ఆదివారం 31 మే 2020
Nizamabad - Jan 18, 2020 , 03:06:46

మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దే..

 మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దే..
  • -మా గెలుపును ముందే అంగీకరించిన బీజేపీ
  • -ఎంఐఎంకు పీఠం ఇస్తామంటూ తప్పుడు ప్రచారం అందుకే..
  • -మేం చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది
  • -అర్వింద్‌లా.. బాండు పేపర్‌తో డ్రామాలు ఆడడం మాకు రాదు..
  • -మీడియాతో అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దేనని.. బీజేపీ సైతం టీఆర్‌ఎస్‌ గెలుపును అంగీకరించిందని, అందుకే ఎంఐఎంకు మేయర్‌ పదవి ఇస్తారంటూ ఆ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీలు తెరవెనుక అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ చేసిన సర్వేలోనే కాదు.. ఎంపీ అర్వింద్‌ చేపించిన సర్వేలో కూడా 60 సీట్లలో 45 నుంచి 50 సీట్లు టీఆర్‌ఎస్‌కు వస్తాయని తేలిందని, అందుకే ఆయన ప్రస్టేషన్‌లో మతపరమైన విషయాలను తీసుకొచ్చి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ప్రజలంతా గమనిస్తున్నారని, కుట్ర రాజకీయాలకు చరమగీతం పాడుతారని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి కర్రుకాల్చి వాతపెడతారని విమర్శించారు. అంతకు ముందు రోడ్ల విస్తరణ ద్వారా భవనాలన్నీ కూలగొడతారని బీజేపీ తప్పుడు ప్రచారం చేసి అభాసుపాలైన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎక్కడా ఏ బిల్డింగ్‌నూ కూలగొట్లలేదని, కరెంటు స్తంభాలను జరిపి రోడ్లు విస్తరించి అభివృద్ధి చేశామన్నారు. ప్రజలకు తనపై అచంచల విశ్వాసం ఉందని, ఏదైనా అనుకుంటే చేస్తారనే నమ్మకం వారిలో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వివాదరహితుడిగా, మంచి నాయకుడిగా, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న లీడర్‌గా గుర్తుంపు పొందానని, రాజకీయాల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు ఏనాడూ గురిచేయలేదని ఎంపీ అర్వింద్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఎక్కడో గొడవలు జరిగితే ఇక్కడ ధర్నా చేసి ప్రజలను రెచ్చగొట్టాలని అర్వింద్‌ కుట్రలు పన్నారని, మనుషుల మధ్య మతవిద్వేశాలు రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూశారని దుయ్యబట్టారు. బీజేపీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో మొత్తం టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయని, దీన్ని బట్టే ప్రజలకు తెలిసిపోయిందని, బీజేపీ వచ్చి నగరానికి చేసేదేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నానని, నగరాభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నానని బిగాల గణేశ్‌ గుప్తా సవాల్‌ విసిరారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఎంపీ అర్వింద్‌కు ఆయన హితవు పలికారు. పది సీట్లు వచ్చిన్నాడే టీఆర్‌ఎస్‌ మేయర్‌ సీటు కైవసం చేసుకున్నదని, 45 సీట్లకు పైగా గెలిచేందుకు అవకాశం ఉన్నప్పుడు మేయర్‌గా వేరెవరికో ఇవ్వబోమన్నారు. గతంలో బీజేపీ నుంచి రెండు సార్లు చైర్మన్‌గా ఉండి, నిజామాబాద్‌ ఎమ్మెల్యేగా ఉండి నగరాభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు తెలుసునని అన్నారు. అధికారంలోకి వస్తే ఊర్ల పేర్లు మారుస్తామంటూ బీజేపీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఊర్ల పేర్లు మారిస్తే పేదలకు కడుపునిండుతుందా? అని ఆయన ప్రశ్నించారు.

పసుపు బోర్డు ఏర్పాటుపై డ్రామాలు..

పసుపు బోర్డు తెస్తానంటూ ఎంపీ అర్వింద్‌ బాండ్‌పేపర్‌ డ్రామాలు ఆడారని ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా ధ్వజమెత్తారు. తర్వాత పసుపు బోర్డు అవసరం లేదని, అంతకన్నా మెరుగైనది తెస్తానని ప్రకటించి.. మళ్లీ ఎన్నికల వేళ పసుపుబోర్డు తెస్తున్నానంటూ ప్రచారం చేసుకోవడం ఆయన మోసపూరిత విధానాలకు అద్దం పడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ది బాండు పేపర్లు రాసిచ్చే సంస్కృతి కాదని, చెప్పిందే చేస్తామని, చేసేదే చెప్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో గుండాయిజం, రౌడీయిజం లేకుండా చేశామని, అంతకు ముందు నగరాన్ని అరాచకశక్తులు ఏలేవవన్నారు. రూ. 98 కోట్లతో అమృత్‌ పథకం కింద ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ప్రధాన కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, రోడ్లన్నీ బాగు చేశామన్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) పనులను పూర్తి చేసి ప్రజలతో శభాష్‌ అనిపించుకున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో నుడా చైర్మన్‌ చామకూర ప్రభాకర్‌రెడ్డి,  టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, సీనియర్‌ నాయకులు సుదం రవిచందర్‌, సుజిత్‌సింగ్‌ ఠాకూర్‌, సత్యప్రకాశ్‌, ఎనగందుల మురళి, దారం సాయిలు, రాజేంద్రప్రసాద్‌, బాబురావు, శంకర్‌, శ్రీహరి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
logo