శనివారం 30 మే 2020
Nizamabad - Jan 17, 2020 , 01:48:39

నట్టల నివారణతోనే జీవాలకు రక్షణ

నట్టల నివారణతోనే జీవాలకు రక్షణ


కోటగిరి :  గొర్రెలు, మేకల పెంపకంలో లాభనష్టాలు వాటి ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. పెంపకదారులు జీవాలను తరుచుగా గమనిస్తూ అనారోగ్యం బారిన పడిన వాటికి చికిత్స చేయించారు. ఇందులో భాగంగా పశుసంవర్ధ్దక శాఖ ఆధ్వర్యంలో జీవాలకు ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం 22 వ తేదీ వరకు కొనసాగనుంది. గడువుతో సంబంధం లే కుండా ఎప్పుడైనా పశువైద్యశాలలో నట్టల నివారణ మం దులు పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు నట్టలతో జీవాల్లో ఎదురయ్యే అనారోగ్య సమస్యల నివారణ ద్వారా లాభాలను వెల్లడించారు.

జిల్లాలో 8,92,158 జీవాలు..

జిల్లా వ్యాప్తంగా గొర్రెలు, మేకలు కలిపి మొత్తం 8,92,158 ఉన్నాయి. ఇందులో గొర్రెలు 7,34,768, మేకలు 1,57,390 ఉన్నాయి. వీటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత పెంపకందారులపై ఉంది. ఈ క్రమంలో వాటి సంరక్షణ, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏటా మూడుసార్లు నట్టల నివారణ మందు తాగించాలి. దీంతో జీవాలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వాటి ఉత్పత్తి కూడా పెరుగుతుంది.
 

నట్టల్లో రెండు రకాలు..

నట్టల్లో రెండు రకాలు ఉంటాయి. గొర్రెల శరీరంపైన, లోపల పరాన్న జీవులతో గొర్రెలు, మేకల్లో ఆరోగ్యపరం గా, ఉత్పత్తి, పునరుత్పత్తి పరంగా సమస్యలు ఎదురవుతా యి. ఫలితంగా వాటి పెంపకందారులకు ఆర్థికంగా నష్టాలు కలుగుతాయి. అందుకే కాలానుగణంగా గొర్రెలు, మేకల కు నట్టల మందు తాగిస్తూ నట్టలను నిర్మూలించాలి. పొట్ట జలగలు, కార్జపు జలగలు, రక్తపు జలగలు అనేవి ముఖ్యమైన అంతర పరాన్న జీవులు. అంతర పరాన్న జీవులు  జీవాల శరీరంలోని ముఖ్య భాగాలు, అవయవాల్లో నివసిస్తాయి. గుడ్లు పెడుతూ సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ ఆయా భాగాలను కొరుకుతూ హాని కలిగిస్తాయి. జీవాలు తిన్న మేత జీర్ణమై రక్తంలో కలిసే సమయంలో నట్టలు  ఆ జీర్ణ రసాన్ని పీల్చేస్తాయి. తద్వారా జీవాల్లో ఎదుగుదల కుంటుపడుతుంది. రోగాలను తట్టుకొనే శక్తి తగ్గిపోయి మేత సరిగా మేయలేవు. జీవాలు బరువు కోల్పోవడం ద్వారా మాంసం దిగుబడి తగ్గుతుంది.

నివారణ చర్యలు..

పశుసంవర్ధ్దక శాఖ క్రమం తప్పకుండా ఏటా మూడు పర్యాయాలుగా ఉచితంగా నట్టల నివారణ మందు పంపి ణీ చేస్తుంది. నట్టల నివారణకు ముందు పేడ పరీక్ష చేసి ఈ ప్రాంతంలో ఏ రకమైన నట్టలు ఉన్నాయో తెలుసుకొని దానికి సరైన మందు అందించాలి. తద్వారా వాడిన నట్టల నివారణ మందు ప్రభావవంతంగా పనిచేస్తుంది. గొర్రెల వయస్సు, శరీర బరువు, మందు రకం మొదలైన అంశాలను బట్టి నట్టల మందు మోతాదును నిర్ణయిస్తారు. ఈ మోతాదు ఎప్పటికీ ఒకేలా ఉండదు. జీవాల పెంపకందారులు పశువైద్యుల సలహాల మేరకు నట్టల నివారణ మందు తాగించాలి.

ఉపయోగించే పద్ధతి..

వానాకాలానికి ముందు చలికాలంలో, ఎండాకాలం లో నట్టల మందు తప్పక తాగించాలి. ఎందుకంటే వానా కాలంలో నీటి కుంటలు వాన నీటి ప్రవహంతో కలుషితమవుతాయి. అలాంటి నీటి ద్వారా కొన్ని రకాల నట్టలు జీవాల శరీరంలోకి ప్రవేశిస్తాయి. వేసవిలో నీటి వనరులు తగ్గిపోతూ నీటి కుంటలు, బురద కుంటలు చిక్కగా తయారవుతాయి. ఆ నీటిని జీవాలు తాగితే కూడా నట్టలు ప్రవేశిస్తాయి. ఈ మేరకు ఏటా మూడు కాలాల్లో గొర్రెలు, మేకలకు తప్పనిసరిగా నట్టల నివారణ మందు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
 

మందు ద్వారా ప్రయోజనాలెన్నో..

జిల్లాలో మొత్తం 8,92,158 జీవాలు ఉన్నా యి. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది లో మూడు దఫాలుగా ఉచితంగా నట్టల నివారణ మం దులను సరఫరా చేస్తున్నది. గొర్రెలు, మేకల పెంపకదారులు జీవాలకు నట్టల నివారణ మందు తప్పక వేయించాలి. తద్వారా గొర్రె పిల్లల మరణాలు తగ్గుతాయి. వ్యాధులు కూడా చాలా వరకు అరికట్టవచ్చు. గొర్రెలు, మేకలు సకాలంలో ఎదకు వస్తుంటాయి. చూడు కట్టే శాతం, ఈనే శాతం పెరుగుతుంది. గొర్రెల సగటు బరువుతో పాటు మాంసం దిగుబడి పెరుగుతుంది. మందలు ఆరోగ్యంగా ఉంటాయి.
- బాలిక్ అహ్మద్, జిల్లా పశువైద్యాధికారిlogo