థులను కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ వార్డుల అభ్యర్థులు తలారి మీనా చందు, తాటి హన్మండ్లు, పండిత్‌ వినీత, కోలు గంగామోహన్‌చక్రు, భారతి ఏనుగంటి, సుంకరి ఈశ్వరి, అయేషాషీరిన్‌, మీరా వనిత, లక్ష్మి గాండ్ల, రూప సడాక్‌ తదితరులు పాల్గొన్నారు.
logo